Gastric Issues: గ్యాస్ట్రిక్ సమస్యలకు క్యాప్సూల్ ఎండోస్కోపీ
ABN, Publish Date - Dec 20 , 2024 | 04:01 AM
గ్యాస్ట్రిక్ సమస్యలను గుర్తించడానికి ఎండోస్కోపీ చేయడం రివాజు! అయితే అది పేషెంట్లకు ఇబ్బందికరమైన ప్రక్రియ. పేషెంట్ నోటి ద్వారా గొంతులోంచి కడుపులోకి పైపును జొప్పించి సమస్య ఏమిటో తెలుసుకునే ఆ ప్రక్రియకు స్వస్తి చెప్పే సమయం ఆసన్నమైంది!
ఏఐజీ ఆస్పత్రిలో ‘రోబోటిక్ క్యాప్సూల్
ఎండోస్కోపీ టెక్నాలజీ’.. పిల్‌బాట్
చిన్న క్యాప్సూల్‌తో జీర్ణాశయ ఇబ్బందుల నిర్ధారణ
అల్సర్, పాలిప్స్, ఇన్‌ఫెక్షన్లు, క్యాన్సర్ల గుర్తింపు
ఎఫ్‌డీఏ అనుమతులతో పూర్తిస్థాయిలో సేవలు
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): గ్యాస్ట్రిక్ సమస్యలను గుర్తించడానికి ఎండోస్కోపీ చేయడం రివాజు! అయితే అది పేషెంట్లకు ఇబ్బందికరమైన ప్రక్రియ. పేషెంట్ నోటి ద్వారా గొంతులోంచి కడుపులోకి పైపును జొప్పించి సమస్య ఏమిటో తెలుసుకునే ఆ ప్రక్రియకు స్వస్తి చెప్పే సమయం ఆసన్నమైంది! దానికి బదులుగా.. ఒక చిన్న క్యాప్సూల్‌తో గ్యాస్ట్రిక్ సమస్యను గుర్తించే టెక్నాలజీ ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) ఆస్పత్రిలో అందుబాటులోకి వచ్చింది. ఆ క్యాప్సూల్‌ను కడుపులోకి పంపిస్తే చాలు.. జీర్ణాశయ సమస్యలను ఇట్టే గుర్తిస్తుంది. దీంట్లో ఉండే 2.3 మెగాపిక్సెల్ కెమెరా.. లోపలి భాగంలోని రియల్‌టైమ్ హై రిజల్యూషన్ లైవ్ విజువల్స్‌ను ప్రసారం చేస్తుంది. ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్, చీఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గురువారం దీన్ని ప్రారంభించి.. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దీని గురించి వివరించారు. ఈ పిల్‌బాట్ ఖరీదు రూ.5000-7000 మధ్య ఉంటుందని ఆయన తెలిపారు. గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు పరగడుపున ఈ క్యాప్సూల్ వేసుకుని నీళ్లు తాగితే.. అది క్షణాల్లో జీర్ణాశయంలోకి ప్రవేశించి అక్కడ సమస్యలను గుర్తిస్తుందని.. మర్నాడు మలవిసర్జన సమయంలో బయటకు వచ్చేస్తుందని.. దీనివల్ల రోగికి, పర్యావరణానికి ఎలాంటి ముప్పూ ఉండదని వివరించారు.
ఈ క్యాప్సూల్ నిర్ధారించే జబ్బులివే..
జీర్ణాశయంలో ఉత్పన్నమయ్యే అల్సర్లు, పాలిప్స్, రక్తస్రావం, ఇన్‌ఫెక్షన్, కేన్సర్లను ఈ క్యాప్సూల్ గుర్తిస్తుందని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా.. పెద్ద పేగు వద్ద ఏర్పడే కేన్సర్‌ను గుర్తిస్తుందని వెల్లడించారు. రోబోటిక్ పరికరానికి అనుసంధానమై ఉండే ఈ క్యాప్సూల్‌ను లోపల ఎక్కడికి కావాలంటే అక్కడికి పంపి సమస్యలను గుర్తించే అవకాశం ఉంటుందని వివరించారు. పిల్‌బాట్‌ను అభివృద్ధి చేసిన అమెరికా సంస్థ ‘ఎండియాటిక్స్’ సహవ్యవస్థాపకుడు డాక్టర్ అలెక్స్.. ఈ క్యాప్సూల్ వేసుకుని లైవ్ డెమో ఇవ్వడం విశేషం. ఆయన ఆ క్యాప్సూల్‌ను వేసుకున్నాక.. మయో క్లినిక్ (అమెరికా) గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం చైర్ డాక్టర్ వివేక్ కుంభారీ దాన్ని ఒక కంట్రోలర్ ద్వారా బయటినుంచే నియంత్రించారు. క్యాప్సూల్‌ను ఆయన జీర్ణాశయంలో పలు భాగాలకు పంపి అక్కడి విజువల్స్‌ను చూపించారు. ఈ క్యాప్సూల్ ఎండోస్కోపీ ద్వారా జీర్ణాశయ సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించగలిగితే వాటికి సమర్థంగా చికిత్స చేయవచ్చని వైద్యులు వివరించారు. కాగా.. ఈ క్యాప్సూల్‌పై క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని.. అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులు రాగానే (2026 నాటికి) పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ఎండియాటిక్స్ సహవ్యవస్థాపకుడు డాక్టర్ అలెక్స్ తెలిపారు.
Updated Date - Dec 20 , 2024 | 04:01 AM