Hyderabad: నిరుద్యోగులకు ‘లైట్‌హౌస్’ వెలుగులు
ABN, Publish Date - Oct 22 , 2024 | 11:12 AM
నిరుద్యోగ యువత జీవితాల్లో వెలుగులు నింపుతోంది ఓ స్వచ్ఛంద సంస్థ. ఇంటర్, డిగ్రీ(Inter, Degree), వివిధ కోర్సులు పూర్తిచేసి పలు కారణాలతో పైచదువులు చదవలేక.. ఉద్యోగాలు రాక నిరుత్సాహానికి గురవుతున్న యువతకు లైట్‌హౌస్ కమ్యూనిటీ సర్వీస్ ఫౌండేషన్ సంస్థ అండగా నిలుస్తోంది.
- యువతకు అండగా నిలుస్తోన్న స్వచ్ఛంద సంస్థ
- నైపుణ్య శిక్షణ, ఉద్యోగ కల్పనకు చొరవ
- పుణేలో ప్రారంభం.. నాలుగు రాష్ట్రాల్లో సేవలు
హైదరాబాద్: నిరుద్యోగ యువత జీవితాల్లో వెలుగులు నింపుతోంది ఓ స్వచ్ఛంద సంస్థ. ఇంటర్, డిగ్రీ(Inter, Degree), వివిధ కోర్సులు పూర్తిచేసి పలు కారణాలతో పైచదువులు చదవలేక.. ఉద్యోగాలు రాక నిరుత్సాహానికి గురవుతున్న యువతకు లైట్‌హౌస్ కమ్యూనిటీ సర్వీస్ ఫౌండేషన్ సంస్థ అండగా నిలుస్తోంది. 2005లో మహారాష్ట్రలోని పుణేలో గణేష్ నటరాజన్(Ganesh Natarajan), రుషి కలిసి ఈ సంస్థను ఏర్పాటు చేశారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: డేంజర్ టర్నింగ్స్.. మూలమలుపుల్లో వాహనాలు వెళ్లాలంటే నరకమే
నిరుద్యోగ యువత తమకు ఇష్టమైన రంగాల్లో రాణించేందుకు అవసరమైన శిక్షణ ఇవ్వడంతో పాటు ఉద్యోగ అవకాశాలను సైతం చూపి స్తున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల మురికివాడల్లో ఉన్న నిరుద్యోగ యువతను గుర్తించి.. వారు చెడు అలవాట్ల బారిన పడకుండా వారి జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా సంస్థ పనిచేస్తోంది. మహారాష్ట్రలోని 24 పట్టణాలతో పాటు ఒడిశా, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రా ల్లోనూ ఈ సంస్థ నిర్విరామంగా కృషిచేసి సుమారు 25 వేల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించింది.
చందానగర్‌లో శిక్షణ కేంద్రం
తెలంగాణలో మొదటి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని హైదరాబాద్‌లోని చందానగర్ హుడాకాలనీ జీహెచ్‌ఎంసీ(GHMC) నిర్మించిన సూపర్ మార్కెట్‌లో 2022లో ఏర్పాటు చేశారు. పలు రకాల ఐటీ కోర్సులతో పాటు ఇంటర్‌నెట్, బిజినెస్, డిజిటల్ మార్కెటింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, అకౌంట్స్ సహా సుమారు 50 రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా శిక్షణ పొందగా.. 464 మందికి వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు లభించాయి.
అదే సంస్థలో ఉద్యోగం
ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సమయంలో ఫీజు చెల్లించలేక చదువు మానేశా. పాపిరెడ్డి కాలనీలో సంస్థ ప్రతినిఽధులు సర్వే చేస్తున్న సమయంలో నన్ను గుర్తించి ఆరు నెలలపాటు శిక్షణ ఇచ్చారు. రూ.15వేల వేతనంతో అదే సంస్థల్లో ప్లేస్‌మెంట్ కోఆర్డినేటర్‌గా అవకాశం లభించింది. దీంతో కుటుంబ సభ్యులకు అండగా ఉంటూనే నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. -ముజీబ్, పాపిరెడ్డికాలనీ
కూలి పనులకు వెళ్లాలనుకున్నా
బీకాం కంప్యూటర్స్ పూర్తి చేసిన నాకు ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకలేదు. కూలి పనులకు వెళ్లాలనుకుంటున్న సమయంలో ఫౌండేషన్ ప్రతినిధులు మా ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో మాట్లాడి శిక్షణ ఇచ్చారు. డిజిటల్ కంప్యూటర్స్ కోర్సు పూర్తి చేయగా ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగం లభించింది.
- శిరీష
డిజైనర్‌గా..
డిప్లొమా చదివే సమయంలో ఆర్థిక ఇబ్బందులతో అమీన్‌పూర్‌కు వలస వచ్చాం. లైట్‌హౌస్ కమ్యూనిటీ సర్వీస్ ఫౌండేషన్ గురించి తెలుసుకుని శిక్షణ తీసుకున్నా. ప్రస్తుతం ఓ ఛానెల్‌లో డిజైనర్‌గా పనిచేస్తున్నా.
- మధు, సదాశివపేట
సమాజ సేవ కోసమే ఉద్యోగానికి రాజీనామా
చిన్ననాటి నుంచే సమాజానికి సేవ చేయాలనే తపన ఉండేది. జీహెచ్‌ఎంసీ యూసీడీ విభాగంలో పనిచేస్తున్న సమయంలో ‘రాజీవ్ యువకిరణాలు’ కార్యక్రమంతో సమాజంపై అవగాహన పెరిగింది. విద్యతోనే మార్పు సాధ్యమని, నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి వైపు మళ్లించాలనే ఆలోచనతో ఉద్యోగానికి రాజీనామా చేశా. ప్రస్తుతం చందానగర్ లైట్‌హౌస్ ఫౌండేషన్ కేంద్రం మేనేజర్‌గా పనిచేస్తున్నా. వేతనం తక్కువే అయినా సంతృప్తిగా ఉంది.
- ఆకుల శ్రీనివాస్
Updated Date - Oct 22 , 2024 | 11:12 AM