CM Revanth Reddy: దశాబ్ది ఉత్సవాలకు కేసీఆర్‌కు పిలుపు..
ABN, Publish Date - May 31 , 2024 | 05:19 AM
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ప్రత్యేకంగా పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆయనకు అందించే ఆహ్వాన పత్రికపై సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా సంతకం చేశారు. జూన్ 2న ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే అధికారిక కార్యక్రమంలో పాల్గొనాలని ఆ లేఖలో కోరారు.
ఆహ్వాన పత్రికపై స్వయంగా సంతకం చేసిన ముఖ్యమంత్రి రేవంత్
నేడు కేసీఆర్ ఇంటికి వెళ్లనున్న హర్కార వేణుగోపాల్, అర్విందర్‌సింగ్
చుక్కా రామయ్యకు సీఎం పరామర్శ.. వేడుకలకు రావాలని ఆహ్వానం
వేడుకలకు ఆయన హాజరవుతారా? లేదా? అనేది ఆసక్తికరం
2014-23 మధ్య పదిసార్లు సీఎం హోదాలో పాల్గొన్న కేసీఆర్
తొలిసారి విపక్ష నేతగా.. బీఆర్‌ఎస్ అధినేత పాల్గొంటారా?
హైదరాబాద్, మే 30(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ప్రత్యేకంగా పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆయనకు అందించే ఆహ్వాన పత్రికపై సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా సంతకం చేశారు. జూన్ 2న ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే అధికారిక కార్యక్రమంలో పాల్గొనాలని ఆ లేఖలో కోరారు. సీఎం ఆదేశాల మేరకు ఆహ్వాన పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్ సలహాదారులు హర్కార వేణుగోపాల్, ప్రొటోకాల్ విభాగం డైరెక్టర్ అర్విందర్‌సింగ్ శుక్రవారం కేసీఆర్ చేతికి అందించనున్నారు. దీనికోసం ఆయన అపాయింట్‌మెంట్ కూడా అడిగారు. ఇంటివద్ద ఉంటే అక్కడకు, ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌లో ఉంటే.. అక్కడకు వెళ్లి ఆహ్వానపత్రాన్ని ఇవ్వనున్నారు. కాగా, వేడుకల సందర్భంగా ఉద్యమకారులకు పెద్దపీట వేయాలని రాష్ట్ర మంత్రివర్గం భావించింది. రెండుసార్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉత్సవాల్లో కేసీఆర్ పాల్గొంటారా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది.
హాజరైతే సందేశం ఏమిస్తారు? గైర్హాజరై లిఖితపూర్వక సందేశం పంపిస్తారా? లేకపోతే పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటారా? అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. 2014లో రాష్ట్రం ఏర్పాటు నుంచి 2023 వరకు బీఆర్‌ఎస్ అధినేత సీఎం హోదాలోనే ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. అధికారంలో ఉండగా నిరుడు దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. వాస్తవానికి 2023 జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ ఏర్పడి తొమ్మిదేళ్లే అయింది. కానీ, ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు అంటూ హడావుడి చేసింది. ఏకంగా 21 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి పెద్దఎత్తున నిధులను ఖర్చు చేసింది. తొమ్మిదేళ్లకే దశాబ్ది ఉత్సవాలు చేయడమేంటని విమర్శలు వచ్చాయి. అయితే, పదో సంవత్సరంలోకి అడుగుపెట్టినందున వేడుకలు జరుపుతున్నామని బీఆర్‌ఎస్ ప్రభుత్వం సమర్థించుకుంది. ఈసారి మళ్లీ దశాబ్ది ఉత్సవాలను జూన్ 1 నుంచి మూడు రోజులు నిర్వహించాలని బీఆర్‌ఎస్ అధిష్ఠానం శ్రేణులకు పిలుపునిచ్చింది. ఇదిలాఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఒకే రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో కార్యక్రమాలకు ప్రణాళిక రూపొందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక వచ్చిన తొలి అవతరణ దినోత్సవం (జూన్ 2) ఇదే. పైగా తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తవుతోంది. అందుకే అంగరంగ వైభవంగా నిర్వహించాలని నిర్ణయించింది. దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనాలంటూ.. తెలంగాణ కల సాకారంలో అత్యంత కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లి ఆహ్వానించారు. దీనికి సోనియా సుముఖత వ్యక్తంచేశారు. మరి కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.
చుక్కా రామయ్యకు సీఎం పరామర్శ
ఆవిర్భావ వేడుకలను రావాలని ఆహ్వానం
కవాడిగూడ, మే 30 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యను సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శించారు. కొంత కాలంగా చుక్కా రామయ్య అనారోగ్యంతో బాధపడుతున్నారు. సమాచారం తెలుసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి గురువారం విద్యానగర్‌లోని చుక్కా రామయ్య నివాసానికి వచ్చి పరామర్శించారు. ‘మీ ఆరోగ్యం ఎలా ఉంది? ’ అంటూ ఆప్యాయంగా పలకరించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించారు. ‘‘ఈ వేడుకలకు సోనియాగాంధీ ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్నారు. ఆమె చేతుల మీదుగా మిమ్మల్ని సన్మానిస్తాం. ప్రత్యేకంగా గ్రీన్‌చానల్‌ను ఏర్పాటు చేసి, దశాబ్ది వేడుకల సభా ప్రాంగణానికి మిమ్మల్ని తీసుకొచ్చే బాధ్యతను కాంగ్రెస్ నేత మల్లు రవికి అప్పగిస్తాం’’ అని వివరించారు. ప్రతి రోజూ పత్రికలు, సమీక్షలు చూస్తున్నారా? కాంగ్రెస్ పాలన ఎలా ఉంది? అంటూ ఆరా తీశారు. విద్యారంగంపై ప్రత్యేకంగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయబోతున్నామని, దీనికి సలహాలు, సూచనలు అందించాలని రామయ్యను కోరారు. విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటుందని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి దాదాపు అరగంట పాటు చుక్కా రామయ్యతో మాట్లాడారు. ఈ సందర్భంగా రామయ్యను శాలువాతో ఘనంగా సత్కరించిన సీఎం.. ఆయన ఆశీస్సులు అందుకున్నారు.
Updated Date - May 31 , 2024 | 05:19 AM