Public Safety: చిన్నారులు చనిపోతుంటే నిర్లక్ష్యమా..?
ABN, Publish Date - Jul 11 , 2024 | 04:29 AM
వీధి కుక్కల దాడుల్లో ముక్కుపచ్చలారని చిన్నారులు చనిపోతుండడంపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
వీధి కుక్కల దాడులపై నిపుణుల కమిటీ వేయండి: హైకోర్టు
జూబ్లీహిల్స్‌పై కాదు.. మురికివాడలపై దృష్టిపెట్టాలని వ్యాఖ్య
హైదరాబాద్, జూలై 10 (ఆంధ్రజ్యోతి): వీధి కుక్కల దాడుల్లో ముక్కుపచ్చలారని చిన్నారులు చనిపోతుండడంపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు ఏం చర్యలు తీసుకోవాలన్న అంశంపై నిపుణుల కమిటీ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీకి ఆదేశాలు జారీచేసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటే రాష్ట్రమంతటా పరిష్కారం లభించినట్లేనా? అని ప్రశ్నించింది. సామాన్యుల ఆవాసాలు, మురికివాడలపైనా దృష్టి పెట్టాలని సూచించింది. ఈ అంశాన్ని ఓ పిటిషన్‌లా కాకుండా మానవీయకోణంలో చూడాల్సిన అవసరం ఉందని పేర్కొంది. గత ఏడాది ఫిబ్రవరి 19న అంబర్‌పేట్‌లో ప్రదీప్(4), తాజాగా జూన్ 28న పటాన్‌చెరులో బిహార్ వలస కూలీల కుటుంబానికి చెందిన విశాల్(6) వీధి కుక్కల దాడిలో చనిపోయిన ఘటనలపై వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.
అలాగే వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవడం లేదంటూ మరో ప్రజాప్రయోజన వ్యాజ్యంపై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. స్టెరిలైజేషన్ కార్యక్రమం కొనసాగిస్తున్నామని, కుక్కల నియంత్రణకు కొత్త మార్గదర్శకాలు రూపొందించామని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసేందుకు మరింత గడువు ఇవ్వాలని కోరగా.. ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పిల్లలు చనిపోతుంటే నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ఎట్టిపరిస్థితుల్లో సహించబోమని.. వారం రోజుల్లో నిపుణుల కమిటీ వేస్తారా? మమ్మల్ని వేయమంటారా? అని ప్రశ్నించింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.
Updated Date - Jul 11 , 2024 | 04:29 AM