Hydra: కూల్చివేయకుండా హైడ్రాను అడ్డుకోండి
ABN, Publish Date - Aug 25 , 2024 | 04:24 AM
హైడ్రా తమ ఆస్తుల విషయంలో అక్రమంగా జోక్యం చేసుకుంటోందని, కూల్చివేతలు చేపట్టకుండా అడ్డుకోవాలని కోరుతూ శనివారం పలు విద్యా సంస్థలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.
హైకోర్టులో విద్యా సంస్థల పిటిషన్
వాటిలో అనురాగ్ వర్సిటీ కూడా..
చట్టప్రకారం వ్యవహరించాలని కేసు ముగించిన ధర్మాసనం
హైదరాబాద్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): హైడ్రా తమ ఆస్తుల విషయంలో అక్రమంగా జోక్యం చేసుకుంటోందని, కూల్చివేతలు చేపట్టకుండా అడ్డుకోవాలని కోరుతూ శనివారం పలు విద్యా సంస్థలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీతో పాటు, గాయత్రి ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ట్రస్ట్, నీలిమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ తదితర సంస్థలు హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాయి.
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం కుర్రెముల గ్రామంలోని 813/ఈ, 813/ఈఈ, 813/ఏఏ/2, 813/ఏఏ/1796 సర్వే నంబర్లలోని 17.21 ఎకరాల భూమి, నిర్మాణాల విషయంలో హైడ్రా, ఇతర ప్రభుత్వ శాఖలు జోక్యం చేసుకోవడంతో పాటు విచారణల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నాయని తెలిపాయి. నిర్మాణాలు తొలగించేందుకు సిద్ధమవుతున్న హైడ్రాను అడ్డుకోవాలని కోరాయి. లేదంటే కూల్చివేసే ప్రమాదం ఉందని న్యాయవాదులు పేర్కొన్నారు. వాదనలు విన్న జస్టిస్ టి.వినోద్‌కుమార్ ధర్మాసనం.. నిబంధనల ప్రకారం వ్యవహరించాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ న్యాయవాది హామీ ఇవ్వడంతో కేసును ముగించింది.
Updated Date - Aug 25 , 2024 | 04:24 AM