High Court: షాద్‌నగర్, ఇబ్రహీంపట్నంలలో అదనపు జిల్లా కోర్టుల ప్రారంభం
ABN, Publish Date - Nov 09 , 2024 | 05:04 AM
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్, ఇబ్రహీంపట్నంలలో ఏర్పాటు చేసిన అదనపు జిల్లా-సెషన్ జడ్జి కోర్టులను శుక్రవారం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ప్రారంభించారు.
వర్చువల్‌గా పాల్గొన్న హైకోర్టు సీజే అరాధే
షాద్‌నగర్ అర్బన్, ఇబ్రహీంపట్నం, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్, ఇబ్రహీంపట్నంలలో ఏర్పాటు చేసిన అదనపు జిల్లా-సెషన్ జడ్జి కోర్టులను శుక్రవారం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ప్రారంభించారు. హైకోర్టు నుంచి వర్చువల్‌గా జరిగిన కార్యక్రమంలో పాల్గొని వీటిని ప్రారంభించారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి.శ్యాం కోషీ, జస్టిస్ టి. వినోద్‌కుమార్, జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా షాద్‌నగర్ కోర్టు సముదాయం వద్ద పెద్ద టీవీ స్ర్కీన్ ఏర్పాటు చేశారు.
అదనపు జిల్లా-సెషన్ జడ్జి కోర్టు శిలాఫలకాన్ని రెండో ఏడీజే సి.రత్నపద్మావతి ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ అలోక్ అరాధే మాట్లాడుతూ అదనపు కోర్టుల ప్రారంభంతో సత్వర న్యాయం జరుగుతుందని చెప్పారు. ఇబ్రహీంపట్నంలో నూతనంగా ఏర్పాటయిన 15వ అదనపు జిల్లా- సెషన్స్ జడ్జి న్యాయస్థానాన్ని కూడా జస్టిస్ అరాధే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ప్రజలకు చేరువలో న్యాయస్థానాలు ఉండాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో వీటిని ప్రారంభించినట్టు చెప్పారు.
Updated Date - Nov 09 , 2024 | 05:04 AM