Musi River: మూసీ ఆక్రమణల కూల్చివేతలు.. ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారించాకే చర్యలు చేపట్టాలి
ABN, Publish Date - Oct 01 , 2024 | 03:32 AM
మూసీ ఆక్రమణల కూల్చివేతల విషయంలో ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారించిన తర్వాతే.. చర్యలు చేపట్టాలని సూచించింది.
ఎఫ్‌టీఎల్ బయట నిర్మాణాలకు.. నోటీసులు ఎలా ఇస్తారు: హైకోర్టు
ప్రత్యామ్నాయం చూపాకే ముందుకెళ్తాం
హైకోర్టుకు విన్నవించిన ప్రభుత్వం
హైదరాబాద్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): మూసీ ఆక్రమణల కూల్చివేతల విషయంలో ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారించిన తర్వాతే.. చర్యలు చేపట్టాలని సూచించింది. ‘‘ఎఫ్‌టీఎల్ బయట ఇళ్లు నిర్మించుకున్న వారికి నోటీసులు ఎలా జారీ చేస్తారు?’’ అని ప్రశ్నించింది. ఎలాంటి చర్యలు చేపట్టినా.. చట్టప్రకారం ముందుకెళ్లాలని హితవు పలికింది. మూసీ పరీవాహక ప్రాంతం వెంబడి ఉన్న ఇళ్లకు ‘రివర్ బెడ్’ అంటూ రెడ్ మార్కింగ్ చేశారని, తమ ఇళ్లను కూల్చివేస్తామని అధికారులు బెదిరిస్తున్నారని పేర్కొంటూ.. పలువురు బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. లంచ్‌మోషన్ పిటిషన్లపై జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.
ప్రభుత్వం తరఫు న్యాయవాది రెడ్ మార్కింగ్‌లపై ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఆక్రమణలను యుద్ధ ప్రాతిపదికన తొలగించడం లేదని పేర్కొన్నారు. ‘‘కూల్చివేతలపై కమిటీని ఏర్పాటు చేశాం. ఆ కమిటీ ఇళ్లను కోల్పోయే బాధితులతో చర్చలు జరుపుతోంది. ఇళ్లు కోల్పోయే పేదలకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసిన తర్వాతే.. చట్టపరంగా ముందుకు వెళ్తాం’’ అని సూచించింది. ఈ క్రమంలో కల్పించుకున్న ధర్మాసనం మూసీ పరీవాహకంలో ఆక్రమణల తొలగింపునకు ఏదైనా పాలసీ ఉందా? అని ప్రశ్నించింది. ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారించాకే చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేస్తూ.. తదుపరి విచారణను ఈనెల 16కు వాయిదా వేసింది.
Updated Date - Oct 01 , 2024 | 03:32 AM