Harish Rao,: హైడ్రోజన్ బాంబులా హైడ్రా..
ABN, Publish Date - Sep 29 , 2024 | 03:57 AM
హైడ్రా.. హైడ్రోజన్ బాంబులా మారిందని, ఎవరికీ కంటి మీద కునుకు లేకుండా పోయిందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
మూసీలో పేదల రక్తం పారించే ప్రయత్నం
బుచ్చమ్మది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్య: హరీశ్‌రావు
హైదరాబాద్/అడ్డగుట్ట, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): హైడ్రా.. హైడ్రోజన్ బాంబులా మారిందని, ఎవరికీ కంటి మీద కునుకు లేకుండా పోయిందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మూసీలో గోదావరి నీళ్లు పారిస్తానని చెప్పి పేద, మధ్య తరగతి ప్రజల రక్తం, కన్నీళ్లు పారించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం తెలంగాణ భవన్‌లో మూసీ సుందరీకరణ బాధితులతో మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితాఇంద్రారెడ్డి సమావేశమై సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడు తూ.. హైడ్రా బాధితులకు న్యాయ సహాయం అందించేందుకు తెలంగాణ భవన్‌లో 24 గంటలు బీఆర్‌ఎస్ లీగల్ టీమ్ అందుబాటులో ఉంటుందని భరోసానిచ్చారు.
కాగా, పైసా.. పైసా కూడబెట్టి ఇళ్లు కొన్నామని.. కూల్చివేతల విషయం తెలిసినప్పటి నుంచి గొంతులో ముద్ద దిగడం లేదని బాధితులు హరీశ్ ముందు గోడు వెళ్లబోసుకుని కన్నీరు పెట్టగా.. హరీశ్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. మరోవైపు.. హైడ్రా అధికారుల వేధింపుల కారణంగానే బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుందని హరీశ్ రావు ఆరోపించారు. ఇది ఆత్మహత్య కాదని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య అని ధ్వజమెత్తారు. కూకట్‌పల్లిలో ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మ మృతదేహం గాంధీ మార్చురీలో ఉందని తెలుసుకున్న ఎమ్మెల్యేలు హారీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, మాధవరపు కృష్ణారావులు ఆస్పత్రికి చేరుకున్నారు. బుచ్చమ్మ మృతదేహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ తన ఇల్లును ఎక్కడ కూల్చివేస్తారనో భయంతోనే బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. హైడ్రా భయంతో ఇప్పటికే ముగ్గురు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇంకా ఎంత మందిని చంపదలుచుకున్నారని ఆయన ప్రశ్నించారు.
Updated Date - Sep 29 , 2024 | 03:57 AM