Phone Tapping: రెడ్‌కార్నర్ నోటీసుకు.. ఆలస్యం ఎందుకు?
ABN, Publish Date - Dec 12 , 2024 | 02:38 AM
విదేశాల్లో ఉన్న ఫోన్‌ట్యాపింగ్ కేసు నిందితులు ప్రభాకర్‌రావు(ఏ1), శ్రవణ్‌రావు(ఏ2)లపై రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేయడానికి ఆలస్యమెందుకని హైకోర్టు పోలీసులను నిలదీసింది.
ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావులను ఎప్పుడు అరెస్టు చేస్తారు: హైకోర్టు
శ్రవణ్‌రావు బెయిల్ పిటిషన్‌లో తీర్పు రిజర్వు
హైదరాబాద్, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): విదేశాల్లో ఉన్న ఫోన్‌ట్యాపింగ్ కేసు నిందితులు ప్రభాకర్‌రావు(ఏ1), శ్రవణ్‌రావు(ఏ2)లపై రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేయడానికి ఆలస్యమెందుకని హైకోర్టు పోలీసులను నిలదీసింది. వారిద్దరినీ ఎప్పుడు అరెస్టు చేస్తారంటూ అసహనం వ్యక్తంచేసింది. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికల్లో ఆలస్యంపై ప్రశ్నించింది. శ్రవణ్‌రావు ముందస్తు బెయిల్ పిటిషన్‌లో తీర్పును రిజర్వ్ చేసింది. పూర్వాపరాల్లోకి వెళ్తే.. తాను ప్రభుత్వోద్యోగిని కాదని, ఫోన్‌ట్యాపింగ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనకు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేయాలని కోరుతూ.. శ్రవణ్‌రావు తన న్యాయవాది ద్వారా హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ కె.సుజన ధర్మాసనం విచారణ చేపట్టింది. శ్రవణ్‌రావు తరఫు న్యాయవాది వాదనలను వినిపిస్తూ.. జర్నలిస్టు అయిన తన క్లైంట్.. వృత్తి ధర్మంలో భాగంగా ఎక్కడికైనా వెళ్తారని, ఎవరితోనైనా మాట్లాడతారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎ్‌సఐబీ)కి వెళ్లారని వివరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు పెట్టిన సెక్షన్లలో తన క్లైంట్‌కు ఏదీ వర్తించదని, ఆయన ప్రభుత్వోద్యోగా కానే కాదని చెప్పారు.
కేసు నమోదైన వెంటనే విదేశాలకు ఎందుకు వెళ్లారనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘నా క్లైంట్ తరచూ ప్రయాణాలు చేస్తుంటారు. అంతేతప్ప.. ఈ కేసున్నందుకే విదేశాలకు వెళ్లలేదు’’ అని వివరణ ఇచ్చారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్‌రావు వాదనలను వినిపిస్తూ.. రెడ్‌కార్నర్ నోటీసు విషయంలో సీబీఐ ఇప్పటికే ఇంటర్‌పోల్‌కు విజ్ఞప్తి చేసిందన్నారు. ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు అరెస్టుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటికే మొదటి చార్జ్‌షీట్ దాఖలు చేశామని, తదుపరి దర్యాప్తు కోసం దిగువ కోర్టు అనుమతి తీసుకున్నట్లు గుర్తుచేశారు. ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు వస్తేగానీ, కేసు దర్యాప్తు ముందుకు సాగదని తెలిపారు. పిటిషనర్ శ్రవణ్‌రావు ఫోన్‌ట్యాపింగ్ కుట్రలో భాగస్వామిగా ఉన్నారని, ట్యాపింగ్‌లో కీలక పాత్ర పోషించారని.. నిందితులంతా కలిసి 62 హార్డ్‌డి్‌స్కలను ముక్కలు చేసి, నదిలో పారేశారని వివరించారు. న్యూస్ చానెల్ ఎండీగా ఉన్న శ్రవణ్‌రావు.. తరచూ ప్రభాకర్‌రావును కలిసి, ఎవరి ఫోన్ ట్యాపింగ్ చేయాలి? అనే అంశంపై, తదుపరి వ్యూహాలపై చర్చలు జరిపేవాడని తెలిపారు. ఈ మేరకు ఇతర నిందితులు వాంగ్మూలమిచ్చారని చెప్పారు. ప్రణీత్‌రావు తరచూ శ్రవణ్‌రావును కలుస్తూ.. టార్గెట్ ఏంటి? అని తెలుసుకునేవాడని వెల్లడించారు. కేసుతో సంబంధం లేకుంటే.. భారత్‌కు తిరిగి రావొచ్చుకదా? అని ప్రశ్నించారు. వాదోపవాదాలను నమోదు చేసుకున్న ధర్మాసనం.. తీర్పును రిజర్వ్ చేసింది.
Updated Date - Dec 12 , 2024 | 02:39 AM