Hyderabad: కేంద్ర మాజీ మంత్రి శివశంకర్ సతీమణి కన్నుమూత
ABN, Publish Date - May 31 , 2024 | 04:35 AM
కేంద్ర మాజీ మంత్రి.. సిక్కిం, కేరళ మాజీ గవర్నర్ పి.శివశంకర్ సతీమణి లక్ష్మీబాయి (94) గురువారం ఉదయం కన్నుమూశారు. అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిగాంచిన ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడుకి మేనకోడలు అయున లక్ష్మీబాయి వ్యక్తిగతంగానూ ప్రముఖులే.
దశాబ్దాల క్రితమే ఉన్నత విద్యావంతురాలిగా గుర్తింపు
హైదరాబాద్, మే 30 (ఆంధ్రజ్యోతి): కేంద్ర మాజీ మంత్రి.. సిక్కిం, కేరళ మాజీ గవర్నర్ పి.శివశంకర్ సతీమణి లక్ష్మీబాయి (94) గురువారం ఉదయం కన్నుమూశారు. అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిగాంచిన ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడుకి మేనకోడలు అయున లక్ష్మీబాయి వ్యక్తిగతంగానూ ప్రముఖులే. లక్ష్మీబాయి ఏపీలోని వైజాగ్ జిల్లా యలమంచిలిలో జన్మించారు. వృత్తి రీత్యా తండ్రి ఒడిశాలోని జైపూర్‌కు వెళ్లడంతో ఆమె విద్యాభ్యాసం అక్కడే సాగింది.
లక్ష్మీబాయి భువనేశ్వర్‌లోని ఉత్కల్ యూనివర్సిటీలో బీఏ చేసి ఒడిశాలో మొదటి మహిళా పట్టభద్రురాలిగా పేరుగాంచారు. తర్వాత బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి ఎంఏ చదివారు. 80 ఏళ్ల తర్వాత ఆమె రెండు పీహెచ్‌డీలు పూర్తిచేయడం విశేషం. అందులో ఒకటి ఉస్మానియా వర్సిటీ నుంచి ‘భగవద్గీత-ఆధునిక కాలపు మనిషికి దాని ఔచిత్యం’ అనే అంశంపై ఉంది. కాగా, లక్ష్మీ బాయి మృతి పట్ల టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు మహిళా సంఘాలు సంతాపం ప్రకటించాయి.
Updated Date - May 31 , 2024 | 04:35 AM