ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: హైడ్రాకు హైపవర్‌!

ABN, Publish Date - Sep 21 , 2024 | 02:59 AM

హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌, అసెట్‌ మానిటరింగ్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా)కి రాష్ట్ర ప్రభుత్వం విశేషాధికారాలు కల్పించింది.

విశేషాధికారాలు కల్పిస్తూ క్యాబినెట్‌ నిర్ణయం.. నేడో, రేపో ఆర్డినెన్స్‌!

  • వాల్టా, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ చట్టాల అధికారాలు

  • 169 మంది అధికారులు, 946 మంది సిబ్బంది

  • ఓఆర్‌ఆర్‌ లోపలి కోర్‌ ఏరియా అంతా హైడ్రా పరిధిలోకి

  • ప్రభుత్వ స్థలాలు, చెరువుల పరిరక్షణ బాధ్యత దానిదే

  • ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ అంచనా వ్యయం 4,637 కోట్లకు

  • ట్రిపుల్‌ఆర్‌ దక్షిణ భాగం అలైన్‌మెంట్‌ ఖరారుకు కమిటీ

  • తెలుగు వర్సిటీకి సురవరం, మహిళా వర్సిటీకి ఐలమ్మ,

  • హ్యాండ్లూమ్‌ సంస్థకు కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరు

  • 8 కొత్త మెడికల్‌ కాలేజీలకు 3వేల పోస్టుల మంజూరు

  • ఈ ఖరీఫ్‌ సీజన్‌ నుంచే సన్నాలకు రూ.500 బోనస్‌

  • క్యాబినెట్‌ నిర్ణయాలు.. 3 గంటలపాటు సమావేశం

హైదరాబాద్‌, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌, అసెట్‌ మానిటరింగ్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా)కి రాష్ట్ర ప్రభుత్వం విశేషాధికారాలు కల్పించింది. ఇందుకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో ఆర్డినెన్స్‌ జారీ చేయాలని తీర్మానించింది. ఔటర్‌ రింగు రోడ్డు లోపల ఉన్న కోర్‌ ఏరియా మొత్తాన్ని హైడ్రా పరిధిలోకి తెచ్చింది. ఈ ఏరియాలోని 27 మునిసిపాలిటీలు, 51 గ్రామ పంచాయతీలపై వివిధ శాఖలు, విభాగాలకు ఉన్న అధికారాలు, హక్కులు, స్వేచ్ఛను హైడ్రాకు కల్పిస్తూ రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరిగింది. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన సమావేశం దాదాపు మూడు గంటలపాటు కొనసాగింది. ఈ సమావేశంలో హైడ్రాకు అధికారాలు కల్పించడంతోపాటు అదనంగా అధికారులు, సిబ్బందిని డిప్యుటేషన్‌పై ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది.


దీంతోపాటు హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీగా మార్చాలని నిర్ణయించారు. కోఠిలోని మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరును, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌కు కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరును పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. వీటితోపాటు రాష్ట్రంలో కొత్తగా అనుమతి పొందిన 8 మెడికల్‌ కాలేజీలకు 3వేల పైచిలుకు బోధన, బోధనేతర పోస్టులను మంజూరు చేయాలని, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ నిర్మాణ అంచనా వ్యయాన్ని రూ.4,637 కోట్లకు పెంచాలని, సన్న వడ్లకు రూ.500 బోన్‌సను ఈ ఖరీఫ్‌ సీజన్‌ నుంచే ఇవ్వాలని, తెల్ల రేషన్‌కార్డులను అక్టోబరు నుంచి జారీ చేయాలని నిర్ణయించారు. క్యాబినెట్‌ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీడియాకు వివరించారు.


  • అన్ని శాఖల అధికారాలు హైడ్రాకు..!

మంత్రులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హైడ్రాను మరింత బలోపేతం చేయాలని క్యాబినెట్‌ తీర్మానించింది. వాల్టా చట్టం అధికారాలను అప్పగించడంతోపాటు హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, మెట్రో వాటర్‌ బోర్డుకు ఇప్పుడున్న అధికారాలను హైడ్రా కమిషనర్‌కూ అప్పగించాలని నిర్ణయించారు. ఔటర్‌ రింగు రోడ్డు (ఓఆర్‌ఆర్‌) లోపల ఉన్న కోర్‌ ఏరియాలోని ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు, నాలాల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లను పరిరక్షించే బాధ్యత ఇకమీదట హైడ్రాపై ఉంటుంది. అంటే.. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, వివిధ శాఖలకు ఉండే అఽధికారాలన్నీ హైడ్రాకు ఉంటాయి. ఓఆర్‌ఆర్‌ లోపలి కోర్‌ అర్బన్‌ రీజియన్‌లో జీహెచ్‌ఎంసీతోపాటు స్థానిక సంస్థలు, గ్రామపంచాయతీల్లోనూ హైడ్రా కమిషనర్‌కు అధికారాలు కల్పించేలా చట్ట సవరణ చేయాలని క్యాబినెట్‌ నిర్ణయించింది.


కోర్‌ అర్బన్‌ సిటీలోని చెరువులు, కుంటలు ఆక్రమణకు గురికాకుండా సీసీ కెమెరాలతో నిఘా పెట్టి ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేయాలని నిర్ణయించారు. ఇక హైడ్రాకు 169 మంది అధికారులు, 946 మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను వివిధ శాఖల నుంచి డిప్యుటేషన్‌పై పంపాలని తీర్మానించారు. దీంతోపాటు శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌ తవ్వకానికి అంచనా వ్యయాన్ని రూ.4,637 కోట్లకు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సవరణ అంచనాలకు ఆమోదం తెలిపింది. టన్నెల్‌ ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు 826 అడుగుల డెడ్‌ స్టోరేజీ నుంచి ప్రతి రోజూ 4వేల క్యూసెక్కులు, సంవత్సరానికి 30 టీఎంసీల నీరు ఎస్‌ఎల్‌బీసీకి వస్తుంది. ఇక డిండి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు, ఫారెస్ట్‌ క్లియరెన్స్‌లను త్వరితగతిన పొందాలని, ఈ పనుల కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని నిర్ణయించారు.


మంత్రివర్గం తీసుకున్న ఇతర నిర్ణయాలు..

  • కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరు పెట్టనున్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌లో ఈసారి తరగతులను తెలుగు యూనివర్సిటీలోని తాత్కాలిక భవనంలో ప్రారంభించాలని నిర్ణయం. ఒక్కో విద్యార్థికి ప్రతి నెలా రూ.2,500 చొప్పున స్కాలర్‌షిప్‌ మంజూరు.

  • రీజినల్‌ రింగు రోడ్డు (ట్రిపుల్‌ ఆర్‌) దక్షిణ భాగం అలైన్‌మెంట్‌ను ఖరారు చేసేందుకు ఆర్‌అండ్‌బీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో 12 మందితో అధికారుల కమిటీ ఏర్పాటుకు నిర్ణయం. ఈ కమిటీకి కన్వీనర్‌గా ఆర్‌అండ్‌బీ శాఖ ముఖ్యకార్యదర్శి ఉంటారు. పురపాలక, రెవెన్యూ శాఖల కార్యదర్శులతోపాటు ట్రిపుల్‌ ఆర్‌ పరిధిలోకి వచ్చే ఐదారు జిల్లాల కలెక్టర్లు, ఆర్‌అండ్‌బీ శాఖ, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ, జియలాజికల్‌ విభాగం అధికారులు కమిటీలో ఉంటారు.

  • ప్రస్తుతం అమల్లో ఉన్న పోలీసు ఆరోగ్య భద్రత స్కీమ్‌ను స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(ఎ్‌సపీఎ్‌ఫ)కు కూడా వర్తింపజేయాలని నిర్ణయం.

  • తెలంగాణ ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో మనోహరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్కుకు రెవెన్యూ శాఖ నుంచి 72 ఎకరాల భూమిని బదిలీ చేయాలని నిర్ణయం.

  • ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటుకు 58 ఎకరాల భూమిని రెవెన్యూశాఖ నుంచి బదిలీ చేయాలని నిర్ణయం.

  • ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఏర్పాటు చేసిన ఫైర్‌ స్టేషన్‌కు 34మంది సిబ్బంది.

  • రాష్ట్రంలో కొత్తగా అనుమతి పొందిన 8 మెడికల్‌ కాలేజీలకు 3వేల పైచిలుకు బోధన, బోధనేతర పోస్టుల మంజూరు. భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్‌.

  • కోస్గి ఇంజనీరింగ్‌ కాలేజీకి, హకీంపేటలోని జూనియర్‌ కాలేజీకి అవసరమైన పోస్టుల మంజూరు.

  • ఈ ఖరీఫ్‌ సీజన్‌ నుంచే సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్‌. ఇందుకోసం రూ.2,500 కోట్ల కేటాయింపు. ఈ ఖరీ్‌ఫలో 1.43 కోట్ల మెట్రిక్‌ టన్నుల పంట వస్తుందని, ఇందులో 80 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు సన్నాలుంటాయని అంచనా.

  • అక్టోబరు నుంచి తెల్ల రేషన్‌ కార్డులను జారీ చేసి, దొడ్డు బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయం. జనవరి నుంచి అన్ని రేషన్‌ కార్డులకూ సన్నబియ్యం.


హైడ్రాకు బదలాయించే అధికారాలివే

జీహెచ్‌ఎంసీ చట్టం 1955 ద్వారా ఆక్రమణలను పరిశీలించడం, నోటీసులు ఇవ్వడం, అక్రమ కట్టడాలను కూల్చివేయడం, అనుమతి లేని ప్రకటనలకు జరిమానాలు విధించడంపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కలిగి ఉన్న అధికారాలు.. ఈ అంశాల మీదనే తెలంగాణ పురపాలక చట్టం 2019 ప్రకారం ఆయా కార్పొరేషన్‌, మునిసిపాలిటీల కమిషనర్లకు ఉన్న అధికారాలను హైడ్రాకు బదలాయించారు. ఈ చట్టం ద్వారా హైడ్రా కమిషనర్‌కు సెక్షన్‌ 72 ప్రకారం మున్సిపాలిటీల మీద సూపర్‌వైజ్‌ చేసేందుకు అధికారిని నియమించే అధికారం

  • సెక్షన్‌ 99 ప్రకారం హైడ్రా కమిషనర్‌, లేదా హైడ్రా ప్రతినిధికి సమాచారం తెలుసుకునే అధికారం, ప్రాంగణంలోకి ప్రవేశించే అధికారం

  • సెక్షన్‌ 178(1), (2) ప్రకారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారాలు, సెక్షన్‌ 186 ప్రకారం జలవనరుల సంరక్షణ, గ్రీనరీ స్థలాలు, వారసత్వ కట్టడాల సంరక్షణ అధికారాలు బదలాయించారు.

  • హైదరాబాద్‌ మెట్రో వాటర్‌బోర్డు చట్టం 1989లోని సెక్షన్‌ 81 ప్రకారం ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ చెరువుల సంరక్షణ అధికారాలు, తెలంగాణ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ పరిధిలో చెరువుల సంరక్షణ కమిటీ ఏర్పాటుపై విశేష అధికారాలను కల్పించారు. ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ సంరక్షణకు హైడ్రా కమిషనర్‌ చైర్మన్‌గా, కమిషన్‌ హెచ్‌ఎండీఏ కోచైర్మన్‌గా జీవోఎమ్మెస్‌ 129 జారీ చేశారు.

  • హెచ్‌ఎండీఏ చట్టం 2008లోని 8, 23ఏ సెక్షన్ల కింద హెచ్‌ఎండీఏ కమిషనర్‌కు ఉన్న అధికారాలు

  • తెలంగాణ భూ ఆదాయ చట్టంలోని 1317 ఎఫ్‌ ప్రకారం ఆక్రమణల తొలగింపు, ఆస్తుల సంరక్షణకు సంబంధించి కలెక్టర్‌, ఆర్డీవోలకు ఉన్న అధికారాలు

  • తెలంగాణ జలవనరుల శాఖ చట్టం 1357ఎఫ్‌ ప్రకారం కలెక్టర్‌, నీటిపారుదల శాఖ అధికారికి ఉన్న అధికారాలు

  • జీవోఎంఎస్‌ 67 ద్వారా 2002లో పట్టణాభివృద్ధి సంస్థలకు, ఎగ్జిక్యూటివ్‌ అధికారికి కల్పించిన అధికారాలు కల్పించారు.

  • తెలంగాణ భూ ఆక్రమణ చట్టం 1905లో సెక్షన్లు 3, 6, 7, 7ఏ కింద జిల్లా కలెక్టర్‌, తహసీల్దారు, నాయబ్‌ తహసీల్దారుకు ఉన్న అధికారాలను ఇచ్చారు.

  • వాల్టా చట్టం 2002, జీవో 168 ద్వారా తెలంగాణ బిల్డింగ్‌ నిబంధనలు, తెలంగాణ ఫైర్‌ సర్వీస్‌ చట్టం 1999లో ఉన్న అధికారాలు అప్పగించారు.


నియోజకవర్గాల్లో పనులకు బిల్లులు వెంటనే ఇవ్వండి’

నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లులు సకాలంలో మంజూరు కాకపోవడం పట్ల పలువురు మంత్రులు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. క్యాబినెట్‌ భేటీలో ఎజెండా అంశాలపై చర్చ ముగిసిన తర్వాత.. సీఎం, మంత్రులు కొద్దిసేపు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా చిన్న చిన్న పనులకూ బిల్లుల కోసం తాము జోక్యం చేసుకోవాల్సి వస్తోందని కొందరు మంత్రులు సీఎం రేవంత్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో త్వరితగతిన బిల్లుల క్లియరెన్స్‌కు చర్యలు తీసుకుంటానని సీఎం వారికి చెప్పినట్లు సమాచాం. కాగా, అక్టోబరు మొదటి వారంలో మరోమారు మంత్రివర్గం సమావేశమయ్యే అవకాశం ఉంది. ఆ సమావేశంలో ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపైనే చర్చించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.


‘కాళేశ్వరానికి’ లక్ష కోట్లు పెట్టి లక్ష ఎకరాలకూ నీరివ్వలేదు

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై రూ.లక్ష కోట్లు ఖర్చు చేసినా.. లక్ష ఎకరాలకు కూడా నీరివ్వలేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. తమ ప్రభుత్వం ఎస్‌ఎల్‌బీసీకి సవరించిన అంచనాల ప్రకారం... రూ.4,637 కోట్లను కేటాయించి, 4 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించబోతోందని చెప్పారు. కాళేశ్వరం లిఫ్టులకు చేసే వ్యయం మాదిరిగా.. ఎస్‌ఎల్‌బీసీకి పదే పదే ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, పూర్తి గ్రావిటీతో నీటిని అందించవచ్చని తెలిపారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎస్‌ఎల్‌బీసీపై అప్పటి సీఎం కేసీఆర్‌ చాలా వ్యంగ్యంగా మాట్లాడారని అన్నారు. కానీ, తాము 24 నెలల్లోనే దీనిని పూర్తిచేయబోతున్నామని చెప్పారు. ఫ్లోరైడ్‌ ప్రభావిత నల్లగొండ జిల్లాలో మిషన్‌ భగీరథ కింద నీరివ్వడానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.6 వేల కోట్లు వ్యయం చేస్తే.. అందులో రూ.4 వేల కోట్ల స్కామ్‌ జరిగిందని ఆరోపించారు. ఫ్లోరైడ్‌ను మాయం చేశానని కేసీఆర్‌ చెప్పుకొన్నారే తప్ప.. ఇప్పుడు ఇంకా పెరిగిందని తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ పూర్తయితే.. భూగర్భ జలాలు పెరిగి, ఫ్లోరైడ్‌ దూరమవుతుందన్నారు.

Updated Date - Sep 21 , 2024 | 02:59 AM