Hyderabad: డెకాయ్ ఆపరేషన్లతో పోకిరీల భరతం..
ABN, Publish Date - Jun 08 , 2024 | 11:27 AM
రాచకొండ షీటీమ్స్(Rachakonda Sheteams) సిబ్బంది మహిళలను వేధిస్తున్న పోకిరీల భరతం పడుతున్నారు. గడిచిన 15 రోజుల్లో 76మందిని అదుపులోకి తీసుకున్న షీటీమ్స్ వారిపై కేసులు నమోదు చేశారు. వారిలో 20మంది మైనర్లు కూడా ఉండటం గమనార్హం.
- 15 రోజుల్లో 76 మందిని పట్టుకున్న షీటీమ్స్
- పలువురిపై క్రిమినల్ కేసులు నమోదు
హైదరాబాద్ సిటీ: రాచకొండ షీటీమ్స్(Rachakonda Sheteams) సిబ్బంది మహిళలను వేధిస్తున్న పోకిరీల భరతం పడుతున్నారు. గడిచిన 15 రోజుల్లో 76మందిని అదుపులోకి తీసుకున్న షీటీమ్స్ వారిపై కేసులు నమోదు చేశారు. వారిలో 20మంది మైనర్లు కూడా ఉండటం గమనార్హం. బహిరంగ ప్రదేశాల్లో ప్రేమపేరుతో యువతుల వెంటపడుతూ, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వారిని డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిని ఎల్బీనగర్‌లోని సీపీ క్యాంప్ కార్యాలయంలో తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించామని ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ టి ఉషా విశ్వనాథ్ తెలిపారు. మే 1 నుంచి 15 వరకు 101 ఫిర్యాదులు అందాయని వాటిపై విచారణ జరిపి 76మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిలో లైంగిక వేధింపులకు పాల్పడిన 11 మందిపై క్రిమినల్ కేసులు, 47మందిపై పెట్టీ కేసులు నమోదు చేశామని, మిగతా వారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించామని తెలిపారు.
ఇదికూడా చదవండి: Hyderabad: బాలకృష్ణను కలిసిన కూకట్‌పల్లి టీడీపీ నాయకులు
స్నానం చేస్తుండగా వీడియో తీసి, లైంగిక వేధింపులకు పాల్పడడంతోపాటు డబ్బు డిమాండ్ చేసిన యువకుడిపై, ప్రేమపేరుతో యువతిని మోసం చేసిన యువకుడిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపామన్నారు. అంతే కాకుండా మే 1 నుంచి 15 వరకు రాచకొండ షీటీమ్స్ ఆధ్వర్యంలో 30 ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, దాదాపు 4,425 మందికి మహిళా చట్టాలు, హక్కులు, నేరాల గురించి ఫిర్యాదు చేయడం వంటి అంశాలపై అవగాహన కల్పించామన్నారు.
నిర్భయంగా ఫిర్యాదు చేయండి
- సీపీ తరుణ్ జోషి
మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నాం. బాలికలను, మహిళలను వేధించే వారిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచి, విచారణ జరుపుతాం కాబట్టి, ఎవరైనా వేధింపులకు పాల్పడితే వెంటనే నిర్భయంగా ఫిర్యాదు చేయండి. బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్, మెట్రోస్టేషన్, స్కూల్, కాలేజీ, మార్కెట్ వంటి బహిరంగ ప్రదేశాల్లో షీటీమ్స్ మఫ్టీలో తిరుగుతూ డెకాయ్ ఆపరేషన్‌లు నిర్వహిస్తున్నాయి. స్వయంగా ఫిర్యాదు చేయడానికి రాలేని వారు ఆన్‌లైన్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - Jun 08 , 2024 | 11:27 AM