Harish Rao: బతుకమ్మ చీరల విషయంలో సీతక్క పొంతన లేని వ్యాఖ్యలు: హరీశ్
ABN, Publish Date - Oct 18 , 2024 | 03:53 AM
కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీని ఎందుకు నిలిపివేసిందన్న అంశంపై మంత్రి సీతక్క పొంతనలేని వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.
హైదరాబాద్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీని ఎందుకు నిలిపివేసిందన్న అంశంపై మంత్రి సీతక్క పొంతనలేని వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. చీరలు ఎందుకు ఇవ్వలేదో చెప్పకుండా ఇతర విషయాలు మాట్లాడుతున్నారన్నారు. అయితే బీఆర్‌ఎస్ హయాంలో ఏటా రూ.300 కోట్లతో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారని ఒప్పుకున్న సీతక్కకు ధన్యవాదాలని చెప్పారు. కానీ అంతకుమించిన ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు కల్పించినట్లు భ్రమలు కల్పించే ప్రయత్నం చేయడం హాస్యాస్పదమన్నారు.
ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు ఇచ్చిన హామీలు అమలుచేయకుండా ప్రచారం కోరుకోవడం ముఖ్యమంత్రితో పాటు మంత్రులకు అలవాటుగా మారిందన్నారు. మహాలక్ష్మి పథకం బకాయిలు అలాగే ఉన్నాయని, కళ్యాణలక్ష్మి పథకంలో అదనంగా తులం బంగారం ఇస్తామని మాట తప్పారని విమర్శించారు. రూ.500కు వంటగ్యాస్, గృహజ్యోతి కొందరికే పరిమితమైందని, హామీల అమలు విషయంలో చేసింది గోరంత, చెప్పుకునేది కొండంతగా ఉందన్నారు. మహిళల గౌరవాన్ని నిలబెడుతున్నామన్న కాంగ్రెస్ మాటలు అటుంచితే, ముందు మహిళల ప్రాణాలు కాపాడాలని, వారి భద్రతకు భరోసా ఇవ్వాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలు తక్షణం చెల్లించాలని డిమాడ్ చేశారు.
Updated Date - Oct 18 , 2024 | 03:53 AM