Manikonda: దీపపు చిమ్నీ పేలి..
ABN, Publish Date - Nov 28 , 2024 | 04:26 AM
గృహప్రవేశం రోజున వెలిగించిన అఖండ దీపం ఆరిపోకుండా ఉండేందుకు రక్షణగా పెట్టిన చిమ్నీ(గాజుపాత్ర) పేలి ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. రూ.75 లక్షల మేర ఆస్తి నష్టం జరిగింది.
హైదరాబాద్‌లోని మణికొండలో ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం
రూ.75 లక్షల ఆస్తి నష్టం
నార్సింగ్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): గృహప్రవేశం రోజున వెలిగించిన అఖండ దీపం ఆరిపోకుండా ఉండేందుకు రక్షణగా పెట్టిన చిమ్నీ(గాజుపాత్ర) పేలి ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. రూ.75 లక్షల మేర ఆస్తి నష్టం జరిగింది. హైదరాబాద్‌లోని మణికొండ మునిసిపాలిటీ పరిధి పుప్పాలగూడలో ఉన్న ఈఐపీఎల్ కార్నర్ స్టోన్ అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. సంతోష్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఈఐపీఎల్ కార్నర్ స్టోన్ అపార్ట్‌మెంట్ ఎనిమిదో అంతస్తులోని తన ఫ్లాట్‌లో కుటుంబంతో కలిసి సోమవారం గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేవుడి గదిలో వెలిగించిన దీపం చుట్టూ ఓ గాజుపాత్రను ఉంచారు.
అయితే, దీపం నుంచి వెలువడిన వేడిని తట్టుకోలేక బుధవారం ఉదయం ఆ గాజుపాత్ర పేలగా.. దీపం ఎగిరిపడడంతో ఇల్లంతా వేగంగా మంటలు వ్యాపించాయి. సంతోష్ కుటుంబం సకాలంలో ఇంటి నుంచి బయటకు రావడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. కాగా, ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఇంట్లోని వస్తువలన్నీ కాలిపోవడంతో రూ.75లక్షల మేర ఆస్తినష్టం జరిగిందని అంచనా వేశారు. అగ్ని ప్రమాదంపై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Updated Date - Nov 28 , 2024 | 04:26 AM