Food Inspection: ఖమ్మంలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ అధికారుల స్టింగ్ ఆపరేషన్
ABN, Publish Date - Nov 19 , 2024 | 01:34 AM
ఆహార తనిఖీ విభాగం రాష్ట్ర అధికారులు సోమవారం ఖమ్మంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఖమ్మం జిల్లా అధికారులకు కూడా సమాచారం ఇవ్వకుండా పలు ఆహార తయారీ కేంద్రాలు, స్వీట్స్ దుకాణాలు, పిండి వంటల కేంద్రాల్లో తనిఖీలు చేసి కేసులు నమోదు చేశారు.
960 కిలోల కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ పట్టివేత
పలు స్వీట్స్ దుకాణాలు, పిండి వంటల కేంద్రాల్లో తనిఖీలు
నాణ్యతలేని ఆహార పదార్థాలు అమ్ముతున్నట్లు గుర్తించి కేసులు
ఖమ్మం సంక్షేమ విభాగం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఆహార తనిఖీ విభాగం రాష్ట్ర అధికారులు సోమవారం ఖమ్మంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఖమ్మం జిల్లా అధికారులకు కూడా సమాచారం ఇవ్వకుండా పలు ఆహార తయారీ కేంద్రాలు, స్వీట్స్ దుకాణాలు, పిండి వంటల కేంద్రాల్లో తనిఖీలు చేసి కేసులు నమోదు చేశారు. కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ అమ్ముతున్న ఓ వ్యాపార కేంద్రంపై స్టింగ్ ఆపరేషన్ చేసి 960 కిలోల కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్‌లో కేజీ రూ.250 ఉండే అల్లం, వెల్లులి పేస్ట్‌ను ఖమ్మంలో కొందరు వ్యాపారులు కేజీ రూ.60కే విక్రయిస్తున్నారు. ఈ రకమైన కల్తీ దందా ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. దీనిపై ఫిర్యాదులు అందుకున్న రాష్ట్ర ఫుడ్‌సేఫ్టీ అధికారులు వ్యూహాత్మకంగా దాడులు నిర్వహించారు. రాష్ట్ర టాస్క్‌పోర్స్ అధికారి జ్యోతిర్మయి ఆధ్వర్యంలో ఖమ్మం చేరుకున్న ఫుడ్‌సేఫ్టీ అఽధికారులు.. ఓ చిరు వ్యాపారి నుంచి కల్తీ అల్లం, వెల్లుల్లి వ్యాపారి ఫోన్ నెంబర్‌ను సేకరించారు.
తమ కుటుంబంలో ఒక పెద్ద ఫంక్షన్ ఉందని, తమకు క్వింటా అల్లం, వెల్లుల్లి పేస్ట్ కావాలని అడిగారు. కొన్ని గంటల తర్వాత లైన్‌లోకి వచ్చిన కల్తీ వ్యాపారి వీరి ప్రతిపాదనకు ఒప్పుకోవడంతో మూడు గంటల పాటు స్టింగ్ అపరేషన్ నిర్వహించి రూ. 1లక్ష 35వేల విలువైన 960 కిలోల కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. కనీస నిబంధనలు పాటించకుండా హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ వ్యాపార సంస్థకు చెందిన స్టిక్కర్‌ను వినియోగించడాన్ని గుర్తించి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ దాడి తరువాత ఓ ప్రముఖ స్వీట్స్ దుకాణంలో తనిఖీలు నిర్వహించి కేక్‌ల తయారీలో దుస్తులకు వినియోగించే రంగులు, గడువు దాటిన పదార్థాలతో స్వీట్లు తయారీ చేస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. అనంతరం పిండి వంటల దుకాణంలో అధికారులు తనిఖీలు నిర్వహించగా పురుగులు పట్టిన పిండి, బూజు పట్టిన స్వీట్లు కనిపించాయి. దీంతో ఆ దుకాణంపై కూడా కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆహార తనిఖీ టాస్క్‌పోర్స్ అధికారి జ్యోతిర్మయి ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ కల్తీ ఆహారంపై ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఫిర్యాదులు రావటంతో ఆకస్మికంగా తనిఖీలు చేశామని తెలిపారు. ఆహార నాణ్యతపై ఎటువంటి అనుమానాలు ఉన్నా రాష్ట్రస్థాయి ఫిర్యాదుల నెంబర్ 9100105795కు ఫోన్ చేయాలని సూచించారు.
Updated Date - Nov 19 , 2024 | 01:34 AM