Harish Rao: ఫీజుల చెల్లింపుల్లో సర్కారు నిర్లక్ష్యం
ABN, Publish Date - Oct 09 , 2024 | 04:28 AM
ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయి విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, 13 లక్షల మంది విద్యార్థుల జీవితాలను అగమ్యగోచరంగా మార్చిందని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.
13 లక్షల విద్యార్థుల జీవితాలు అగమ్యగోచరం.. ఇప్పటికైనా ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించాలి
కాంగ్రెస్ మోసాన్ని హరియాణ ప్రజలు గమనించారు: హరీశ్
హైదరాబాద్/సిద్దిపేట టౌన్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయి విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, 13 లక్షల మంది విద్యార్థుల జీవితాలను అగమ్యగోచరంగా మార్చిందని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. విద్యాసంస్థల యాజమాన్యాలు టీసీ, ఇతర సర్టిఫికెట్లు ఇవ్వని కారణంగా ఈ విద్యాసంవత్సరం చదువును కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నారు. మంగళవారం తెలంగాణ ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు హైదరాబాద్‌లో హరీశ్ రావును కలిసి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా, సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రూ.19 వేల కోట్లు ఫీజుల కోసం నిధులు విడుదల చేశామని తెలిపారు. ఏటా సగటున క్రమం తప్పకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్‌కోసం రూ.2వేల కోట్లు విడుదల చేసినట్లు వివరించారు.
కాంగ్రెస్ అధికారం చేపట్టిన పది నెలల్లో ఒక్కరూపాయి కూడా విడుదల చేయలేదని విమర్శించారు. ఇప్పటికేౖనా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణ విద్యార్థులకు కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీట్లు రావడం సంతోషకరమని, మూడు లక్షల పైగా ర్యాంకులు వచ్చిన వారికి కూడా సీట్లు దక్కడం కేసీఆర్ ఘనతేనని హరీశ్ రావు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడేనాటికి కేవలం 5 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉండగా బీఆర్‌ఎస్ సర్కారు ప్రత్యేక కార్యాచరణ కారణంగా.. గడిచిన పదేళ్లలో 34కు పెరిగాయన్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ చేసిన మోసాన్ని హరియాణ ప్రజలు నిశితంగా గమనించారని, ఆ ప్రభావం అక్కడి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనబడిందని పేర్కొన్నారు. కాగా.. కశ్మీర్‌లో బీజేపీని కూడా విశ్వసించలేదని, దీంతో రెండు జాతీయ పార్టీలపట్ల ప్రజల్లో ఉన్న విముఖత స్పష్టమైందని ఆయన అన్నారు.
పండుగపూట జీతాలివ్వని ప్రభుత్వం
రాష్ట్రంలో జీతాలు లేక ఆశాలు, ఆంగన్‌వాడీలు, పార్ట్‌టైం, గెస్ట్ లెక్చరర్లు పండుగ పూట పస్తులు ఉండాల్సిన పరిస్థితి దాపురించిందని హరీశ్ రావు అన్నారు. ఒకటవ తేదీన జీతాలు ఇస్తున్నామన్న ప్రభుత్వం చెబుతున్నా.. ఆచరణలో జరగడం లేదని విమర్శించారు. కాగా, మంగళవారం సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో హరీశ్‌రావును ఆశావర్కర్లు కలిసి తమకు ప్రభుత్వం జీతాలు చెల్లించడం లేదంటూ గోడు వెళ్లబోసుకున్నారు.
Updated Date - Oct 09 , 2024 | 04:28 AM