Road Accident: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
ABN, Publish Date - Nov 02 , 2024 | 07:48 PM
మెదక్ జిల్లాలో శనివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బైకును ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మనోహరాబాద్ మండలం పోతారం వద్ద ఈ ప్రమాదం జరిగింది.
మెదక్: మెదక్ జిల్లాలో శనివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బైకును ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మనోహరాబాద్ మండలం పోతారం వద్ద ఈ ప్రమాదం జరిగింది. పోతారం గ్రామానికి చెందిన మన్నె ఆంజనేయులు అనే వ్యక్తి తన మరదలు లత, ఆమె ఇద్దరు పిల్లలు సహస్ర, శాన్వి తో కలిసి శభాష్ పల్లి వైపు బైకుపై వెళ్తుండగా.. ఎదరుగా వచ్చిన ట్రాక్టర్ వీరిని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో లత, ఆమె ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందారు. ఆంజనేయులు చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానిక రోడ్లపై రైతులు ధాన్యం ఆరబోశారు. దీంతో వాహనాలు వెళ్లేందుకు ఇబ్బందిగా మారింది. ఈ కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఆంజనేయులు తన తమ్ముడి భార్య పిల్లలను బస్ ఎక్కించడానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన తర్వాత ట్యాంకర్ డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాలను తూప్రాన్ ఆస్పత్రికి తరలిస్తుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారితో మాట్లాడారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడంతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి.
Updated Date - Nov 02 , 2024 | 08:12 PM