Hyderabad : రోడ్లపై గుంతల గుర్తింపునకు యాప్!
ABN, Publish Date - Jul 22 , 2024 | 03:49 AM
రాష్ట్రంలోని రహదారులపై గుంతలను గుర్తించడంతోపాటు సాధ్యమైనంత త్వరగా మరమ్మతులు చేపట్టడంపై రోడ్లు, భవనాల శాఖ దృష్టి సారించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది.
ఫొటో తీసి అప్‌లోడ్ చేయగానే మరమ్మతులు.. తొలుత జీహెచ్‌ఎంసీలోనే అమలుకు యోచన
ఆ తర్వాత మునిసిపాలిటీల్లో
ఇప్పటికే ఒక యాప్‌ను తీసుకొచ్చిన కర్ణాటక సర్కార్
అధ్యయనానికి అధికారులను పంపనున్న ఆర్‌అండ్‌బీ
మరింత పకడ్బందీగా యాప్‌ను తీసుకొచ్చేందుకు కసరత్తు
హైదరాబాద్, జూలై 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని రహదారులపై గుంతలను గుర్తించడంతోపాటు సాధ్యమైనంత త్వరగా మరమ్మతులు చేపట్టడంపై రోడ్లు, భవనాల శాఖ దృష్టి సారించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఇందుకు సాంకేతిక అంశాలపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. రహదారులపై గుంతల గుర్తింపు, వాటి మరమ్మత్తులకు సంబంధించి ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం ఒక యాప్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది.
ఈ క్రమంలో ఆ యాప్ ఎలా పనిచేస్తుంది, అమలు విధానం ఎలా ఉంది? వంటి అంశాలపై అధ్యయనం చేసేందుకు శాఖ నుంచి అధికారుల బృందాన్ని ఆ రాష్ట్రానికి పంపాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిసింది. రోడ్లపై గుంతలతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, ఆ ప్రమాదాల్లో మరణిస్తున్నవారికి పరిహారం సరిగా అందడంలేదని, రహదారి భద్రతపై సుప్రీంకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని ఇటీవల హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. రోడ్లపై గుంతల సమస్య పరిష్కారానికి ఓ యాప్‌ను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ యాప్ విధానం ఇప్పటికే కర్ణాటకలో అమలవుతోందని వెల్లడించింది. ఈ క్రమంలోనే అప్రమత్తమైన రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ సమస్య పరిష్కారానికి యాప్‌ను తీసుకువచ్చే పనిలో నిమగ్నమైంది. ఇదే విషయాన్ని త్వరలోనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితోపాటు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిసింది.
ఫొటో తీసి అప్‌లోడ్ చేస్తే చాలు..
కర్ణాటక ప్రభుత్వం ఒక యాప్‌ను తీసుకొచ్చింది. గుంత ఉన్న ప్రదేశాన్ని ఫొటో తీసి అందులో అప్‌లోడ్ చేస్తే సంబంధిత శాఖ మరమ్మతుకు చర్యలు తీసుకుంటుంది. ఒక వేళ ఆ పనులు ఆలస్యమైతే.. కారణాలను పొందుపర్చేలా యాప్‌ను రూపొందించారు. ఈ క్రమంలో రాష్ట్రంలోనూ మరింత పకడ్బందీగా యాప్‌ను రూపొందించాలని ఆర్‌అండ్‌బీ అఽధికారులు నిర్ణయించారు.
గుంత ఉన్న ఫొటోను యాప్‌లో అప్‌లోడ్ చేయగానే గుంత ఉన్న ప్రాంతం, అది ఏ అధికారి పరిధిలోకి వస్తుంది, ఆ రహదారి పూర్తి వివరాలు వెంటనే డిస్‌ప్లే అయ్యేలా యాప్ ను రూపొందించనున్నారు. గూగుల్ మ్యాప్ ఆధారంగా యాప్‌ను తీర్చిదిద్దనున్నారు. పనులు పూర్తయ్యాక సదరు కాంట్రాక్టర్లు బిల్లుల కోసం తిరిగే పని లేకుండా.. యాప్‌లో వివరాలు పొందుపర్చగానే చెల్లించేందుకు వీలవుతుందా? లేదా? అని కసరత్తు చేస్తున్నారు.
తొలుత జీహెచ్‌ఎంసీలో..
యాప్‌ను తొలుత జీహెచ్‌ఎంసీ పరిఽధిలో అమలు చేయాలని అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. ఇక్కడ వచ్చే ఫలితాలను బట్టి రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, ఆర్ అండ్ బీ రోడ్ల పరిధిలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు సమాచారం. ప్రస్తు తం రాష్ట్రంలో రోడ్లు, భవనాల శాఖ పరిధిలో 28,278 కి.మీ. మేర రోడ్లు ఉన్నాయి. ఇవి కాక పంచాయతీ రాజ్ శాఖ పరిఽధిలోనూ ఉన్నాయి. ఈ యాప్‌ను రోడ్లు, భవనాల శాఖ పరిధిలోనే అమలు చేస్తారా? లేదా అన్ని రోడ్లను అందులో నమోదు చేసి.. శాఖల వారీగా విభజిస్తుందా? అన్నది తెలియాల్సి ఉంది.
Updated Date - Jul 22 , 2024 | 03:49 AM