ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad : చిక్కుముళ్లు వీడే దిశగా..!

ABN, Publish Date - Jul 03 , 2024 | 04:37 AM

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి ఎట్టకేలకు ఓ ప్రయత్నం జరుగుతోంది. సుహృద్భావ వాతావరణంలో,

  • తెలంగాణ, ఏపీ సీఎంల మధ్య 6న భేటీ

  • చంద్రబాబు ప్రతిపాదనకు రేవంత్‌ ఓకే

  • సమావేశానికి రావాలంటూ బాబుకు లేఖ

  • పదేళ్లుగా అపరిష్కృతంగా సమస్యలు

  • ఈ భేటీతో పరిష్కారమవుతాయన్న ఆశలు

  • ఎజెండాపై మంత్రులతో రేవంత్‌ చర్చలు

హైదరాబాద్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి ఎట్టకేలకు ఓ ప్రయత్నం జరుగుతోంది. సుహృద్భావ వాతావరణంలో, పరస్పర ఆమోదంతో సమస్యలను పరిష్కరించుకునే దిశగా రెండు తెలుగు రాష్ట్రాలు కదులుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన నేపథ్యంలో చిక్కుముళ్లు వీడే దిశగా ఓ అడుగు ముందుకు పడుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ సీఎం ఎన్‌.చంద్రబాబునాయుడు ఈ నెల 6న సమావేశం కావాలని నిర్ణయించారు. విభజన సమస్యలపై సమావేశమవుదామంటూ చంద్రబాబు రాసిన లేఖ పట్ల రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు.

చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు అంగీకరి స్తూ బేగంపేటలోని మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో సమావేశమవుదామంటూ సమాచారమిచ్చారు. సమావేశానికి రావాల్సిందిగా చంద్రబాబును ఆహ్వానించారు. ఈ భేటీలో చర్చించాల్సిన ఎజెండా, విధివిధానాల ఖరారుపై సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క మంగళవారం సచివాలయంలో సమావేశమయ్యారు. విభజన సమస్యలు, ఇతర అంశాలపై చర్చించారు. మంత్రులు తుమ్మల, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా ఇందులో పాల్గొన్నారు. కాగా, ఇరువురు సీఎంల సమావేశానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లతోపాటు భేటీకి అవసరమైన ఎజెండానూ రూపొందిస్తున్నారు. ఈ నెల 6న మధ్యాహ్నం తర్వాత సమావేశం ప్రారంభం కానుంది.


పదేళ్లు గడిచినా అపరిష్కృతంగానే..

ఉమ్మడి రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయి జూన్‌ 2తో పదేళ్లు గడిచినా.. ప్రధాన సమస్యలు అపరిష్కృతంగానే ఉండిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సంస్థలు, వాటి ఆస్తులు, అప్పులు, నిధుల పంపిణీ ఎటూ తేలలేదు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల అధికారులతో పలుమార్లు సమావేశాలు జరిగినా, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య చర్చలు జరిగినా... పరిష్కారానికి నోచుకోలేదు. కొన్ని సంస్థలకు సంబంధించి పరస్పర అంగీకారం కుదిరినా.. విభజన కాగితాలపై రెండు రాష్ట్రాలు సంతకాలు చేయలేదు. కొన్ని కీలక సమస్యలు అపెక్స్‌ కౌన్సిల్‌ ద్వారానే పరిష్కారమవుతాయని తెలిసినా.. అందులో సభ్యులైన ఇరు రాష్ట్రాల సీఎంలు మాత్రం చొరవ చూపలేకపోయారు. అప్ప ట్లో సీఎంలు కేసీఆర్‌, జగన్‌ ‘హాయ్‌ బాయ్‌’ సమావేశాలు నిర్వహించారే తప్ప.. ఒక్క సమస్యను కూడా నిగ్గు తేల్చలేకపోయారన్న విమర్శలున్నాయి. ప్రస్తు తం ఇరు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొన్నందున కొన్ని సమస్యలైనా పరిష్కారమవుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


పలు సంస్థలపై తెగని పేచీ..

సీఐడీ హెడ్‌ క్వార్టర్స్‌, లేక్‌వ్యూ అతిథి గృహం, హెర్మిటేజ్‌ కార్యాలయ భవనం మినహా మిగిలిన అన్ని భవనాలను తెలంగాణకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఏపీ లేఖ రాసింది. దీనిపై తెలంగాణ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పాత సెక్రటేరియట్‌లో ఉన్న భవనాలు, స్థలాన్ని, అసెంబ్లీ ప్రాంగణంలోని శాసనసభ, శాసనమండలి భవనాలను 2019లోనే తెలంగాణకు ఏపీ అప్పగించింది. సీఐడీ హెడ్‌ క్వార్టర్స్‌, లేక్‌వ్యూ అతిథి గృహం వంటి వాటిని జనాభా దామాషా ప్రకారం 58.32, 41.68 పద్ధతిన పంచాలని ఏపీ కోరుతోంది. కాగా, 9వ షెడ్యూలులో కేంద్రం చేర్చిన మొత్తం 91 సంస్థలకు చెందిన ఆస్తు లు, అప్పులు, నగదు నిల్వలు, ఉద్యోగులను రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం షీలా భిడే కమిటీని వేసింది. ఇందులో 68 సంస్థలపై తమకు ఎలాంటి అభం్యతరాలు లేవని తెలంగాణ తెలిపింది. మిగతా 23 సంస్థలకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య పేచీ నెలకొంది. ఇందులో ప్రధానంగా ఏపీఎ్‌సఆర్టీసీ, ఏపీ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, ఏపీజెన్‌కో, ఏపీట్రాన్స్‌కో వంటి సంస్థల ఆస్తులపై ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఈ అంశం ఇరువురు సీఎంల సమావేశంలో చర్చకు వస్తుందని సమాచారం. ఇక 10వ షెడ్యూలులో విద్య, శిక్షణ, మానవవనరుల అభివృద్ధి సంస్థలు, వర్సిటీలు వంటి మొత్తం 142 సంస్థలున్నాయి. వీటి అస్తుల విలువ రూ.38 వేల కోట్లుగా అంచనా వేశారు. ఈ షెడ్యూలులో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ, ఏఎంఆర్‌ఏపీ అకాడమీ ఆఫ్‌ రూరల్‌ డెవల్‌పమెంట్‌, ఏపీ ఫారెస్ట్‌ అకాడమీ, పోలీస్‌ అకాడమీ, ఏపీ ఎక్సైజ్‌ అకాడమీ, సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌, ఇంటర్మీడియట్‌ బోర్డు, స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రెయినింగ్‌, ఏపీ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ వంటి సంస్థలున్నాయి. వ్యవసాయ విశ్వవిద్యాలయం, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వంటివి పదో షెడ్యూలు కిందనే ఉన్నాయి. వీటిలో తెలుగు అకాడమీ, అంబ్కేదర్‌ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ వంటి 30 సంస్థలపై వివాదాలున్నాయి. కాగా, ఉన్నత విద్యామండలి ఆస్తుల విలువ తేలడం లేదు. దీనికి సంబంధించిన రూ.800 కోట్ల బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి.


తెగని విద్యుత్తు బాకీల పోరు..

తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్తు బకాయిల వివాదం పదేళ్లుగా పరిష్కారానికి నోచుకోవడం లేదు. రాష్ట్ర అవతరణ అనంతరం 2014 జూన్‌ 2 నుంచి 2017 జూన్‌ 10వ తేదీ దాకా ఏపీ జెన్‌కో నుంచి తెలంగాణ తీసుకున్న విద్యుత్తుకుగాను రూ.3441.78 కోట్లను, వీటిని సకాలంలో చెల్లింనందుకు ఆలస్య రుసుము సర్‌చార్జి(లేట్‌ పేమెంట్‌ సర్‌చార్జి) కింద రూ.3315.14 కోట్లు కలిపి రూ.6756 కోట్లు కట్టాలని ఏపీ అడుగుతోంది. అయితే ఏపీ నుంచే తమకు రూ.17,828 కోట్లు రావాల్సి ఉందని తెలంగాణ చెబుతోంది. ఏపీకి కట్టాల్సిన కరెంట్‌ బిల్లులు, ఆలస్య రు సుము సర్‌చార్జి మొత్తం రూ.4887కోట్లు పోను ఇంకా తమకు రూ.12940 కోట్లు రావాల్సి ఉందని అంటోంది. ఈ వివాదాన్ని తేల్చడానికి చాలా ప్రక్రియలు జరిగినా ఏవీ కార్యరూపం దాల్చలేదు.

చంద్రబాబుకు రేవంత్‌ ఆహ్వానం ఇదీ..

విభజన సమస్యల పరిష్కారం కోసం భేటీ అవుదామంటూ ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖపై సానుకూలంగా స్పందిస్తూ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తిరిగి లేఖ రాశారు. ఈ నెల 6న సమావేశానికి రావాలని చంద్రబాబును ఆహ్వానించారు. ‘‘విభజన సమస్యలను కలిసి పరిష్కరించుకుందాం. తెలుగు రాష్ట్రాల పరస్పర సహకారానికి ముఖాముఖి చర్చలు అవసరం. మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నా. మా రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల తరపున చంద్రబాబును ఆహ్వానిస్తున్నాం’’ అని లేఖలో రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో విజయం సాధించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యాననంతరం నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన నేతల్లో మీరూ ఒకరంటూ చంద్రబాబును కొనియాడారు.

Updated Date - Jul 03 , 2024 | 04:39 AM

Advertising
Advertising