వణికించిన భూకంపం
ABN, Publish Date - Dec 05 , 2024 | 03:32 AM
తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భూమి కంపించింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత 5 కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 7.27 గంటల సమయంలో ములుగులోని మేడారం కేంద్రంగా 3-7 సెకన్ల పాటు కొనసాగిన ప్రకంపనలతో కొన్ని చోట్ల ఇళ్ల గోడలు, నేల బీటలువారాయి.
రాష్ట్రంలో 5.3 తీవ్రతతో కంపించిన భూమి
ఉదయం 7.27కు ప్రకంపనలు
3 నుంచి 7 సెకన్ల వరకు ప్రభావం
మేడారంలో 40 కి.మీ. లోతులో కేంద్రం
హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, వరంగల్,
కరీంనగర్, నల్లగొండ జిల్లాలపై ప్రభావం
ఏపీలోనూ పలు ప్రాంతాల్లో ప్రకంపనలు
భయంతో ఇళ్ల నుంచి ప్రజల పరుగులు
నేను కూడా ఆందోళనతో బయటకొచ్చా ములుగు కలెక్టర్ దివాకర
వారంపాటు తదనంతర ప్రకంపనలు!
డేంజర్ జోన్‌లో భద్రాద్రి.. హైదరాబాద్ సేఫ్
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భూమి కంపించింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత 5 కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 7.27 గంటల సమయంలో ములుగులోని మేడారం కేంద్రంగా 3-7 సెకన్ల పాటు కొనసాగిన ప్రకంపనలతో కొన్ని చోట్ల ఇళ్ల గోడలు, నేల బీటలువారాయి. జనం భయంతో ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. వాహనాలపై వెళ్తున్నవారు ఏం జరుగుతోందో తెలియక కంగారుపడ్డారు. ఉదయం వాహ్యాళికి వెళ్లినవారు ఉలిక్కిపడ్డారు. మేడారం వద్ద భూమిలో 40 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలంగాణ విపత్తు నిర్వహణ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ తెలిపారు. భూకంప తీవ్రత 5.3గా నమోదైనట్లు వివరించారు. ఎక్కువ లోతులో భూకంపం రావడం వల్ల.. ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదు. అయితే.. భూకంప ప్రభావం 225 కిలోమీటర్ల వరకు కనిపించింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మొదలు.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, జగ్గయ్యపేట, నందిగామ, ఏలూరు, విశాఖపట్నం వరకు భూప్రకంపనలు నమోదయ్యాయి. మూడు దశాబ్దాల(1969లో 5.7 తీవ్రత) తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఇదే పెద్ద భూకంపమని, వారం రోజుల వరకు భూకంప తదనంతర ప్రకంపనల ముప్పు పొంచి ఉండవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అయితే.. తెలంగాణ రాష్ట్రం జోన్-3, 2ల్లో ఉన్నందున పెద్దగా ప్రమాదం ఉండదని చెబుతున్నారు.
సీసీ కెమెరాల్లో దృశ్యాలు..
భూకంప ప్రభావం గోదావరి పరీవాహక ప్రాంతాలపై ఎక్కువగా కనిపించింది. ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ, వరంగల్, హనుమకొండ, ఉమ్మడి నల్లగొండ, కరీంనగర్‌తోపాటు.. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలపై కనిపించింది. ములుగులో.. ముఖ్యంగా మేడారం పరిసరాల్లో భూకంపానికి ముందు కుక్కలు అసాధారణంగా అరిచాయని, పక్షులు అరుస్తూ కల్లోలంగా తిరిగాయని స్థానికులు తెలిపారు. మేడారం సమ్మక్క, సారలమ్మల గద్దెల వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో భూమి కంపించిన దృశ్యాలు స్పష్టంగా నమోదయ్యాయి. కొంతసేపు అసలేంజరుగుతుందో అర్థంకాలేదని.. ఒక్కసారిగా భూమి కంపించడం తో భయమేసిందని సమ్మక పూజారి సిద్దబోయిన ఆనం ద్, సారలమ్మ పూజారి కాక కిరణ్ తెలిపారు. కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, అశ్వరావుపేట వంటి ప్రాంతాల్లోనూ భూమి కంపించిన దృశ్యాలు సీసీ టీవీల్లో రికార్డయ్యాయి. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ క్రీడా మైదానంలో దాదాపు మీటర్ లోతు గొయ్యి ఏర్పడిందని, ఇళ్లలోని పాత్రలు కిందపడ్డాయని, కొన్ని ఇళ్లకు బీటలు వచ్చాయని స్థానికులు పేర్కొన్నారు. హనుమకొండ 8వ డివిజన్ ఇందిరానగర్‌లో ఓ భవనం రెయిలింగ్ కూలింది. వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి ఎలాంటి ముప్పు వాటిల్లలేదని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ దేశాయ్ వివరించారు. భూకంపం తర్వాత పైకప్పుపై తనిఖీలు చేశామన్నారు. కాకతీయుల కాలంలో నిర్మించిన సమయంలో సాండ్‌బాక్స్ టెక్నాలజీలో పునాదులను నిర్మించినా.. పకడ్బందీగా ఉండేలా అదనపు ఏర్పాట్లు చేశామన్నారు.
భూకంపానికి కారణాలేమిటి?
మేడారం-ఐలాపూర్ అడవుల్లో భూకంపం రావడానికి కారణాలేమిటనే కోణంపై జియాలజిస్టులు దృష్టిసారించారు. కొన్ని రోజుల క్రితం ఈ ప్రాంతంలో టోర్నడోల్లాంటి ఈదురుగాలులకు 500 ఎకరాల్లోని లక్షకు పైగా చెట్లు నేలకొరిగిన విషయం తెలిసిందే..! భూకంపానికి ఇది సంకేతమా? అనే అనుమానాలు వ్యక్తమైనా.. ఆ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని జియాలజిస్టులు తెలిపారు. మేడారం-ఐలాపూర్ అడవులు గోదావరి పరీవాహకంలో ఉండడమే భూకంపానికి కారణమని అంచనా వేస్తున్నారు.
గోదావరి పరీవాహకాల్లో ముప్పు! డేంజర్ జోన్‌లోనే భద్రాద్రి
తెలంగాణలో కేవలం గోదావరి పరీవాహకాల నుంచి భూకంపాలు వచ్చే ముప్పు ఉందని ఉస్మానియా విశ్వవిద్యాలయ భూభౌతిక శాస్త్ర విభాగం విశ్రాంత ప్రొఫెసర్ జి.రాందాసు తెలిపారు. 1872, నవంబరు 22న సిరోంచాలో 5.0 తీవ్రతతో.. 1969లో భద్రాచలంలో 5.7 తీవ్రతతో భూకంపాలు నమోదైన విషయాన్ని గుర్తుచేశారు. ‘‘ఈ ప్రాంతాల్లో వచ్చిన భూకంపాలు భద్రాద్రికి తూర్పు దిశలో కేంద్రాలుండేవి. ఈసారి మాత్రం పశ్చిమ దిశలో భూకంప కేంద్రం ఉంది. సాంకేతికంగా చూస్తే.. ఇది ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది..! గోదావరి భూగర్భంలో రెండు ఫలకాలు ఉంటాయి. ఒకటి ఆదిలాబాద్ జిల్లా కడెం ప్రాజెక్టు కింద ఉంటే.. రెండోది కిన్నెరసాని ప్రాజెక్టు కింద ఉంటుంది. ఈ రెండూ భద్రాద్రి వద్ద కలుస్తాయని భావిస్తుంటారు. బస్తర్ ఫలకం ముందుకు-వెనక్కి కదులుతుండడం వల్ల శక్తి విడుదలవుతుంది. ఆ సమయంలో ఎటువైపు ఖాళీ ఏర్పడితే.. ఆ ప్రాంతంలో భూకంపం సంభవిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో మానవ తప్పిదాలతోపాటు.. ప్రకృతి ప్రకోపం కూడా భూకంపాలకు కారణంగా చెప్పవచ్చు. కడెంలోనూ పిల్లర్ కుంగే అవకాశాలున్నాయి. అప్పట్లో భూగర్భ సర్వే చేయలేదని ప్రభుత్వమే పేర్కొంది. దీనిపై ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉంది’’ అని ఆయన వివరించారు. ఎన్‌జీఆర్‌ఐ విశ్రాంత శాస్త్రవేత్త నగేశ్ కూడా గోదావరి పరీవాహకాల్లో భూకంపాలకు ఆస్కారముందని పేర్కొన్నారు. భద్రాద్రి డేంజర్ జోన్‌లోనే ఉందని వెల్లడించారు. గడిచిన 56 ఏళ్లలో భద్రాచలం ప్రాంతంలో చిన్నాచితకా కలిపి 199 భూకంపాలు వచ్చాయని సమాచారం ఉందన్నారు. 1969 ఏప్రిల్ 13న పర్ణశాల భూకంపం(5.5 తీవ్రత) ఇప్పటి వరకు పెద్దది కాగా.. చివరిసారి 2018 ఆగస్టు 15న 3.8 తీవ్రతతో నమోదైందని గుర్తుచేశారు.
నేను కూడా భయంతో బయటకొచ్చా
ఉదయం భూమి కంపించగానే నేను కూడా భయంతో భయటకు వచ్చాను. ఆందోళనకు గురయ్యాను. వెంటనే జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశా. ఆస్తి, ప్రాణనష్టం జరిగితే.. వెంటనే సమాచారం అందించాలని సూచించా.
- ములుగు కలెక్టర్ దివాకర
హైదరాబాద్ సేఫ్ జోన్
భూకంపాల తీవ్రత తెలుగు రాష్ట్రాల్లో తక్కువగా ఉంటుందని ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్త ఎం.శేఖర్ తెలిపారు. ఈ ప్రాంతాలు సెస్మిక్ జోన్-2, 3లో ఉండడమే ఇందుకు కారణమని వివరించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జోన్-2లో ఉందని, పెద్దగా ప్రమాదం ఉండదని ఎన్‌జీఆర్‌ఐ డైరెక్టర్ డాక్టర్ ప్రకాశ్‌కుమార్ తెలిపారు. భూకంపాలకు ఆకాశ హార్మ్యాలకు సంబంధం లేదని వివరించారు. జపాన్‌లో ఇంతకు మించి హైరైజ్ భవనాలు ఉంటాయని, అయినా.. భూకంపాలను తట్టుకుని, సురక్షితంగా ఉన్నాయని పేర్కొన్నారు. జపాన్ మాదిరిగా ప్రమాణాలతో భవనాలను నిర్మిస్తే.. రిక్టర్ స్కేల్‌పై 8 తీవ్రతతో భూకంపం వచ్చినా.. ఇబ్బంది ఉండదని చెప్పారు. 54 ఏళ్లలో తెలుగు రాష్ట్రాల్లో 12 భూకంపాలు మాత్రమే కాస్త పెద్దవిగా నమోదయ్యాయని ఆయన గుర్తుచేశారు. 5.0 నుంచి 5.9 మధ్య వీటి తీవ్రత ఉందని గుర్తుచేశారు. 1983లో మేడ్చల్‌లో 4.9, 1976లో గండిపేటలో 3.5 తీవ్రతతో భూకంపం వచ్చిందని, చివరిసారి 2001లో బోరబండలో 3లోపు తీవ్రతతో భూమి కంపించినట్లు శేఖర్ వివరించారు. బోరబండ భూకంపం.. వర్షపునీరు ఇంకడం వల్ల వచ్చి ఉంటుందని, భూగర్భంలోని పైపొరల్లో భూకంప కేంద్రం ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని ఎన్‌జీఆర్‌ఐ విశ్రాంత శాస్త్రవేత్త శ్రీనగేశ్ గుర్తుచేశారు. భవన నిర్మాణ అనుమతులను భూకంప జోన్లకు అనుగుణంగా ఇస్తే.. భవిష్యత్‌లో ఇబ్బందులు ఉండబోవని అభిప్రాయపడ్డారు. అయితే.. ప్రకృతిని కాపాడినంతకాలమే హైదరాబాద్ సేఫ్‌జోన్‌లో ఉంటుందని, గుట్టలను ధ్వంసం చేసినా.. చెరువులను ఆక్రమించినా.. భూగర్భ జలాలను ఇష్టారాజ్యంగా తోడేసినా.. పరిస్థితులు మారుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
మేడారంలో అనూహ్య పరిణామాలు
మేడారం-ఐలాపూర్ అడవులు ఇటీవలి కాలంలో విపత్తులు, అనూహ్య పరిణామాలతో వార్తలకెక్కుతున్నాయి. దీంతో ఈ ప్రాంతంపై వాతావరణ శాఖ అధికారులు, జియాలజిస్టులు దృష్టిసారిస్తున్నారు.
2024 ఆగస్టు 31న సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7 గంటల సమయంలో తాడ్వాయి-మేడారం అడవుల్లో పెద్తఎత్తున సుడి 323 హెక్టార్లలో లక్ష దాకా మహావృక్షాలు నేలకొరిగాయి.
2023 జూలై 27న తెలంగాణ చరిత్రలోనే తొలిసారిగా ములుగు జిల్లా లక్ష్మిదేవిపేటలో రికార్డు స్థాయిలో 64.98సె.మీ వర్షపాతం నమోదైంది.
2019 జూలై 9, 10 తేదీల్లో ఏటూరునాగారం అభయారణ్యం పరిధిలోని ఏటూరునాగారం, వాజేడు, వెంకటాపురం ప్రాంతాల్లో మేఘాలు ఇళ్లను తాకాయి.
2018 జనవరి 23న మేడారంలోని కోట్లమంది భక్తులకు ఇలవేల్పుగా భావించే సమ్మక్క తల్లి కొలువై ఉండే చిలుకల గుట్టపై తెల్లని పొగ రూపంలో భీకర వేగంతో సుడిగాలులు తిరిగాయి. పరిసరాల్లో పెద్దఎత్తున దుమ్మురేగింది.
Updated Date - Dec 05 , 2024 | 03:32 AM