Lakes: చెరువుల్లో 386 ఎకరాలు మాయం!
ABN, Publish Date - Oct 08 , 2024 | 03:06 AM
హైదరాబాద్ నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లోని చెరువులు, కుంటల్లో అంతులేని ఆక్రమణలు చోటుచేసుకున్నాయి.
హైదరాబాద్‌లో 44 నీటి వనరులు పూర్తిగా కనుమరుగు
మరో 127 చోట్ల పెద్దమొత్తం విస్తీర్ణంలో ఆక్రమణలు
పదేళ్లలో భారీగా కబ్జాలు!.. బీఆర్‌ఎస్ నేతలే అధికం!
మరికొన్నిచోట్ల ప్రతిపక్ష స్థానిక నాయకుల హస్తం
ఔటర్ వరకు 695 చెరువులున్నట్లు గుర్తింపు
ప్రభుత్వ రికార్డులు, ఉపగ్రహ చిత్రాల ద్వారా పరిశీలన
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లోని చెరువులు, కుంటల్లో అంతులేని ఆక్రమణలు చోటుచేసుకున్నాయి. ప్రత్యేకించి గడిచిన పదేళ్లకాలంలో అత్యధికంగా చెరువులు కబ్జాకు గురయ్యాయి. ఔటర్ రింగ్ రోడ్డు వరకు మొత్తం 695 చెరువులు ఉన్నట్లు ప్రభుత్వ రికార్డులు చెబుతుండగా.. ఇందులో 2014 నుంచి 2023 మధ్య కాలంలోనే 44 చెరువులు పూర్తిగా కబ్జాలకు గురై కనుమరుగయ్యాయి. మరో 127 చెరువుల్లో పెద్ద మొత్తం విస్తీర్ణం ఆక్రమణల పాలైంది. మొత్తంగా ఆయా చెరువులన్నింట్లో కలిపి గత పదేళ్లలో 386.71 ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు అధికారులు తేల్చారు. వీటిలో శాశ్వత, తాత్కాలిక నిర్మాణాలు వెలిశాయి.
రెవెన్యూ, ఇరిగేషన్ రికార్డులతోపాటు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్‌ఆర్‌ఎ్‌ససీ) వద్ద తీసుకున్న శాటిలైట్ చిత్రాల ద్వారా చెరువుల స్థితిని అధికారులు పరిశీలించారు. ఆక్షాంశం, రేఖాంశం ఆధారంగా ఒక్కో చెరువు 2014 వరకు ఎంత విస్తీర్ణంలో ఉంది, ప్రస్తుతం ఎన్ని ఎకరాల్లో ఉందనేది అంచనా వేశారు. తద్వారా ఆక్రమణల లెక్క తేల్చారు. అభివృద్ధి విస్తరణ క్రమంలోనే ఈ ఆక్రమణలు జరుగుతూ.. చెరువులు, కుంటలు కనుమరుగవుతున్నట్లు స్పష్టమవుతోంది. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ ఆక్రమణల తంతు మొదలైనా.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత కూడా ఇది ఆగలేదు. పైగా, అంతకన్నా ఎన్నో రెట్లు పెరిగింది. తెలంగాణ ఏర్పాటుకు ముందు అంగుళం ఆక్రమణకు కూడా గురికాని 77 చెరువుల్లో.. 20 చెరువులు గత పదేళ్లలో పూర్తిగా కనుమరుగు కావడమే ఇందుకు నిదర్శనం. మరో 57 చెరువులు పాక్షికంగా కబ్జా చెరలో చిక్కాయి. వీటికితోడు.. గతంలో కొంత విస్తీర్ణం మేరకు ఆక్రమణకు గురైన 94 చెరువుల్లో 24 చెరువులు ఈ పదేళ్లలో పూర్తిగా కనుమరుగయ్యాయి. మరో 70 చెరువుల్లో ఆక్రమణలు పెరిగిపోయాయి.
2014 తరువాతే పెద్దమొత్తంలో కబ్జా..
ప్రభుత్వ రికార్డుల ప్రకారం.. 2014 వరకు 499 చెరువుల్లో ఎలాంటి ఆక్రమణలు లేవని, ఆ తరువాతి కాలంలోనే కబ్జాకు తెర లేచిందని అధికారులు పేర్కొంటున్నారు. రియల్ బూమ్ పెరగడం, భూముల ధరలు రూ.కోట్లలో పలుకుతుండడంతో ఆక్రమణలు చోటుచేసుకున్నాయని అంటున్నారు. మట్టి పోసి చదును చేసి, కొన్ని చోట్ల ప్లాట్లు చేసి విక్రయిస్తే.. ఇంకొన్ని చోట్ల తాత్కాలికంగా షెడ్లు వేసి, అనంతరం పక్కా భవనాలు నిర్మించారు. శిఖం పట్టా భూముల్లో నిర్మాణాలు చేపట్టే అవకాశం లేకపోయినా.. యథేచ్ఛగా భవనాలు వెలిశాయి. అయినా రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదు.
ఆక్రమణలకు పాల్పడ్డవారిలో ఎక్కువగా అప్పటి అధికార బీఆర్‌ఎస్ నేతలు ఉండగా, కొన్నిచోట్ల స్థానిక కాంగ్రెస్, బీజేపీ నేతలూ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పలు ప్రాంతాల్లో స్థానికులు ఫిర్యాదు చేసినా.. ఒత్తిళ్ల వల్లనో, అక్రమార్జన వల్లనో అధికారులు స్పందించలేదు. దీంతో ఆక్రమణదారులు మరింత రెచ్చిపోయారు. ఆక్రమించిన స్థలాలను ప్లాట్లుగా విక్రయించడంతోపాటు కొన్నిచోట్ల ఇళ్లు నిర్మించి విక్రయించారు. బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే తక్కువ ధరకు లభిస్తుండడంతో పేద, దిగువ మధ్య తరగతి వర్గాలు సొంతింటి కల నెరవేర్చుకునేందుకు వీటిని కొనుగోలు చేశాయి. కబ్జా చేసినవారు సొమ్ము చేసుకొని బయటపడగా.. వాటిని కొనుక్కున్నవారు మాత్రం ప్రస్తుతం ఆక్రమణల తొలగింపు నేపథ్యంలో బాధితులుగా మారుతున్నారు.
2014 వరకు ఆక్రమణలు లేకుండా..
ఆ తరువాత పూర్తిగా కనుమరుగైన
చెరువుల్లో కొన్ని
పుప్పాలగూడ 9.25 ఎకరాలు
బుద్వేల్ 6.39 ఎకరాలు
బాచుపల్లి 2.1 ఎకరాలు
కుంట్లూరు 1.62 ఎకరాలు
2014 నాటికి 2014 నుంచి 2023 వరకు
చెరువుల పరిస్థితి పూర్తిగా పాక్షికంగా
కనుమరుగైనవి కబ్జాకు గురైనవి
ఆక్రమణలు లేని చెరువులు 499 20 57
పాక్షిక ఆక్రమణకు గురైనవి 196 24 70
మొత్తం 695 44 127
2014 వరకు ఆక్రమణలు లేకుండా..
ఆ తరువాత పాక్షిక ఆక్రమణలు జరిగిన చెరువుల్లో కొన్ని (బ్రాకెట్లో పూర్తి విస్తీర్ణం)
మల్లాపూర్ 11.58 ఎకరాలు (19.75)
మక్తల్ కుంట, పెద్ద అంబర్‌పేట 9.48 ఎకరాలు (12.09)
దేవరయాంజల్ 9.19 ఎకరాలు (22.24)
సురోని చెరువు, మంఖాల్ 8.88 ఎకరాలు (51.96)
ఉమ్దాసాగర్, జల్‌పల్లి 7.84 ఎకరాలు (113.25)
బ్రాహ్మణ కుంట, గోధుమకుంట 6.52 ఎకరాలు (15.22)
సుమర్ చెరువు 5.31 ఎకరాలు (62.51)
మల్కం చెరువు, ఉప్పర్‌పల్లి 4.79 ఎకరాలు (22.14)
నాగారం నాచిన్ 4.11 ఎకరాలు (26)
Updated Date - Oct 08 , 2024 | 03:06 AM