ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Governor: సాగులో సౌర పంపుసెట్లను పెంచాలి

ABN, Publish Date - Aug 29 , 2024 | 04:35 AM

వ్యవసాయ రంగంలో సౌర పంపు సెట్ల వాడకాన్ని ప్రోత్సహించాలని, రైతుల సుస్థిరాభివృద్ధిపై అధికారులు దృష్టి సారించాలని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ సూచించారు.

  • రైతుల సుస్థిరాభివృద్ధిపై దృష్టి పెట్టాలి

  • సమస్యలపై ప్రజలు నన్ను కలవచ్చు

  • వరంగల్‌ పర్యటనలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌

ములుగు/హనుమకొండ/కలెక్టరేట్‌, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ రంగంలో సౌర పంపు సెట్ల వాడకాన్ని ప్రోత్సహించాలని, రైతుల సుస్థిరాభివృద్ధిపై అధికారులు దృష్టి సారించాలని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తోందని, కానీ.. ఆ వ్యయాన్ని తగ్గించేందుకు రైతులు కూడా పీఎం కుసుమ్‌ యోజన కింద తమ సౌర విద్యుత్‌ మోటార్లను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవడం, జలవనరులను కాపాడుకోవడం, వ్యర్థాల నుంచి పునరుద్పాదకత, ఇంధన వనరుల పొదుపు వంటి చర్యల ద్వారా సుస్థిరాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.


సేంద్రియ వ్యవసాయంపై ప్రధానంగా దృష్టి సారించాలని, లేదంటే మితిమీరి వాడుతున్న ఎరువుల వల్ల భూమి నిస్సారమమయ్యే ప్రమాదం ఉందన్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా వరంగల్‌ వచ్చిన ఆయన బుధవారం ఉదయం హనుమకొండ కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కవులు, రచయితలు, కళాకారులు, వివిధ రంగాల ప్రముఖులతో భేటీ అయ్యారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి నిరంతర ప్రక్రియ, అది సుస్థిరమైప్పుడే ఆశించిన ఫలితాలు దక్కుతాయని, ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని అన్నారు.


మహిళల ఆర్థిక స్వావలంబనకు స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ)ను బలోపేతం చేయాలని, ఇది ఒక ఉద్యమంలా సాగాలని పేర్కొన్నారు. కాకతీయులు ఏలిన ఓరుగల్లులో పర్యటించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. చారిత్రక దేవాలయాలు, పురాతన కట్టడాలను చూసి దివ్యానుభూతికి లోనయ్యానన్నారు. రాజ్‌భవన్‌ తలుపులు తెరిచే ఉంటాయని, ఎలాంటి సమస్యలున్నా ప్రజలు తనను స్వేచ్ఛగా కలవవచ్చని పేర్కొన్నారు. ఎన్‌ఐటీ గెస్ట్‌హౌస్‌ చేరుకున్న గవర్నర్‌ వర్మకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్‌, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగతం పలికారు.


  • తలసేమియా వార్డు ప్రారంభం

రెడ్‌ క్రాస్‌ సొసైటీ సేవలు బాగున్నాయని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అభినందించారు. సుబేదారిలోని రెడ్‌క్రాస్‌ సొసైటీకి వచ్చిన ఆయన.. నూతనంగా నిర్మించిన తలసేమియా వార్డును ప్రారంభించారు. తలసేమియా బాధితులతో మాట్లాడి బాగోగులు తెలుసుకున్నారు. రెడ్‌క్రాస్‌ సంస్థ సేవలు, కార్యక్రమాల గురించి చైర్మన్‌ విజయ్‌చందర్‌రెడ్డి గవర్నర్‌కు వివరించారు. అనంతరం గవర్నర్‌ మాట్లాడుతూ.. రక్తదానంతో పాటు సేవా కార్యక్రమాలు చేస్తున్న రెడ్‌క్రాస్‌ అభ్యున్నతికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సూచించారు. తలసేమియా బాధితులకు అండగా రెడ్‌క్రాస్‌ అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు.


  • ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటా

ములుగు జిల్లాలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని గవర్నర్‌ వర్మ తెలిపారు. మంగళవారం రాత్రి లక్నవరంలో బస చేసిన గవర్నర్‌.. బుధవారం ఉదయం మంత్రి సీతక్క, అధికారులతో కలిసి బోటింగ్‌ చేస్తూ ప్రకృతిని తిలకించారు. గవర్నర్‌ను జ్ఞాపికతో సత్కరించిన మంత్రి.. జిల్లా అభివృద్ధికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Aug 29 , 2024 | 04:35 AM

Advertising
Advertising