Ram Chandra Nayak: ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర!
ABN, Publish Date - Nov 19 , 2024 | 02:58 AM
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీఆర్‌ఎస్ నేతలు కుట్ర చేస్తున్నారని, అందులో భాగంగానే లగచర్లలో అమాయక గిరిజన రైతుల్ని రెచ్చగొడుతున్నారని ప్రభుత్వ విప్ రాంచంద్రనాయక్, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే బాలూ నాయక్ ఆరోపించారు.
అందుకే బీఆర్‌ఎస్ లగచర్ల రైతుల్ని రెచ్చగొడుతోంది
ఎస్టీ కమిషన్‌కు కాంగ్రెస్ గిరిజన ఎమ్మెల్యేల ఫిర్యాదు
హైదరాబాద్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీఆర్‌ఎస్ నేతలు కుట్ర చేస్తున్నారని, అందులో భాగంగానే లగచర్లలో అమాయక గిరిజన రైతుల్ని రెచ్చగొడుతున్నారని ప్రభుత్వ విప్ రాంచంద్రనాయక్, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే బాలూ నాయక్ ఆరోపించారు. ఈ మేరకు జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. కమిషన్ సభ్యుడు జాటోతు హుసేన్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు.. ఈ మేరకు ఫిర్యాదు చేశారు. బీఆర్‌ఎస్ పాలనలో రైతులకు సంకెళ్లు వేశారని, దళితులను ట్రాక్టర్లతో తొక్కించారని చెప్పారు. తమ ప్రభుత్వం రైతుల సమస్యలు విని, పరిష్కరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. లగచర్లలో ప్రజలు, రైతుల సమస్యలు తెలుసుకునేందుకు కలెక్టర్, అధికారులు వెళితే..ఎలాంటి చర్చకూ ఆస్కారం ఇవ్వకుండా దాడి చేశారని, దీన్నిబట్టే దాడి వెనక కుట్ర కోణం ఉందని అర్థమవుతోందని చెప్పారు. రైతుల ముసుగులో అధికారులను చంపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. లగచర్ల ఘటనలో అరెస్టయిన వారిలో ఏడుగురికి అసలు భూమే లేదని ఎంపీ బలరాంనాయక్ చెప్పారు.
అక్కడ సేకరించాలనుకున్న 1350 ఎకరాల్లో గిరిజన భూములు 200 ఎకరాలు మాత్రమేనన్నారు. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడిని కలిసిన అనంతరం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఎవరికీ ఇబ్బంది లేకుండా భూసేకరణ జరపాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. అమాయక గిరిజనులను అడ్డం పెట్టుకొని పబ్బం గడపాలని కేటీఆర్ చూస్తున్నారని రాంచంద్రనాయక్ ఆరోపించారు. కేటీఆర్, పట్నం నరేందర్‌రెడ్డి ఉసిగొల్పితేనే గిరిజనులు అధికారులపై దాడి చేశారని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకునేందుకే కేటీఆర్ లంబాడీలను ఉసిగొలిపే ప్రయత్నం చేస్తున్నాడని బాలూ నాయక్ ఆరోపించారు. అక్కడ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటైతే గిరిజనులకు ఉద్యోగాలు వస్తాయని, వారికి ఉద్యోగాలు రావడం కేటీఆర్‌కు ఇష్టం లేదని చెప్పారు. లగచర్లలో రాళ్లు, కర్రలు దొరకవని, ముందుస్తు వ్యూహంతోనే వాటిని తెప్పించుకుని అధికారులపై దాడులు చేశారనిమందుల సామేలు అన్నారు.
నేరెళ్ల దాడిపై విచారణ నివేదిక ఏది?
కేటీఆర్ నియోజకవర్గంలోని నేరళ్లలో దళితులపై జరిగిన దాడి ఘటనపై విచారణ జరిపిన జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆ నివేదికను ఇంతవరకు ఎందుకు బయట పెట్టలేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ఒక్కటేనని చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేరెళ్ల బాధితులను పరామర్శించామే కానీ, బీఆర్‌ఎస్ నేతల్లా అధికారులపై దాడులు చేయించలేదని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చెప్పారు.
Updated Date - Nov 19 , 2024 | 02:58 AM