Share News

Google: గూగుల్‌ మరో అడుగు

ABN , Publish Date - Dec 05 , 2024 | 04:11 AM

దేశంలోనే మొట్టమొదటి గూగుల్‌ సేఫ్టీ ఇంజనీరింగ్‌ సెంటర్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పేందుకు ఆ సంస్థ సిద్ధమైంది. ఈమేరకు గూగుల్‌తో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకొంది.

Google: గూగుల్‌ మరో అడుగు

  • హైదరాబాద్‌లో సేఫ్టీ ఇంజనీరింగ్‌ సెంటర్‌

  • నెలకొల్పేందుకు సిద్ధం

  • గూగుల్‌తో ఒప్పందం చేసుకున్న రాష్ట్రసర్కారు

  • ఐటీ ఇన్నోవేషన్‌ హబ్‌గా హైదరాబాద్‌: రేవంత్‌

  • సీఎంను ఆయన నివాసంలో కలిసిన గూగుల్‌ ప్రతినిధులు

హైదరాబాద్‌, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే మొట్టమొదటి గూగుల్‌ సేఫ్టీ ఇంజనీరింగ్‌ సెంటర్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పేందుకు ఆ సంస్థ సిద్ధమైంది. ఈమేరకు గూగుల్‌తో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకొంది. గూగుల్‌ ప్రధాన సమాచార అధికారి రాయల్‌ హన్సెన్‌ ఆధ్వర్యంలోని బృందం.. సీఎం రేవంత్‌ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్‌ బాబుతో సీఎం నివాసంలో బుధవారం ఉదయం భేటీ అయి.. ఇక్కడ సేఫ్టీ ఇంజనీరింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. ఈ విషయాన్ని వెల్లడించిన సీఎం రేవంత్‌ రెడ్డి.. అమెరికా బయట అతిపెద్ద కార్యాలయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి గూగుల్‌ ముందుకొచ్చిందని చెప్పారు. హైదరాబాద్‌ ప్రపంచంలోనే మేటి ఐటీ, ఇన్నోవేషన్‌ హబ్‌గా అందరి దృష్టినీ ఆకర్షిస్తోందనడానికి ఈ ఒప్పందమే నిదర్శనమని హర్షం వ్యక్తం చేశారు. గూగుల్‌ సేఫ్టీ సెంటర్‌ ఏర్పాటు ద్వారా వేల సంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఇక.. డిజిటల్‌ నైపుణ్యాల అభివృద్ధిలో తెలంగాణ ముందంజలో ఉందని గూగుల్‌ ఉన్నతాధికారి రాయల్‌ హన్సెన్‌ అన్నారు.


ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఇంజనీరింగ్‌ సర్వీసె్‌సకు హై దరాబాద్‌ కేంద్రంగా ఉందని.. అంతర్జాతీయంగా పేరొందిన టెక్‌ దిగ్గజాలైన గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఆపిల్‌, అమెజాన్‌, ఫేస్‌ బుక్‌ ఇక్కడ ఉన్నాయని కొనియాడారు. సేఫ్టీ సెంటర్‌ ఏర్పాటు ద్వారా సైబర్‌ భద్రత సమస్యలను వేగంగా పరిష్కరించే వీలుంటుందని హన్సెన్‌ పేర్కొన్నారు. ఆసియా పసిఫిక్‌ జోన్లో ఇప్పటి వరకు టోక్యోలో మాత్రమే గూగుల్‌ ఇంజనీరింగ్‌ సేఫ్టీ సెంటర్‌ ఉంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తే.. అది ఆసియా పసిఫిక్‌ జోన్లో రెండోది, ప్రపంచంలో ఐదోది అవుతుంది. మనదేశంలో సేఫ్టీ సెంటర్‌ ఏర్పాటు గురించి గూగుల్‌ సంస్థ ఈ ఏడాది అక్టోబరు 3న జరిగిన ‘గూగుల్‌ ఫర్‌ ఇండియా 2024’ కాన్‌క్లేవ్‌లోనే వెల్లడించింది. అప్పటి నుంచీ దీని కోసం వివిధ రాష్ట్రాలు పోటీ పడ్డాయి. సీఎం రేవంత్‌ అమెరికా పర్యటనలో గూగుల్‌ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన తర్వాత.. ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపడంతో ఈ సెంటర్‌ హైదరాబాద్‌కు వచ్చిందని అధికారులు తెలిపారు. కాగా.. దేశంలోనే తొలి ‘గూగుల్‌ పవర్డ్‌ ఇంటెలిజెంట్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌’ను కూడా ఇక్కడ ఏర్పాటు చేసే అవకాశం ఉందని ప్రభుత్వం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.


  • ఏమిటీ సేఫ్టీ ఇంజనీరింగ్‌ సెంటర్‌?

ఇటీవలికాలంలో సైబర్‌ దాడులు పెద్ద సమస్యగా మారింది. సామాన్యులపైనే కాదు.. పెద్దపెద్ద కంపెనీలపైనా సైబర్‌ నేరగాళ్లు విరుచుకుపడుతున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా రూ.వేల కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఈ క్రమంలోనే సైబర్‌ భద్రత లక్ష్యంగా.. గూగుల్‌ సంస్థ మ్యూనిక్‌, డబ్లిన్‌, మలగ, టోక్యో నగరాల్లో గూగుల్‌ సేఫ్టీ ఇంజనీరింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేసింది. సేఫ్టీ సెంటర్‌ అంటే.. ప్రత్యేకమైన అంతర్జాతీయ సైబర్‌ సెక్యూరిటీ హబ్‌. ఇది అధునాతన, ఆన్‌లైన్‌ భద్రతా ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అత్యాధునిక పరిశోధన, కృత్రిమ మేధ ఆధారిత భద్రత, సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు, పరిశోధకులకు ఈ కేంద్రం సహకార వేదికగా ఉపయోగపడుతుంది. సైబర్‌ సెక్యూరిటీ సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా పనిచేస్తుంది. ఇన్నాళ్లుగా టోక్యోలో ఉన్న సేఫ్టీ సెంటరే.. భారత్‌ సహా పలు ఆసియా దేశాలకు సేవలందిస్తూ వస్తోంది. పెరుగుతున్న సైబర్‌ సవాళ్ల నేపథ్యంలో భారత్‌లో ప్రత్యేక కేంద్రం ఏర్పాటుచేయాలని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ నిర్ణయించారు. గూగుల్‌ నిర్ణయంతో సైబర్‌ సెక్యూరిటీ రంగానికి సంబంధించిన అనేక కంపెనీలు ఇక్కడ తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి ఆసక్తి చూపుతాయని.. ఫలితంగా వేలసంఖ్యలో కొత్త ఉద్యోగాలు వస్తాయని సైబర్‌ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Dec 05 , 2024 | 04:11 AM