‘సీతారామ’ అంచనా..19,800 కోట్లకు పెంపు
ABN, Publish Date - Nov 13 , 2024 | 04:05 AM
సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని సవరించాలని, రూ.19,800 కోట్లకు పెంచాలని కొత్తగూడెం చీఫ్ ఇంజనీర్(సీఈ) ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.
సవరణకు వీలుగా కొత్తగూడెం సీఈ ప్రతిపాదనలు
హైదరాబాద్, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని సవరించాలని, రూ.19,800 కోట్లకు పెంచాలని కొత్తగూడెం చీఫ్ ఇంజనీర్(సీఈ) ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. 2016 ఫిబ్రవరి 18న రూ.7926.14 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుకు గత ప్రభుత్వం పరిపాలన అనుమతినివ్వగా.. 2018 ఆగస్టు 2న రూ.13,057 కోట్లకు సవరించారు. తాజాగా అంచనా వ్యయాన్ని రూ.19,800 కోట్లకు పెంచాలని కోరుతూ ప్రతిపాదనలు సమర్పించారు. 3,28,853 ఎకరాల కొత్త ఆయకట్టుకు, 3,45,534 ఆయకట్టును స్థిరీకరించడానికి వీలుగా ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టులో కీలకమైన మూడు పంప్‌హౌ్‌సలను ఆగస్టు 15న సీఎం రేవంత్‌రెడ్డి పలువురు మంత్రులతో కలిసి ప్రారంభించిన విషయం విదితమే.
అయితే ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కింద శరవేగంగా నీటి ని అందించడానికి వీలుగా పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టును 16 ప్యాకేజీలుగా విడగొట్టింది. ప్రధాన కాలువను 1 నుంచి 8 ప్యాకేజీలుగా, సత్తుపల్లి ట్రంక్‌ను 9, 10, 11,12 ప్యాకేజీలుగా, పాలేరు లింక్ కెనాల్‌ను 13, 14, 15, 16 ప్యాకేజీలుగా వర్గీకరించారు. ఇక డిస్ట్రిబ్యూటరీలను 8 ప్యాకేజీలుగా విభజించి.. దీనికి రూ.3,858.93 కోట్లు అవసరమని అంచనా వేశారు. అయితే, మంత్రులు ఆదేశించారనే కారణంతో కొత్తగూడెం చీఫ్ ఇంజనీర్ రూ.1,842 కోట్ల పనులకు టెండర్లు పిలవగా.. అందులో రూ.768కోట్లకే పరిపాలన అనుమతి తీసుకోవడం కలకలం రేపింది. ఇది రాజకీయ వివాదానికి దారితీసింది. దీంతో, కొత్తగూడెం చీఫ్ ఇంజనీర్ సీతారామ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని సవరిస్తూ పరిపాలనాపరమైన అనుమతుల కోసం ప్రభుత్వానికి సమర్పించారు.
Updated Date - Nov 13 , 2024 | 04:05 AM