Hyderabad: రాంకీకి జీహెచ్‌ఎంసీ షోకాజ్ నోటీసు..
ABN, Publish Date - Oct 19 , 2024 | 09:36 AM
రోడ్ల పక్కన చెత్తకుప్పల తొలగింపులో రాంకీ నిర్లక్ష్యాన్ని జీహెచ్‌ఎంసీ(GHMC) తీవ్రంగా పరిగణిస్తోంది. పలు ప్రాంతాల్లో వ్యర్థాలను తొలగించకుండానే తొలగించినట్టు చూపినందుకు ఆ సంస్థకు తాజాగా బల్దియా షోకాజ్ నోటీసు జారీ చేసింది.
- చెత్తను తొలగించకుండానే తీసినట్టు పేర్కొన్నందుకు ఆగ్రహం
- మరోసారి నిర్లక్ష్యం వహిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరిక
- పలు ప్రాంతాల్లో తరచూ అదే పరిస్థితి
- పర్యవేక్షణ మెరుగుపర్చాలని నోటీసు
హైదరాబాద్ సిటీ: రోడ్ల పక్కన చెత్తకుప్పల తొలగింపులో రాంకీ నిర్లక్ష్యాన్ని జీహెచ్‌ఎంసీ(GHMC) తీవ్రంగా పరిగణిస్తోంది. పలు ప్రాంతాల్లో వ్యర్థాలను తొలగించకుండానే తొలగించినట్టు చూపినందుకు ఆ సంస్థకు తాజాగా బల్దియా షోకాజ్ నోటీసు జారీ చేసింది. క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరుపై సమగ్ర పర్యవేక్షణ ఉండాలని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే జరిమానా విధిస్తామని నోటీసులో పేర్కొన్నట్టు ఓ అధికారి తెలిపారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: బస్సు లైఫ్.. తగ్గుతోంది బాసూ
సమగ్ర వ్యర్థాల నిర్వహణలో భాగంగా గతంలో శాస్ర్తీయ నిల్వ, నిర్వహణకే పరిమితమైన రాంకీకి నగరంలో వెలువడుతున్న వ్యర్థాలు, రోడ్లపక్కన చెత్తకుప్పల తొలగింపు బాధ్యతలను కూడా జీహెచ్‌ఎంసీ కొన్నాళ్ల క్రితం అప్పగించింది. చెత్త తరలింపు, తొలగింపు, శాస్ర్తీయ నిల్వ, నిర్వహణకుగాను ఆ సంస్థకు మెట్రిక్ టన్నుకు రూ.2064.73 చొప్పున టిప్పింగ్ ఫీజుగా జీహెచ్‌ఎంసీ చెల్లిస్తోంది. నిత్యం సుమారు 7,300 టన్నుల చెత్త వెలువడుతుండగా నెలకు రూ.35 కోట్ల నుంచి రూ.40 కోట్ల లెక్కన ఏటా రూ.400 కోట్ల నుంచి రూ.450 కోట్లు వ్యయం అవుతోంది.
సెకన్ల వ్యవధిలో..
అధికారిక లెక్కల ప్రకారం గ్రేటర్‌లో రోడ్ల పక్కన చెత్త కుప్పలున్న ప్రాంతాలు 1506 ఉన్నాయి. అనధికారికంగా ఈ సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ప్రధాన, అంతర్గత రహదారుల పక్కన ఉండే చెత్తకుప్పలను రాంకీ తొలగిస్తోంది. ఇందుకోసం వాహనాలు, సిబ్బందిని ఆ సంస్థ సమకూర్చుకుంది. ఒప్పందం ప్రకారం నిత్యం మూడు పర్యాయాలు చెత్తను తొలగించాలి. మెజారిటీ ఏరియాల్లో ఆ పరిస్థితి లేదు. ఉదయం, సాయంత్రం చెత్త తొలగింపు జరుగుతోందని అధికారులు చెబుతున్నా, అది కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతోంది.
వాహనాలకు జీపీఎస్ ఏర్పాటుచేసి ఎక్కడెక్కడ చెత్త తొలగిస్తున్నారన్నది పర్యవేక్షిస్తున్నామని చెబుతున్నారు. చెత్త ఎత్తే ముందు, తర్వాత ఫొటోలను అప్‌లోడ్ చేసేందుకు ప్రత్యేక మొబైల్‌యాప్ అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే, పలు ప్రాంతాల్లో చెత్తకుప్పలు ఎత్తక ముందు ఫొటోలు అప్‌లోడ్ చేస్తున్న సిబ్బంది.. ఎత్తిన ఫొటోలను కూడా సెకన్ల వ్యవధిలో అప్‌లోడ్ చేస్తున్నట్టు గుర్తించారు.
చెత్త ఎత్తకుండానే, రోడ్డుకు మరోవైపు ఖాళీగా ఉన్న ఫొటోలను అప్‌లోడ్ చేస్తున్నట్టు అధికారులు నిర్ధారణకు వచ్చారు. నిత్యం పలు ప్రాంతాల్లో ఇలానే జరుగుతుండడాన్ని అధికారులు తీవ్రంగా పరిగణించారు. ఈ క్రమంలోనే నోటీసులు జారీ చేసి వివరణ కోరారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ మెరుగుపర్చాలని, మూడుపూటలా చెత్త తొలగింపునకు చర్యలు తీసుకోవాలని, అవసరం మేరకు అదనంగా వాహనాలు, సిబ్బందిని సమకూర్చుకోవాలని ఆ సంస్థకు సూచించినట్టు అధికారులు పేర్కొన్నారు.
జరిమానా విధింపులో ఉదాసీనత..
ఒప్పందం ప్రకారం చెత్త తొలగింపు, తరలింపు, శాస్ర్తీయ నిల్వ, నిర్వహణ చేయనందుకు రాంకీకి జరిమానా విధించాలి. ఈ విషయంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం జవహర్‌నగర్ డంపింగ్ యార్డులో లక్షల టన్నుల వ్యర్థాల కుప్పలు ఉన్నాయి. రోజురోజుకు చెత్త పెరుగుతుండడం నిర్వహణకు ఆ స్థాయిలో ఏర్పాట్లు చేయకపోవడంతో చెత్త పేరుకుపోతోంది. దీంతో తడి చెత్త నుంచి వర్షాకాలంలో దుర్వాసన వస్తున్నదని పరిసర ప్రాంతాల ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. లీచెట్ శుద్ధి విషయంలోనూ రాంకీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
క్యాపింగ్ చేసినా పాత చెత్త కుప్ప నుంచి హానికర ద్రవ వ్యర్థాలు వెలువడి సమీపంలోని చెరువులో ఇటీవల చేపలు మృతి చెందాయి. ఆగ్రహించిన మత్స్యకారులు.. లీచెట్ చెరువులోకి రాకుండా అడ్డుకట్ట వేశారు. దీంతో డంపింగ్ యార్డు ముందు భారీగా నీరు నిలిచి రోడ్డు మీదుగా దిగువకు వెళ్తోంది. ఈ క్రమంలో రహదారిపై భారీగా గుంతలు ఏర్పడి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇటీవల ఇక్కడ జరిగిన ప్రమాదంలో మాజీ ఎంపీటీసీ ఒకరు దుర్మరణం చెందారు. ఈ స్థాయిలో ఉల్లంఘనలున్నా.. నోటీసుల జారీకే జీహెచ్‌ఎంసీ పరిమితమవుతోంది. ఇదిలాఉండగా పారిశుధ్య నిర్వహణకు సంబంధించి కేవలం ఇంటింటి చెత్త సేకరణ మాత్రమే బల్దియా పరిధిలో ఉండడం గమనార్హం.
ఇదికూడా చదవండి: Cyberabad police: ఆర్‌జే శేఖర్ బాషా అరెస్టు..
ఇదికూడా చదవండి: High Court: ఫోన్ ట్యాపింగ్ నిందితుడు రాధాకిషన్‌రావు
ఇదికూడా చదవండి: Bhupalpally: సింగరేణి ఓసీపీలతో దినదిన గండం!
ఇదికూడా చదవండి: Tummala: సోనియా పుట్టిన రోజు నాటికి రుణమాఫీ పూర్తి
Read Latest Telangana News and National News
Updated Date - Oct 19 , 2024 | 09:36 AM