కాళేశ్వరంపై పొన్నంది అవగాహనా రాహిత్యం
ABN, Publish Date - Sep 23 , 2024 | 05:22 AM
కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి పొన్నం ప్రభాకర్ అవగాహనా రాహిత్యం బయటపడిందని ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తిచేసింది మేమే: హరీశ్
హైదరాబాద్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి పొన్నం ప్రభాకర్ అవగాహనా రాహిత్యం బయటపడిందని ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు తామే పూర్తి చేశామని పొన్నం గొప్పలు చెప్పకోవడం విడ్డూరమన్నారు. పెండింగ్ ప్రాజెక్టుగా మిగిలిన ఎల్లంపల్లి ప్రాజెక్టును బీఆర్‌ఎస్ ప్రభుత్వమే పూర్తిచేసి వినియోగంలోకి తెచ్చిందన్న విషయాన్ని పొన్నం మరిచిపోతున్నారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎల్లంపల్లి ప్రాజెక్టును ఒక కీలకమైన ‘బ్యాలెన్సింగ్ రిజర్వాయర్’గా మార్చిన తర్వాతనే జలాశయం మీద ఆధారపడిన అన్ని ప్రాంతాలకు నీటిని అందించే పని ప్రారంభమైందన్నారు. ఉత్తర తెలంగాణ సీనియర్ నాయకుడిగా పొన్నం ప్రభాకర్ కాళేశ్వరం ప్రాజెక్టులో లింకు-1 పునరుద్దరణపై దృష్టి పెట్టాలన్నారు. కాగా, హైదరాబాద్‌లో నిర్వహించిన సీఎల్పీ సమావేశానికి అరికెపూడి గాంధీ హాజరయ్యారంటూ హరీశ్‌రావు ఎక్స్‌లో ఒక ఫోటోను అప్‌లోడ్ చేశారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమాధానం చెప్పాలని, పార్టీ ఫిరాయింపులపై బుకాయింపులు చాలించాలని హరీశ్ సూచించారు.
Updated Date - Sep 23 , 2024 | 05:22 AM