Government budget: ఆశలన్నీ ఆ మూడింటిపైనే!
ABN, Publish Date - Jul 26 , 2024 | 03:07 AM
భారీ పథకాలకు అవసరమైన నిధుల కోసం.. సర్కారు ప్రధానంగా మూడు శాఖలపైనే ఆశలు పెట్టుకుంది. కొత్త అప్పులకు అవకాశం లేకపోవడం, కేంద్రం ఆదుకుంటుందన్న ఆశలూ లేకపోవడంతో రాష్ట్ర ఖజానాకు ఎక్కువ ఆదాయాన్ని అందించే ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, రవాణా శాఖలను నమ్ముకుంది.
భారీ పథకాలకు నిధుల కోసం ఎక్సైజ్,
రిజిస్ట్రేషన్, రవాణా శాఖలపై సర్కారు దృష్టి
వాటి ఆదాయ లక్ష్యం రూ.52,322 కోట్లు
భారీ పథకాలకు అవసరమైన నిధుల కోసం.. సర్కారు ప్రధానంగా మూడు శాఖలపైనే ఆశలు పెట్టుకుంది. కొత్త అప్పులకు అవకాశం లేకపోవడం, కేంద్రం ఆదుకుంటుందన్న ఆశలూ లేకపోవడంతో రాష్ట్ర ఖజానాకు ఎక్కువ ఆదాయాన్ని అందించే ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, రవాణా శాఖలను నమ్ముకుంది. రూ.2.91 లక్షల కోట్లతో ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్‌లో రూ.52,322 కోట్లు వీటి ద్వారానే ఆర్జించాలని నిర్ణయించింది. మొత్తం బడ్జెట్‌లో ఇది దాదాపు 18ు కావడం గమనార్హం. నిరుటితో పోలిస్తే ఈ మూడు శాఖల నుంచి రూ.10,343 కోట్లు అదనంగా సమీకరించాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. శాఖలవారీగా పరిశీలిస్తే..
రవాణా శాఖ నుంచి..
రవాణా శాఖ ద్వారా ఈ ఏడాది రూ.8,477.93 కోట్ల ఆదాయం సమకూర్చుకోనునున్నట్టు ప్రభుత్వం ప్రతిపాదించింది. గతేడాది రవాణా శాఖ నుంచి వచ్చిన ఆదాయం.. రూ.7,094.82 కోట్లు. అంటే, గత ఏడాదితో పోలిస్తే దాదాపు రూ.1,383 కోట్లు అధికం. ఈమేరకు ఆదాయాన్ని పెంచుకునేలా చర్యలు చేపట్టనున్నట్టు సమాచారం. రాష్ట్రంలో ఏటా వాహనాల రిజిస్ట్రేషన్‌ల సంఖ్య 10శాతానికి పైగా పెరుగుతోంది. రూ.10 లక్షలలోపు ఖరీదైన వాహనాలపై 12ు, అంతకు మించి ఖరీదైన వాహనాల నుంచి 18 శాతానికి పైగా రవాణా శాఖ లైఫ్ టాక్స్ వసూలు చేస్తోంది. కాగా 2024-25 ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యం మేరకు ఆదాయాన్ని సమకూర్చడానికి.. బకాయిల వసూలుకు విస్తృత స్థాయి తనిఖీలతో పాటు కొన్ని మోటారు వాహనాలపై 1నుంచి 2 శాతం వకు టాక్స్ పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
అబ్కారీ నుంచి..
ఎక్సైజ్ శాఖ నుంచి సర్కారు 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.25,617 కోట్లు రాబట్టాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. నిరుటితో పోలిస్తే ఇది రూ.5,319 కోట్లు (21 శాతం) అదనం. ఎందుకంటే.. గత ఐదేళ్ల నుంచి ఏటా ఎక్సైజ్ శాఖ ఆదాయం సగటున 5-6 శాతం మేర పెరుగుతోంది. గత ఏడాది కొత్త మద్యం దుకాణాల కేటాయింపు, లైసెన్స్ ఫీజు పెంచడంతో పెరుగుదల 9 శాతంగా నమోదైంది. వచ్చే ఏడాది వరకు కొత్త మద్యం దుకాణాల కేటాయింపు లేదు. అయినప్పటికీ ప్రభుత్వం ఆదాయ అంచనాను పెంచడం గమనార్హం. కాగా.. ఆదాయం పెంచుకునేందుకు కొత్తగా ఎలైట్ బార్లను ప్రవేశపెట్టాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి..
రిజిస్ట్రేషన్ల ఆదాయం ఈసారి భారీగా పెరుగుతుందని బడ్జెట్‌లో పేర్కొన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.18,228 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు. ఇది గత ఏడాది బడ్జెట్‌లో రాబడి అంచనాల కంటే తక్కువే. అయితే గత ఏడాది వాస్తవ రాబడికంటే మాత్రం చాలా ఎక్కువ. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రూ.14,588 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది మరో రూ.3,640 కోట్ల ఆదాయం అదనంగా వస్తుందని బడ్జెట్‌లో చూపించారు. ఆదాయం అంత మేర పెరుగుతుందా అనే అనుమానాలున్నాయి. కానీ.. ప్రభుత్వం మాత్రం ఆమేరకు ఆదాయం పెంచుకోవాలని చూస్తోంది. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ విలువల సవరించే నివేదిక బాధ్యతలను ప్రైవేట్ ఏజన్సీకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏజన్సీ నుంచి నివేదికలు రాగానే రిజిస్ట్రేషన్ విలువలను సవరించనున్నట్లు సమాచారం.
Updated Date - Jul 26 , 2024 | 03:07 AM