ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gurukulas: కొత్తగా 28 సమీకృత గురుకులాలు

ABN, Publish Date - Oct 11 , 2024 | 03:22 AM

పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నాణ్యతతో కూడిన విద్యను అందించాలన్న లక్ష్యంతో సమీకృత గురుకులాల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

ఒక్కోటి 20 ఎకరాల్లో.. కార్పొరేట్‌ స్థాయిలో నిర్మాణం.. పేదలకు అంతర్జాతీయ స్థాయి విద్య

  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. నేడు శంకుస్థాపనలు

హైదరాబాద్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నాణ్యతతో కూడిన విద్యను అందించాలన్న లక్ష్యంతో సమీకృత గురుకులాల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలి దశలో 28 నియోజకవర్గాల్లో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ను తీసుకురావాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న గురుకులాలను కొనసాగిస్తూనే.. అత్యాధునిక వసతులతో సమీకృత భవనాలను నిర్మించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు గురువారం ఆయా నియోజకవర్గాలతో కూడిన జాబితాను విడుదల చేయడంతోపాటు సంబంధిత ఉత్తర్వులను జారీ చేసింది. కొడంగల్‌, మధిర, హుస్నాబాద్‌, నల్లగొండ, హుజూర్‌నగర్‌, మంథని, ములుగు, పాలేరు, ఖమ్మం, వరంగల్‌, కొల్లాపూర్‌, ఆంధోల్‌, చాంద్రాయణగుట్ట, మంచిర్యాల, భూపాలపల్లి, అచ్చంపేట, స్టేషన్‌ ఘన్‌పూర్‌, తుంగతుర్తి, మునుగోడు, చెన్నూరు, షాద్‌నగర్‌, జడ్చర్ల, పరకాల, నారాయణఖేడ్‌, దేవరకద్ర, నాగర్‌కర్నూలు, మానకొండూరు, నర్సంపేటలో సమీకృత భవనాలను నిర్మించనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.


వెనుకబడిన వర్గాల పిల్లలకు అంతర్జాతీయ స్థాయి నాణ్యతతో కూడిన విద్యను అందించడం, ఆర్థిక సమస్యలతో చదువును మధ్యలో వదిలేయకుండా గురుకుల విధానంలో పూర్తి వసతులు కల్పించడం సమీకృత గురుకులాల లక్ష్యమని వెల్లడించింది. వీటిలో సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథమెటిక్స్‌ (స్టెమ్‌) కోర్సులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్‌, ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన జేఈఈ కోసం ప్రత్యేకశిక్షణ ఇవ్వనున్నారు. 28 సమీకృత గురుకులాలకు సంబంధించిన ప్రిన్సిపాల్స్‌ పోస్టులనూ ప్రభుత్వం మంజూరు చేసింది. కొత్త సమీకృత గురుకులాల ఏర్పాటు, నిర్వహణ బాధ్యతలను తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌ ఇనిస్టిట్యూషన్స్‌ సొసైటీకి అప్పగించింది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పరిధిలోని కొందుర్గులో నిర్మించనున్న సమీకృత గురుకుల భవనానికి సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. మిగతాచోట్ల మంత్రుల నేతృత్వంలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి.


  • ప్రస్తుతం ఇలా.. కొత్త వాటిలో ఇలా..

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1022 గురుకులాలు ఉండగా.. 394మాత్రమే సొంత భవనాల్లో కొనసాగుతున్నాయి. 628 విద్యా సంస్థలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్న వాటిలోనూ కొన్ని వినియోగానికి అనువుగా లేవు. అరకొర వసతులతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గురుకులాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో ఉన్న ప్రభుత్వం.. సమీకృత గురుకులా ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆయా మండలాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్‌ కేటగిరీలకు వేర్వేరు గురుకులాలు ఉండగా.. కొత్తగా ఏర్పాటు చేసే సమీకృత భవనాల్లో ఒక్కో కేటగిరీకి ఒక్కో బ్లాక్‌ కేటాయించేలా కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం మంజూరు చేసిన సమీకృత భవనాల నిర్మాణానికి రూ.5వేల కోట్లు అవసరమవుతాయని, ఈ మేరకు నిధులు విడుదల చేస్తామని ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓ సందర్భంలో వెల్లడించారు.


  • నూతన భవనాల్లో సకల సౌకర్యాలు

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని లక్ష్మీపురం వద్ద నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ మోడల్‌ను ఇప్పటికే ఖరారు చేశారు. సుమారుగా 20 ఎకరాల్లో అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌, తరగతి గదులు, ప్రయోగశాలలు, ఆట స్థలం, బాలబాలికలకు వేర్వేరు హాస్టళ్లు, టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌ సిబ్బందికి నివాస సముదాయాలు ఏర్పాటు చేసేలా నమూనా రూపొందించారు. తరగతి గదుల్లో డిజిటల్‌ బోర్డులు, కంప్యూటర్‌ ల్యాబ్‌లు, క్రీడా మైదానాలు, యాంప్‌ థియేటర్‌ వంటి అధునాత సౌకర్యాలు కల్పిస్తారు.


రెండు అంతస్తుల్లో క్లాస్‌ రూమ్‌లు, మూడు అంతస్తుల్లో బాలబాలికలకు వేర్వేరు హాస్టళ్లు, 5 అంతస్తుల్లో సిబ్బందికి వసతి సౌకర్యాలు.. ఇలా వేర్వేరు బ్లాక్‌లు ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థుల మానసిక ఉల్లాసం కోసం క్రికెట్‌ గ్రౌండ్‌, ఫుట్‌బాల్‌ కోర్టు, బాస్కెట్‌బాల్‌, వాలీబాల్‌, టెన్నిస్‌ కోర్టులతోపాటు ఔట్‌డోర్‌ జిమ్‌, ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌ ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో గురుకులంలో 2,560మంది విద్యార్థులు ఉండేలా నిర్మాణాలు చేపట్టనున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసే లైబ్రరీలో 5వేల పుస్తకాలను అందుబాటులో ఉంచనున్నారు. 900 మంది ఒకేసారి కూర్చుని భోజనం చేసేలా డైనింగ్‌ హాల్‌ను నిర్మించనున్నారు.

Updated Date - Oct 11 , 2024 | 03:22 AM