Hyderabad: పింఛను దానం కాదు.. హక్కు ..
ABN, Publish Date - May 12 , 2024 | 05:24 AM
తెలుగు అకాడమీలో పనిచేసి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు హైకోర్టు భారీ ఊరట కలిగించింది. వారికి పెన్షన్ బకాయిలతో పాటు, జాప్యం జరిగినందుకు వడ్డీ చెల్లించాలని ఆదేశించింది. ఈ ప్రక్రియను రెండు వారాల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. పింఛను అనేది రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చే దానమో, వరమో కాదని.. రాజ్యాంగబద్ధమైన హక్కు అని స్పష్టం చేసింది.
రిటైర్డ్ ఉద్యోగులకు పూర్తి పెన్షన్ ఇవ్వండి.. జాప్యం జరిగినందుకు 6ు వడ్డీ కూడా ఇవ్వాలి
2 వారాల్లో చెల్లింపులు పూర్తి చేయాలి
తెలుగు అకాడమీలకు హైకోర్టు ఆదేశాలు
సర్వీసు రికార్డులను ఇరు రాష్ర్టాలు మార్చుకోవాలని సూచన
హైదరాబాద్, మే 11 (ఆంధ్రజ్యోతి): తెలుగు అకాడమీలో పనిచేసి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు హైకోర్టు భారీ ఊరట కలిగించింది. వారికి పెన్షన్ బకాయిలతో పాటు, జాప్యం జరిగినందుకు వడ్డీ చెల్లించాలని ఆదేశించింది. ఈ ప్రక్రియను రెండు వారాల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. పింఛను అనేది రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చే దానమో, వరమో కాదని.. రాజ్యాంగబద్ధమైన హక్కు అని స్పష్టం చేసింది. ఫిర్యాదిదారైన బి.వరలక్ష్మి సహా మరో 14 మంది ఉమ్మడి రాష్ట్ర తెలుగు అకాడమీలో వివిధ పోస్టుల్లో ఉద్యోగాలు చేసి 2014 జూన్ 2 (అపాయింటెడ్ డే) తర్వాత రిటైర్ అయ్యారు. ఉమ్మడి తెలుగు అకాడమీ విభజన వివాదాలు పెండింగ్‌లో ఉండటం, నిధులు, ఉద్యోగుల పంపకాలు తేలకపోవడంతో పింఛన్లు సక్రమంగా చెల్లించలేదు. దాంతో వారు 2020లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న హైకోర్టు.. ఏపీ, తెలంగాణ రాష్ర్టాలు రెండు నెలల్లో పిటిషనర్‌లు సహా ఉద్యోగుల విభజనను పూర్తిచేయాలని ఆదేశాలు జారీచేసింది. ఆస్తులు - అప్పులను 58శాతం, 42 శాతం నిష్పత్తిలో రెండు రాష్ట్రాలు పంచుకోవాలని పేర్కొంది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని సుప్రీంకోర్టు చెప్పడంతో ఏపీ, తెలంగాణ ఉద్యోగుల విభజన, నిధులు, పెన్షన్ నిధుల విభజనపై ఒప్పందానికి వచ్చాయి. ఈ ఒప్పందం ప్రకారం పింఛర్లకు వారి స్థానికత ఆధారంగా ఆయా అకాడమీలు నేరుగా చెల్లింపులు చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత 2022 మే 1న తెలుగు అకాడమీని ఇరురాష్ర్టాల మఽధ్య విభజించి.. ప్రత్యేక తెలుగు అకాడమీలు ఏర్పాటు చేశారు. ఒప్పందం ప్రకారం తెలంగాణ 11 మందికి.. ఏపీ నలుగురికి పూర్తిస్థాయి పింఛను చెల్లించాల్సి ఉంది. దీనిపై తెలంగాణ తెలుగు అకాడమీ అభ్యంతరం తెలిపింది. విభజన చట్టం ప్రకారం పింఛనర్లు ఏ రాష్ర్టానికి కేటాయించినా.. 42 శాతం తెలంగాణ, మిగతా 58 ఏపీ చెల్లించాలని.. వారిని ఏ రాష్ర్టానికి కేటాయించారనేదాంతో సంబంధం లేదని పేర్కొంది. ఏపీ మాత్రం స్థానికత కలిగిన వారికి పూర్తిస్థాయు చెల్లింపులు చేస్తామని పేర్కొంది.
ఈ వివాదం నేపథ్యంలో తమకు పూర్తిస్థాయి పింఛను రావడం లేదని పేర్కొంటూ పిటిషనర్‌లు మళ్లీ 2023 డిసెంబర్‌లో హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ తుకారాంజీల ధర్మాసనం.. సుప్రీంకోర్టు ఎదుట ఇరు రాష్ర్టాలు అంగీకరించిన ఒప్పందం ప్రకారం.. రెండు రాష్ర్టాలు వారి వైపు నుంచి లాంఛనాలను పూర్తిచేయాలని స్పష్టం చేసింది. ఉద్యోగుల కేటాయింపులకు అనుగుణంగా 15 రోజుల్లోగా ఉద్యోగులు, పింఛనర్ల సర్వీసు రికార్డులు, రిజిస్టర్లను ఒకరికొకరు బదిలీ చేసుకోవాలని పేర్కొంది. పిటిషనర్‌ల పింఛన్లను మళ్లీ లెక్కగట్టి.. మిగిలిన బకాయిలను రెండువారాల్లో చెల్లించాలని తెలిపింది. ఆలస్యం చేసినందుకు ఆరు శాతం వడ్డీని అదనంగా చెల్లించాలని పేర్కొంది. ఇరు రాష్ట్రాల తెలుగు అకాడమీలు ఈ ఆదేశాలను అమలు చేసి జూన్ 24 లోపు హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)కు నివేదికను సమర్పించాలని తెలిపింది. నివేదికలను ఇచ్చిందీ లేనిదీ పరిశీలించడానికి కేసును జూన్ 27న మళ్లీ లిస్ట్ చేయాలని సూచించింది.
Updated Date - May 12 , 2024 | 05:24 AM