Etela Rajender: మూసీ ప్రక్షాళనపై మీ కార్యాచరణ ఏంటి?
ABN, Publish Date - Oct 07 , 2024 | 03:44 AM
మూసీ ప్రక్షాళన అంశంలో ప్రభుత్వ కార్యాచరణ ఏమిటో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలని బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
ఎఫ్‌టీఎల్ నిర్ధారించకుండా కూల్చివేతలా..?
రూ.1.50 లక్షల కోట్ల ప్రాజెక్టు కాంట్రాక్టు ఎవరికిచ్చారు
అఖిలపక్షం పెడితే చర్చకు సిద్ధం: ఎంపీ ఈటల
హైదరాబాద్, అక్టోబరు6(ఆంధ్రజ్యోతి): మూసీ ప్రక్షాళన అంశంలో ప్రభుత్వ కార్యాచరణ ఏమిటో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలని బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. రూ.1.50 లక్షల కోట్ల మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారని, ఎఫ్‌టీఎల్ నిర్ధారించకుండా కూల్చివేతలు చేపట్టడం ఏమిటని ప్రశ్నించారు. అసలు మూసీ ప్రక్షాళనకు డీపీఆర్ ఉందా ? అని నిలదీశారు. మూసీ ప్రక్షాళన అంశంపై ముఖ్యమంత్రి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఎక్కడ పెట్టినా చర్చకు సిద్ధమని ఈటల పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన ఆదివారం ఓ బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ చర్యలతో ఇళ్లు కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేశారని, రూ.కోట్ల విలువైన ఇంటిని కూలగొట్టి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వడం ఏంటని ఆ లేఖలో ప్రశ్నించారు.
సబర్మతి నది ప్రక్షాళనకు రూ.2 వేల కోట్లు, నమోగంగ ప్రాజెక్ట్‌కి 12 ఏళ్లలో రూ.22వేల కోట్లు ఖర్చుపెడితే మూసీ ప్రక్షాళనకు లక్షా 50 వేల కోట్లు ఎందుకు ఖర్చు అవుతున్నాయి ? అని ఈటల అడిగారు. పట్టా భూముల్లో ఇల్లు కట్టుకున్నవారికి ప్రత్యామ్నాయం ఏం చూపిస్తారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. కూల్చివేతల కంటే ముందు హైదరాబాద్‌లో ఉన్న చెరువులను శుభ్రం చేయాలని సూచించారు. 40 ఏళ్ల క్రితం ప్రభుత్వ ఇచ్చిన పట్టా భూముల్లో, ప్రభుత్వం అనుమతించిన లేఅవుట్లల్లో ఇల్లు కట్టుకున్న నిరుపేదలను కూల్చివేతలతో భయపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నానని పేర్కొన్నారు.
ప్రభుత్వం ఇస్తోన్న నోటీసులు ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని వాపోయారు. ముఖ్యమంత్రికి అపరిమిత అధికారాలు లేవనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, చట్టం, రాజ్యాంగం ప్రకారం వ్యవహరించాలని హితవు పలికారు. ఫణిగిరి కాలనీ, మారుతీ నగర్, చైతన్యపురి, ప్రజయ్ ఇంజనీరింగ్ సిండికేట్ లాంటి ప్రాంత వాసులతో తాను స్వయంగా మాట్లాడానని ఈటల తెలిపారు. ఇల్లు కోల్పోయిన వారి ఆవేదనను చెబుతున్న నేతలను ముఖ్యమంత్రి కాలకేయులతో పోల్చడం ఏంటని మండిపడ్డారు.
Updated Date - Oct 07 , 2024 | 03:44 AM