Share News

Ponguleti: నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు

ABN , Publish Date - Dec 06 , 2024 | 04:40 AM

నిరుపేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదల ఇళ్ల కల సాకారమవుతుందని, నియోజకవర్గానికి 3500 చొప్పున గృహాలను కేటాయిస్తున్నామన్నారు.

Ponguleti: నియోజకవర్గానికి 3,500  ఇందిరమ్మ ఇళ్లు

  • ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు: పొంగులేటి

  • హైదరాబాద్‌లో 81 మంది పేదలకు డబుల్‌ ఇళ్ల పట్టాలు

  • ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చుతున్నాం: పొన్నం

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): నిరుపేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదల ఇళ్ల కల సాకారమవుతుందని, నియోజకవర్గానికి 3500 చొప్పున గృహాలను కేటాయిస్తున్నామన్నారు. నాలుగేళ్లలో రాష్ట్రంలో 4.5 లక్షల గృహాలను నిర్మించడమే లక్ష్యం అని పేర్కొన్నారు. హైదరాబాద్‌ కలెక్టరేట్‌లో గురువారం జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం కమలానగర్‌, ముషీరాబాద్‌ నియోజకవర్గం బాకారం ప్రాంతానికి చెందిన 81 మంది పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పట్టాలను మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్‌ అందజేశారు. నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి, విడతల వారీగా రూ.5లక్షలు అందజేస్తామన్నారు.


ఇళ్ల సర్వేకోసం అధికారులు వస్తారని, ప్రజలు పూర్తి సమాచారం అందించాలని సూచించారు. తమ ప్రభుత్వం పేద ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తోందని పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్‌ యాప్‌ ద్వారా అర్హులను ఎంపిక చేసి పారదర్శకంగా అందిస్తామన్నారు. హైదరాబాద్‌లో ఉన్న మురికివాడల్లో ఇందిరమ్మ ఇళ్ల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ముషీరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన పది మంది లబ్థిదారులు తమకు ఇళ్లు రాలేదని స్థానిక నాయకులను, రెవెన్యూ అధికారులను నిలదీశారు. తమ ప్రాంతంలో ఒక్కొక్కరు రెండు, మూడు ఇళ్లు తీసుకున్నారని ఆరోపించారు. కలెక్టరేట్‌లో ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు, బస్తీ నాయకులు వారికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు.

Updated Date - Dec 06 , 2024 | 04:40 AM