High Court: వారొద్దంటే సర్కారు నడపడం మానేస్తారా?
ABN, Publish Date - Sep 26 , 2024 | 04:17 AM
హైదరాబాద్ ఉప్పల్ మండల పరిధిలోని రామంతపూర్ పెద్దచెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్) హద్దులు గుర్తిస్తూ తుది నోటిఫికేషన్ ఇవ్వడంలో అధికారులు విఫలమవడంపై హైకోర్టు డివిజన్ బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వంతో పాటు హెచ్‌ఎండీఏ అధికారులపై హైకోర్టు ఆగ్రహం
రామంతపూర్ పెద్దచెరువు ఎఫ్‌టీఎల్‌పై స్థానికులు సహకరించట్లేదనడంపై అసహనం
హైదరాబాద్, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ ఉప్పల్ మండల పరిధిలోని రామంతపూర్ పెద్దచెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్) హద్దులు గుర్తిస్తూ తుది నోటిఫికేషన్ ఇవ్వడంలో అధికారులు విఫలమవడంపై హైకోర్టు డివిజన్ బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సర్వే చేయడానికి, హద్దులు గుర్తించడానికి ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలు చేపట్టిన వారు సహకరించట్లేదని.. లాబీయింగ్ చేస్తున్నారంటూ ప్రభుత్వం, హెచ్‌ఎండీఏ వివరణ ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేసింది. వారు వద్దంటే ప్రభుత్వాన్ని నడపడం మానేస్తారా? అని ప్రశ్నించింది. పెద్దచెరువు ప్రిలిమినరీ నోటిఫికేషన్‌పై వచ్చిన అభ్యంతరాలన్నీ 3 వారాల్లో పరిష్కరించి ఫైన ల్ నోటిఫికేషన్ ఇవ్వాలని.. 6 నెలల్లో ఫెన్సింగ్, బండ్ నిర్మాణం, సీసీ కెమెరాల ఏర్పాటు సహా అన్ని పనులు పూర్తిచేయాలని ప్రభుత్వం, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీలకు ఆదేశాలు జారీ చేసింది.
రామంతపూర్ పెద్దచెరువు ఆక్రమణలకు గురికావడంపై 2005లో ఉస్మానియా యూనివర్సిటీ హిందీ డిపార్ట్‌మెంట్ అప్పటి హెడ్ డాక్టర్ కేఎల్ వ్యాస్ హైకోర్టుకు లేఖ రాశారు. దీన్ని సుమోటోగా స్వీకరించిన కోర్టు.. అప్పట్నుంచి విచారణ కొనసాగిస్తోంది. గత ఏడాది ఈ చెరువుకు సంబంధించిన ఎఫ్‌టీఎల్ 30 ఎకరాలని పేర్కొంటూ అధికారులు ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీచేశారు. ఈ నోటిఫికేషన్ తప్పని.. అధికారులు అక్రమంగా చుట్టుపక్కల కాలనీలను ఎఫ్‌టీఎల్‌లో చూపించి వేధిస్తున్నారంటూ ఆయా కాలనీల్లో నిర్మాణా లు చేపట్టిన యజమానులు దాదాపు 280 మంది ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యారు. ఈ పిటిషన్‌పై తాజాగా చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఇంప్లీడ్ అయిన ప్రతివాదుల తరఫున న్యాయవాదులు వాదిస్తూ.. వరంగల్ హైవే పక్కన చెరువు ఉందని.. హైవే విస్తరణ, పూడిక కారణంగా చెరువు విస్తీర్ణం తగ్గిందని తెలిపారు. గతంలో 17ఎకరాలున్న ఎఫ్‌టీఎల్‌ను ఏ ఆధారం లేకుండా 30 ఎకరాలని ఓ ప్రైవేటు సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా అధికారులు పేర్కొనడం అన్యాయమన్నారు. ప్రభుత్వం తరఫున ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్, హెచ్‌ఎండీఏ న్యాయవాది కృష్ణారెడ్డి వాదిస్తూ.. ఎఫ్‌టీఎల్‌పై ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వలేదని.. గతంలో ఇచ్చింది కేవలం రిపోర్ట్ మాత్రమేనని చెప్పారు. ప్రతివాదులు సహకరించట్లేదని, హద్దులు గుర్తించకుండా అడ్డుకుంటున్నారన్నారు.
Updated Date - Sep 26 , 2024 | 04:17 AM