Cyber Crime: సైబర్ నేరగాళ్లు కాదు..సైబర్ బందిపోట్లు!
ABN, Publish Date - Sep 13 , 2024 | 04:08 AM
నానాటికీ గణనీయంగా పెరుగుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట పడాలంటే ప్రజల్లో వాటిపై అవగాహన, అప్రమత్తత ముఖ్యమని.. సెంటర్ ఫర్ రిసెర్చ్ ఆన్ సైబర్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్స్ (సీఆర్‌సీఐడీఎఫ్) వ్యవస్థాపక సంచాలకుడు డాక్టర్ ప్రసాద్ పాటిబండ్ల తెలిపారు.
ఏఐ ఆధారిత సైబర్ నేరాలతో మరింత ముప్పు.. బ్యాంకు ఖాతాల్ని కాదు.. డబ్బు సీజ్ చేయాలి
వ్యక్తిగత భద్రతలాగానే ఆన్‌లైన్ భద్రత కూడా
ప్రజల వివరాలన్నీ ఆన్‌లైన్ అంగట్లో అమ్మకానికి
‘సోషల్’ వేధింపుల బారినపడుతున్న యువత
కఠిన శిక్షలు పడేలా చట్టాలు రూపొందించాలి
సైబర్ కేటుగాళ్ల బారిన పడ్డ నష్టపోయినవారు
గంటలోగా ఫిర్యాదు చేస్తే ఎక్కువ ప్రయోజనం
సీఆర్‌సీఐడీఎఫ్ డైరెక్టర్ డాక్టర్ ప్రసాద్ వెల్లడి
హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 11 (ఆంధ్రజ్యోతి): నానాటికీ గణనీయంగా పెరుగుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట పడాలంటే ప్రజల్లో వాటిపై అవగాహన, అప్రమత్తత ముఖ్యమని.. సెంటర్ ఫర్ రిసెర్చ్ ఆన్ సైబర్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్స్ (సీఆర్‌సీఐడీఎఫ్) వ్యవస్థాపక సంచాలకుడు డాక్టర్ ప్రసాద్ పాటిబండ్ల తెలిపారు. ఏఐ, డీప్ ఫేక్ వంటి సాంకేతిక పరిజ్ఞానాల సాయంతో సైబర్ నేరగాళ్లు మున్ముందు మరింత పెద్ద ఎత్తున మోసాలకు తెగబడతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వృద్ధులను మోసం చేసి వారి పదవీ విరమణ ప్రయోజనాలను దోచుకుంటున్నవారిని కేవలం ‘సైబర్ నేరగాళ్లు’ అంటే సరిపోదని.. వారిని ‘సైబర్ బందిపోట్లు’గా వ్యవహరించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
బందిపోట్ల విషయంలో ఎంత కఠినంగా వ్యవహరిస్తారో అలాగే వీరిపట్లా వ్యవహరించాలని సూచించారు. వ్యక్తిగత భద్రత ఎంత ముఖ్యమో.. ఆన్‌లైన్ భద్రత కూడా అంతే ముఖ్యమని, కానీ మనదేశంలో ప్రజల వ్యక్తిగత సమాచారమంతా ఆన్‌లైన్ అంగట్లో అమ్మకానికి వస్తోందని ఆందోళన వెలిబుచ్చారు. పోలీసులు, అధికార యంత్రాంగం ప్రొయాక్టివ్, రియాక్టివ్, ప్రిడేటివ్ విధానాలను అనుసరించడం ద్వారా సైబర్ నేరాలను ముందుగా గుర్తించి నిరోధించే అవకాశం ఉంటుందన్నారు. సైబర్ బందపోట్లకు గరిష్ఠ శిక్ష పడేలా చట్టాలను రూపొందించడం, పౌరుల సమాచారం బయటకు పొక్కకుండా చూడటం, డేటా చోరులపై కఠిన చర్యలు తీసుకోవడం, సిమ్ కార్డుల విక్రయంపై గట్టి నిఘా పెట్టడం, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ (డీపీడీపీ) 2023 వంటి చట్టాలను కఠినంగా అమలు చేయడం వంటి చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. విలువైన సూచనలు చేశారు. అందులో కొన్ని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
సామాజిక మాధ్యమాల్లో అధిక సమయం చురుగ్గా ఉంటున్న యువతే ఎక్కువగా సైబర్ వేధింపుల బారినపడుతున్నారు. ఫొటోల మార్ఫింగ్, ట్రోలింగ్, అసభ్య సందేశాల వంటివి ఎదుర్కొంటున్నారు. కొందరి అమాయత్వాన్ని ఆసరాగా తీసుకొని సైబర్ బందిపోట్లు రకరకాల మార్గాల్లో రూ.లక్షల నుంచి రూ.కోట్లు దోచేస్తున్నారు. అలాంటివి జరిగినప్పుడు.. బాధితులు గంటలోపు ఫిర్యాదు చేయాలి. దీన్ని గోల్డెన్ అవర్ అంటారు.
పోలీసులు, అధికారులు సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన, అప్రమత్తత పెంచాలి. ప్రజలకు చెందిన సున్నిత సమాచారం లీక్ కాకుండా చూడాలి. ఇలాంటి నేరాల కట్టడికి డిజిటల్ ఫోరెన్సిక్స్‌ను విరివిగా వినియోగించాలి. నిబంధనలు కఠినతరం చేసి, సిమ్ కార్డుల దుర్వినియోగం జరకుండా చూడాలి.
పట్టుబడిన సైబర్ బందిపోట్లకు కఠిన శిక్షలు లేకపోవడంతో భయం లేకుండా పోయింది. సులభంగా బెయిల్‌పై బయటకు వస్తామన్న ధీమా ఉంది. కాబట్టి సైబర్ నేరాలకు సంబంధించిన చట్టాలను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేసి.. వారికి కఠిన శిక్షలు పడేలా చేయాలి.
పోలీసు దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు సైబర్ బందిపోట్లు కొత్తకొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. కాజేసిన డబ్బులో కొంత మొత్తాన్ని మాల్స్‌లో షాపింగ్‌కు, పెట్రోల్ బంకులు, ఇతర దుకాణాల్లో కొనుగోళ్లకు, బిల్లుల చెల్లింపులకు ఖర్చు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా అధికారులు ఆయా ఖాతాలన్నింటినీ సీజ్ చేస్తున్నారు. దీనివల్ల ఆయా నేరాలతో ఎలాంటి సంబంధమూ లేనివారు ఇబ్బందిపడుతున్నారు. అలా జరగకుండా చట్టాలను సవరించాల్సిన అవసరం ఉంది. ఖాతాదారుడి ప్రమేయం లేకుండా మోసపూరిత లావాదేవీలు జరిగితే బ్యాంకు ఖాతాను కాకుండా బ్యాంకు ఖాతాల్లోకి వచ్చిన డబ్బును మాత్రమే ఫ్రీజ్ చేయాలి.
ఇలా జాగ్రత్త పడదాం..
మనం విలువైన డాక్యుమెంట్లు, నగలు, నగదు దాచుకోవడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో ఆన్‌లైన్‌లోనూ అలాగే జాగ్రత్తపడాలి. మొబైల్, లాప్‌టాప్, వైఫై, పీసీలను ఎప్పటికప్పడు అప్‌గ్రేడ్ చేసుకోవాలి. అంకెలు, అక్షరాలు, గుర్తులను వాడి సంక్లిష్టమైన పాస్‌వర్డ్‌ను పెట్టుకోవాలి. తరచూ పాస్‌వర్డ్‌లు మార్చుతుండాలి.
ఫిర్యాదులు, సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌లను మాత్రమేవాడాలి.
బ్యాంకుల పేరుతో వచ్చే ఏపీకే లింక్‌లను తెరవకూడదు.
కొత్త నెంబర్ల నుంచి వచ్చే వీడియో కాల్స్ రిసీవ్ చేసుకోవద్దు.
పోలీసులు, బ్యాంకు అధికారులమంటూ ఎవరు ఫోన్ చేసినా బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ చెప్పకూడదు. సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను లాక్ చేసుకోవాలి.
మోసం జరిగిన వెంటనే 1930కి ఫోన్ చేసి (లేదా) సైబర్ క్రైం పోర్టల్ ద్వారా (లేదా) స్థానిక పోలీస్టేషన్‌లో.. ఫిర్యాదు చేయాలి. గోల్డెన్ అవర్‌లో ఫిర్యాదు చేస్తే.. ఖాతా ఫ్రీజ్ చేసి, పోగొట్టుకున్న డబ్బులు కాపాడే అవకాశం ఉంది.
ఏఐ సెక్స్‌టాయ్స్‌తో జర భద్రం
ఇటీవలికాలంలో పాశ్చాత్య దేశాల్లో కొత్తగా ‘‘సైబ్రోతల్స్’’ పేరుతో వ్యభిచారగృహాలు నడుపుతున్నారు. వాటిలో..శృంగార సుఖాన్ని అందించే ఏఐ ఆధారిత సెక్స్ టాయ్స్ ఉంటాయి. మనదేశంలో కూడా వీటిని దిగుమతి చేసుకుంటున్నారు ప్రస్తుతం ఇవి గోవాలో అందుబాటులో ఉన్నాయి. ఈ ఏఐ సెక్స్ టాయ్స్ తమ వద్దకు వచ్చిన వ్యక్తులు ప్రవర్తించే తీరు, వారి మానసిక, శారీరక పరిస్థితి, మూడ్ స్వింగ్స్ వంటివాటి వివరాలను కూడా సేకరించి సర్వర్లలో భద్రపరుస్తున్నాయి. కొందరి వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు కూడా సేకరిస్తున్నాయి. అలాంటివాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
Updated Date - Sep 13 , 2024 | 04:08 AM