ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

High Court: విద్యా విషయాల్లో నిపుణుల అభిప్రాయాలే కీలకం

ABN, Publish Date - Oct 16 , 2024 | 04:17 AM

రాష్ట్రంలో గ్రూప్‌-1 పరీక్షల నిర్వహణకు అడ్డంకి తొలగింది. జూన్‌ 9న జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లను హైకోర్టు మంగళవారం కొట్టివేసింది.

వాటిని కోర్టులు విచక్షణాధికారం ద్వారా పునఃస్థాపించలేవు

  • నిపుణుల కమిటీ ఒకటికి రెండుసార్లు పరిశీలించాకే తుది కీ

  • అభ్యర్థులు నేరుగా జవాబిచ్చేలా ప్రశ్నలను కోరుకోకూడదు

  • గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దు చేయాలన్న పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు

  • మెయిన్స్‌కు తొలగిన అడ్డంకులు.. 21 నుంచి పరీక్షల నిర్వహణ

హైదరాబాద్‌, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గ్రూప్‌-1 పరీక్షల నిర్వహణకు అడ్డంకి తొలగింది. జూన్‌ 9న జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లను హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. దీంతో మెయిన్స్‌కు అడ్డంకులు తొలగినట్లయింది. ఈ నెల 21 నుంచి పరీక్షలను టీజీపీఎస్సీ యథావిధిగా నిర్వహించనుంది. కాగా, విచారణ సందర్భంగా.. విద్యా సంబంధిత విషయాల్లో నిపుణుల అభిప్రాయాలే కీలకంగా ఉంటాయని, వాటిని కోర్టులు తమ విచక్షణాధికారం ద్వారా పునఃస్థాపించలేవని స్పష్టం చేసింది. జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉండదని తేల్చి చెప్పింది.


సప్లిమెంటరీ నోటిఫికేషన్‌ ఇచ్చి పరీక్ష నిర్వహించడం చెల్లదని.. ప్రిలిమ్స్‌లోని ఏడు ప్రశ్నలకు తుది ‘కీ’లో సరైన జవాబులు ఇవ్వలేదని, వాటికి మార్కులు కలిపి మళ్లీ జాబితా ఇవ్వాలని, పలు ప్రశ్నలను తొలగించి మళ్లీ ఫలితాలు ప్రకటించేలా ఆదేశించాలని, గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్‌ పుల్ల కార్తీక్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. 1,721 మంది అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ ద్వారా 6,147 అభ్యంతరాలు వచ్చాయని, వీటిపై టీజీపీఎస్సీ సబ్జెక్టుల వారీగా ప్రఖ్యాత విద్యా సంస్థలకు చెందిన ఫ్రొఫెసర్లతో నిపుణుల కమిటీ వేసిందని హైకోర్టు తెలిపింది. ‘‘విషయ నిపుణుల అభిప్రాయాల ఆధారంగా 56, 59 సంఖ్య కలిగిన ప్రశ్నలను తొలగించి.. 115వ ప్రశ్నకు ఆప్షన్‌ను సవరించి ఫైనల్‌ కీని విడుదల చేసింది. పిటిషనర్లు సమర్పించిన అభ్యంతరాలను నిపుణుల కమిటీ ఒకటికి రెండుసార్లు పరిశీలించాకే ఫైనల్‌ కీ ఇచ్చారు. అభ్యర్థులు వారు నేరుగా సమాధానం ఇచ్చేలా ప్రశ్నలు రావాలని కోరుకోకూడదు.


అర్హత కలిగిన, సమర్థులైన వ్యక్తులను ఎంపిక చేయడానికి పరీక్షలు నిర్వహిస్తారు. ప్రిలిమినరీ కేవలం అర్హత పరీక్ష మాత్రమే. అది అంతిమ ఎంపిక కాదు’’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ‘పూర్తిగా సాంకేతిక అంశాలను నిపుణులైన వ్యక్తులు, సంస్థలకు వదిలేయడమే ఉత్తమం. వచ్చిన అభ్యంతరాలన్నింటినీ నిపుణులు పరిశీలించిన తర్వాతే జూలై 7న ఫైనల్‌ కీ ఇచ్చారు. ప్రతివాదులు సమర్పించిన వివరాలు, సంబంధిత మెటీరియల్‌, సమాధానాలతో సంతృప్తి చెందాం. ఈ మేరకు పిటిషన్లను డిస్మిస్‌ చేస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. పలు సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల ద్వారా.. విద్యా సంబంధ విషయాల్లో నిపుణులు ఇచ్చే అభిప్రాయాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని అర్థమవుతోందని పేర్కొంది. ‘ప్రశ్నలను కోర్టులో విశ్లేషించడానికి అనుమతి అసలే ఉండదు. కేసులు పెండింగ్‌లో ఉండడం వల్లే చాలాకాలంగా నియామకాలు నిలిచిపోతున్నాయి. తాత్కాలికంగా నియమితులైనవారు తమను రెగ్యులరైజ్‌ చేయాలని కోరుతున్నారు. మరోవైపు తగినంతమంది అధికారులు, సిబ్బంది లేక పాలనకు తీవ్ర విఘాతం కలుగుతున్నది’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది.


  • హైడ్రా జీవోతో మీకేంటి ఇబ్బంది? పిటిషనర్లకు ప్రశ్న

హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో 99తో మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అంటూ పలువురు పిటిషనర్లను జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం మంగళవారం ప్రశ్నించింది. ఏ అధికారంతో ఈ జీవోను సవాల్‌ చేస్తున్నారు? అని నిలదీసింది. హైడ్రా జీవోను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టింది. హైడ్రా చట్టప్రకారం వ్యవహరించాలని, అన్ని పత్రాలు, టైటిల్స్‌ పరిశీలించాకే చర్యలు చేపట్టాలని హైకోర్టు సింగిల్‌ జడ్జి తీర్పు ఇచ్చారని, ఇంకా అభ్యంతరం ఏంటని అడిగింది. మీ భవనాలను కూల్చివేస్తే ప్రభుత్వం నుంచి పరిహారం కోరాలని, తమ ఉత్తర్వులు పాటించకపోతే కోర్టు ధిక్కరణ పిటిషన్లు వేసుకోవాలని సూచించింది. ఇన్ని మార్గాలు ఉండగా హైడ్రా జీవోను సవాల్‌ చేయాల్సిన అవసరం ఏంటి? అని ప్రశ్నించింది. ఈ పిటిషన్‌లో కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. ఈ మేరకు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Updated Date - Oct 16 , 2024 | 04:17 AM