Harish Rao: కాంగ్రెస్ పాలన అంతా వంచనే
ABN, Publish Date - Dec 09 , 2024 | 03:21 AM
‘‘కాంగ్రెస్ ఏడాది పాలన అంతా ప్రజలను వంచించడమే సరిపోయింది. బడికి వెళ్లే చిన్నారుల నుంచి పింఛన్లు అందుకునే అవ్వ, తాతల వరకు.., నిరుద్యోగుల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వరకు అందరినీ వంచించింది.
ఇప్పుడు జరపాల్సింది వంచనోత్సవాలే.. రాజకీయాల్లో భాషను దిగజార్చిన రేవంత్
తిట్లు, ఒట్లు తప్ప చేసిందేముంది?
ఉద్యమంలోనూ ఇంత నిర్బంధం లేదు
లంకె బిందెల కోసమే ‘మూసీ’: హరీశ్
కాంగ్రెస్ ఏడాది పాలనపై చార్జిషీట్
హైదరాబాద్, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ‘‘కాంగ్రెస్ ఏడాది పాలన అంతా ప్రజలను వంచించడమే సరిపోయింది. బడికి వెళ్లే చిన్నారుల నుంచి పింఛన్లు అందుకునే అవ్వ, తాతల వరకు.., నిరుద్యోగుల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వరకు అందరినీ వంచించింది. ఇప్పుడు జరపాల్సింది విజయోత్సవాలు కాదు.. వంచనోత్సవాలు. 4 కోట్ల మంది ప్రజలను మోసం చేసిన రేవంత్‌రెడ్డి.. 3 కోట్ల దేవతలను మోసం చేయరా?’’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఏడాది పాలన- ఎడతెగని వంచన పేరిట బీఆర్‌ఎస్ రూపొందించిన చార్జ్‌షీట్‌ను ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ఎన్నికల హామీలు అమలులో సీఎం రేవంత్‌రెడ్డి ఫెయిల్ అయ్యారని, హామీలు అమలు చేయాలని అడిగితే మాట మార్చుతూ మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజలకిచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని నిలదీస్తున్న బీఆర్‌ఎస్ శ్రేణులను అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారన్నారు. రేవంత్ పాలనలో తిట్లు, ఒట్లు తప్పం చేసిందేం లేదని, ఉద్యమ సమయంలోనూ ఇలాంటి నిర్బంధాలు చూడలేదని పేర్కొ న్నారు. తెలంగాణలో సంక్షేమాన్ని సర్వనాశనం చేసిన ఘనత రేవంత్ ప్రభుత్వానిదని విమర్శించారు.
రాజకీయాల్లో ఎవరూ ఉపయోగించని మాటల మాట్లాడుతూ.. సీఎం స్థాయికి తగని విధంగా భాషను దిగజార్చారని మండిపడ్డారు. గాంధీభవన్ వేదికగా సూచించిన అంశాలతోనే చట్టాలు తెస్తున్నారని, రాష్ట్ర పాలన అంతా అక్కడి నుంచే నడుస్తోందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని, తొమ్మిది చోట్ల మతకలహాలు చోటు చేసుకోవడమే ఉదాహరణ అని పేర్కొన్నారు. రాష్ట్ర ఆదాయం పెంచడం చేతకాలేదు కానీ.. కాంగ్రెస్ నేతల ఆదా యం మాత్రం పెంచుకున్నారన్నారు. ఏడాదిలోనే రేవంత్ ప్రభుత్వం లక్ష కోట్ల అప్పు చేసిందని, అభివృద్ధి పనులు చేయకుండా ఆ మొత్తాన్ని ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రూ.4.20 లక్షల కోట్లు అప్పు చేస్తే.. రూ.7లక్షల కోట్లంటూ కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం చేస్తోందన్నారు. కాంగ్రెస్ పాలన అంతా ఆగమాగం ఉందని, పోలీసులతో పోలీసు కుటుంబాలనే కొట్టించారని దుయ్యబట్టారు. గురుకులాల్లో కలుషిత ఆహారం తిని.. విద్యార్థులు మృతి చెందినా పట్టించుకున్న పాపాన పోలేదని ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లాలో వరదలు వస్తే ఒక హెలికాప్టర్ పెట్టలేదని, ఆ జిల్లాకు చెందిన ముగ్గురు మత్రులు చేతకాని దద్దమ్మలని విమర్శించారు. పైగా బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన తమపై రాళ్లదాడి చేయించారన్నారు.
రూ.1.5లక్షల కోట్లు కొట్టేసేందుకే..
మూసీ, హైడ్రా పేరుతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను కాంగ్రెస్ సర్కార్ దెబ్బ తీసిందని హరీశ్ రావు మండిపడ్డారు. లంకె బిందెల కోసమే మూసీ ప్రాజెక్టును ముందుకు తెచ్చారని, రూ.1.50లక్షల కోట్లను కొట్టేయబోతున్నారని ఆరోపించారు. మూసీ ప్రక్షాళన మాత్రమే చేయాలన్న కేసీఆర్‌ను.. మూసీలో పడి చావాలని మాట్లాడిన కుసంస్కారి రేవంత్ అని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ఇళ్లు కూల్చడం తప్ప ఒక్క ఇల్లూ కట్టలేదని విమర్శించారు ‘‘మీ ఏడాది పాలనలో ఒక్క చెక్ డ్యాం అయినా కట్టారా? ఏటా 6లక్షల ఎకరాలకు ఆయకట్టు సృష్టిస్తామన్నారు కదా.. ఏడాదిలో 6,500ఎకరాల ఆయకట్టైనా కొత్తగా తెచ్చారా? పాలమూరు బిడ్డనని రెచ్చిపోయే రేవంత్.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు తట్టెడు మట్టైనా ఎత్తారా?’’ అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం చేసిన పనులకు కొత్తగా కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ పెరిగిందని, రేవంత్ పాలనలో ఇరిటేషన్ పెరిగిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయానికి గ్రహణం పట్టిందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ అంటూ డబ్బా కొట్టుకోవడం సిగ్గుచేటని అన్నారు. రైతు బంధును ఎగ్గొట్టిన మోసకారి రేవంత్ అని, ధాన్యం బోన్‌సను కూడా బోగస్ చేశారని ఆయన విమర్శించారు.
Updated Date - Dec 09 , 2024 | 03:21 AM