ఆ భూమిపై ఆధారాలు చూపండి
ABN, Publish Date - Nov 29 , 2024 | 03:09 AM
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో భూదాన్‌బోర్డుకు చెందిన భూమి చేతులు మారడంపై ఓ సంస్థతోపాటు నలుగురు వ్యక్తులకు భూదాన్ బోర్డు కార్యదర్శి నోటీసులు పంపారు.
ఈడీ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈఐపీఎల్‌తోపాటు నలుగురికి నోటీసులు
100 ఎకరాల భూదాన్ భూమిలో 50 ఎకరాలు అమ్మేసినట్లు పేర్కొన్న ఈడీ
6న ఆధారాలతో హాజరుకావాలి.. భూదాన్ బోర్డు కార్యదర్శి ఆదేశాలు
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం భూముల వ్యవహారం
హైదరాబాద్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో భూదాన్‌బోర్డుకు చెందిన భూమి చేతులు మారడంపై ఓ సంస్థతోపాటు నలుగురు వ్యక్తులకు భూదాన్ బోర్డు కార్యదర్శి నోటీసులు పంపారు. నాగారంలో భూదాన్ బోర్డు పరిధిలో ఉన్న 100 ఎకరాల్లో సుమారు 50 ఎకరాలు చేతులు మారినట్లు ఇటీవల ఈడీ రాష్ట్ర డీజీపీకి అందించిన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. మనీల్యాండరింగ్ నిరోధక చట్టం కింద రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్‌లపై ఈడీ కేసు నమోదు చేసింది. వారిపై ఈడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో నాగారంలో అక్రమ లావాదేవీలు జరిగాయని పేర్కొంది.. దీంతో ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న వివరాల ఆధారంగా భూదాన్ యజ్ఞ బోర్డు కార్యదర్శి తాజాగా ఈఐపీఎల్ గ్రూప్‌తో పాటు ఖాదరున్నీసా, ఎన్ సంతో్‌షకుమార్, బొబ్బిలి విశ్వనాథ రెడ్డి, మహేశ్వర్‌లకు నోటీసులు పంపారు. ఈ నోటీసుల్లో డిసెంబరు 6న సంబంధిత వ్యక్తులు నాంపల్లిలోని బోర్డు కార్యాలయం ఎదుట ఉదయం 11 గంటలకు హాజరు కావాలని పేర్కొన్నారు.
ఆ భూమి తమది అని రుజువు చేసేందుకు నోటీసులు అందుకున్న వారి వద్ద ఉన్న అన్ని ఆధారాలతో రావాలని నోటీసుల్లో సూచించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో సర్వే నం.181/3/2లో 0.11 గుంటల భూమికి సంబంధించి ఖాదరున్సీసా, ఇదే గ్రామంలో సర్వే నం.181/4/1/1/1/1/2/1లో 1.02 ఎకరాలకు సంబంధించి ఎన్.సంతో్‌ష కుమార్‌కు, సర్వే నం.181/4/1/2/1లో 1.20 ఎకరాలకు సంబంధించి బొబ్బిలి విశ్వనాథరెడ్డికి, సర్వే నం.181/4/1/1/1/1/1లో 1.10 ఎకరాలు, 181/1/1/1/1/2/2లో 1.35 ఎకరాలు, 181/4/1/1/1/2లో 3.30 ఎకరాలు, 181/4/1/1/2లో 0.18 గుంటలు, సర్వే నం.181/4/2లో 3.30 ఎకరాలు, 181/5/1/1/1/2లో 3.30 ఎకరాలు ఇలా మొత్తం 33.4 ఎకరాలకు సంబంధించి ఈఐపీఎల్ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి నోటీసులు పంపింది. వీరితోపాటు నాగారంలో సర్వే నం. 181కి సంబంధించిన రికార్డులతో హాజరు కావాలని మహేశ్వరం మండల తహసీల్దార్‌కు కూడా నోటీసులు ఇచ్చారు. ఈ భూముల అక్రమాలకు సంబంధించి గతంలో భూదాన్ బోర్డు ఫిర్యాదు చేసినా పోలీసులు కేసులు నమోదు చేయలేదు. ఈడీ ఎఫ్‌ఐఆర్ నేపథ్యంలో ఈ దఫా కేసులు నమోదు చేయక తప్పని పరిస్థితి పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఏర్పడింది.
భూదాన్ భూముల రిజిస్ట్రేషన్లపై అధికారుల విచారణ బాధ్యులపై కేసు నమోదు
కందుకూరు, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురం గ్రామంలో ఉన్న భూదాన్ భూముల కొనుగోలుకు సహకరించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 28న ‘నాయకుల భూదాహం.. అధికారుల భూదానం’ శీర్షికతో ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై పోలీసులు, రెవెన్యూ అధికారులు స్పందించి ఇన్‌చార్జి ఆర్డీవో అనంతరెడ్డి నేతృత్వంలో విచారణ చేపట్టారు. భూదాన్ భూములు ఎలా రిజిస్ట్రేషన్ జరిగాయనే కోణంలో ఏసీపీ లక్ష్మీకాంతరెడ్డి ఆధ్వర్యంలో సీఐ సీతారాం విచారణ చేపట్టి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తిమ్మాపురం రెవెన్యూ పరిధిలోని 6/1, 147, 167/1, 167/9, 453, 454, 444, 573, 574, 575, 455, 576, 129, 130, 161 సర్వే నంబర్లలో 111 ఎకరాల 11 గుంటల భూదాన్ భూములు ఉన్నాయి. అందులో 39 ఎకరాల 18 గుంటల భూముల రికార్డులు తారుమారు చేసి రియల్ వ్యాపారులు పట్టా భూములుగా మార్పిడి చేసుకున్నారు. ఈ భూముల విలువ మార్కెట్‌లో సుమారు 200 కోట్ల వరకు ఉంటుంది.
Updated Date - Nov 29 , 2024 | 03:09 AM