Foxconn: సీఎం రేవంత్‌రెడ్డితో ఫాక్స్‌కాన్ చైర్మన్ భేటీలో చర్చ
ABN, Publish Date - Aug 17 , 2024 | 03:25 AM
అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజ సంస్థ ‘ఫాక్స్‌కాన్’... తెలంగాణలో తన కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు తెలిసింది.
మరో ప్లాంటును ఏర్పాటు చేసే యోచనలో సంస్థ
ఫోర్త్ సిటీ రూపకల్పనలో మీ విజన్ అద్భుతం
త్వరలోనే హైదరాబాద్‌ను సందర్శిస్తా: యాంగ్ లియూ
ఫోర్త్ సిటీలో ఫాక్స్‌కాన్!
హైదరాబాద్/న్యూఢిల్లీ, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజ సంస్థ ‘ఫాక్స్‌కాన్’... తెలంగాణలో తన కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే కొంగరకలాన్ వద్ద ఆ సంస్థకు సంబంధించిన ఓ ప్లాంటు సిద్ధమవుతుండగా.. అదనంగా మరో ప్లాంటును ఏర్పాటు చేసే యోచనలో ఉందని సమాచారం. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లియూ నేతృత్వంలోని సంస్థ ప్రతినిధి బృందం శుక్రవారం ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో కార్యకలాపాల విస్తరణపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది.
యాపిల్ సంస్థ ఐఫోన్లకు సంబంధించిన ఎయిర్‌పాడ్స్, ఇతర యాక్ససరీ్‌సను ఫాక్స్‌కాన్ సంస్థ తయారు చేస్తుంటుంది. గత ఏడాది హైదరాబాద్‌లో ప్లాంటు ఏర్పాటుకు ఈ సంస్థ ముందుకురాగా.. ప్రభుత్వం నగర శివార్లలోని కొంగరకలాన్ వద్ద 120 ఎకరాల భూమిని కేటాయించింది. అందులో 16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ పనులు చివరి దశకు వచ్చాయి. ఇది అందుబాటులోకి వస్తే.. యాపిల్ సంస్థకు అవసరమైన ఎయిర్‌పాడ్స్, ఇతర యాక్ససరీ్‌సను తయారు చేయడాన్ని మొదలుపెడతారు.
ఈ సంస్థ భవనాన్ని కూడా సీఎం రేవంత్‌రెడ్డి త్వరలో ప్రారంభించే అవకాశాలున్నాయి. దీనికి విస్తరణగా.. ముచ్చర్లలోని ఫోర్త్ సిటీలో మరో ప్లాంటును ఏర్పాటు చేసే యోచనలో ఫాక్స్‌కాన్ ఉన్నట్లు తెలిసింది. ఇదే విషయమై సీఎం రేవంత్‌రెడ్డితో ఆ సంస్థ చైర్మన్ యంగ్ లియూ చర్చించారని సమాచారం. ఫోర్త్ సిటీలో తమకు 500 ఎకరాలకు పైగా భూమిని కేటాయించాలని ఆయన అడిగినట్లు తెలిసింది. అందులో 64 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో భవనాలను నిర్మిస్తామని చెప్పినట్లు సమాచారం.
మీ దార్శనికత అద్భుతం..
తెలంగాణలో ఫోర్త్ సిటీ రూపకల్పన తీరు, రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక అనుకూల విధానాలు ఆకట్టుకునేలా ఉన్నాయని ఫాక్స్‌కాన్ చైర్మన్ యాంగ్ లియూ అన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి విజన్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. సీఎం రేవంత్‌రెడ్డితో భేటీలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు ఇండస్ర్టీ, సర్వీస్ రంగాల్లో విస్తరించే సత్తా ఉందని, త్వరలోనే తన బృందంతో కలిసి నగరాన్ని సందర్శిస్తానని తెలిపారు. అంతకుముందే తమ చీఫ్ క్యాంపస్ ఆపరేషన్స్ ఆఫీసర్ క్యాథీ యాంగ్, సంస్థ భారతదేశ ప్రతినిధి వీ లీ నేతృత్వంలోని బృందం హైదరాబాద్‌కు వస్తుందని చెప్పారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ చరిత్ర, పారిశ్రామిక సంస్థల విస్తరణకు ఉన్న అనుకూలత, అద్భుతమైన వాతావరణ పరిస్థితులను ఫాక్స్‌కాన్ బృందానికి ముఖ్యమంత్రి వివరించారు. 430 ఏళ్ల క్రితం పునాదిరాయి పడిన హైదరాబాద్.. కాలక్రమంలో మూడు నగరాలుగా అభివృద్ధి చెందిన తీరును తెలియజేశారు. ఆ అభివృద్ధిని మరింతగా పరుగులు పెట్టించేందుకే తాము ప్రస్తుత ప్రపంచ అవసరాలకు తగినట్లు ఫ్యూచర్ సిటీ పేరుతో నాలుగో నగరానికి (ఫోర్త్ సిటీ) రూపకల్పన చేస్తున్నామని చెప్పారు.
ఇందులో ప్రముఖ పారిశ్రామికవేత్తలను భాగస్వాములను చేస్తున్నామని పేర్కొన్నారు. అందులో భాగంగానే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రాను, వైస్ చైర్మన్‌గా మరో పారిశ్రామికవేత్త శ్రీనివాస రాజును నియమించామని తెలిపారు. ఫోర్త్ సిటీలో ఫాక్స్‌కాన్ సంస్థ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన అన్ని అనుమతులు, మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శులు జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Aug 17 , 2024 | 03:25 AM