Heavy Rains: రాజధానిలో భారీ వర్షం..
ABN, Publish Date - Sep 07 , 2024 | 04:13 AM
రాజధాని హైదరాబాద్‌లో శుక్రవారం సాయంత్రం.. ఉద్యోగులు ఆఫీసు పని ముగించుకుని ఇళ్లకు బయల్దేరే సమయంలో భారీ వర్షం కురిసింది.
రోడ్లపై మోకాలు వరకు నీరు.. కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్
సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు
ఆరెంజ్ అలర్ట్ జారీ
హైదరాబాద్ సిటీ, ఖమ్మం, సెప్టెంబర్ 6 (ఆంధ్రజ్యోతి): రాజధాని హైదరాబాద్‌లో శుక్రవారం సాయంత్రం.. ఉద్యోగులు ఆఫీసు పని ముగించుకుని ఇళ్లకు బయల్దేరే సమయంలో భారీ వర్షం కురిసింది. శనివారం వినాయకచవితి కావడంతో పూలు, పత్రి వంటివి కొనుగోలు చేయడానికి అప్పటికే ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. అలాంటి సమయంలో వాన దంచికొట్టి.. రోడ్లపై మోకాటిలోతు నీరు నిలవడంతో ప్రజలు, వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. గచ్చిబౌలిలో అత్యధికంగా 4.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. రామచంద్రాపురంలో 3.9 సెం.మీ వర్షం కురిసింది.
రాష్ట్రవ్యాప్తంగా చూస్తే శుక్రవారం నారాయణపేట్ జిల్లా కొత్తపల్లి మండలంలో 8.9 సెంటీమీటర్లు, అదే జిల్లా మద్దూరులో 8 సెంటీమీటర్లు, వనపర్తి జిల్లా రేవెళ్లలో 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా.. జంటజలశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌కు భారీగా వరద వస్తోంది. హుస్సేన్ సాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 513.41 మీటర్లు కాగా.. ప్రస్తుతం 513.54 మీటర్ల మేర నీళ్లున్నాయి. అయితే, సాగర్ సర్‌ప్లస్ నాలాలో ప్రవాహం పెరిగిన దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని పరిసరప్రాంతాల ప్రజలకు అధికారులు సూచించారు.
ఇక.. 9, 10 తేదీల్లో (సోమ, మంగళవారాల్లో) రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి, ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. శని, ఆదివారాల్లోనూ చాలా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా.. ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు రహదారులు ధ్వంసమై రూ.100కోట్ల దాకా నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేశారు.
ఆ బ్రిడ్జిపై ఆర్నెల్లపాటు రాకపోకలు బంద్
ఖమ్మం క్రైం: వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలు, మున్నేరు వరదలకు ప్రకాశ్‌నగర్ బ్రిడ్జి ఆరు శ్లాబులు కదిలిన నేపథ్యంలో.. దానిపై రాకపోకలను ఆరునెలలపాటు నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. 2013లో నిర్మించిన ఈ బ్రిడ్జి శ్లాబులు.. భారీ వరదల దెబ్బకు 10 అంగుళాల మేర పక్కకు జరిగినట్టు నిపుణుల బృందం వెల్లడించడంతో మరమ్మతులు నిర్వహించే దాకా రాకపోకలను నిలిపివేయాలనే నిర్ణయం తీసుకున్నారు.
Updated Date - Sep 07 , 2024 | 04:13 AM