Hyderabad: ‘కమలం’లో టికెట్ల లొల్లి.. అభ్యర్థుల ఎంపికపై అసంతృప్తి
ABN, Publish Date - Mar 05 , 2024 | 11:35 AM
మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థి ఎంపికలో బీజేపీ(BJP) అధిష్ఠానం అవలంభించిన తీరుపై మురళీధర్‌రావు అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ సిటీ: మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థి ఎంపికలో బీజేపీ(BJP) అధిష్ఠానం అవలంభించిన తీరుపై మురళీధర్‌రావు అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈటలకు టికెట్ కేటాయించినట్లు ప్రకటన వెలువడిన తర్వాత శనివారం రాత్రి మురళీధర్‌రావు ఓ ట్వీట్ చేయడంతో కలకలం రేగింది. ‘మల్కాజిగిరిలో నా కోసం పనిచేసిన వారికి ధన్యవాదాలు.. త్వరలోనే అనుచరులు, కార్యకర్తలను వ్యక్తిగతంగా కలుస్తా, ఆపై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తా’ అని ఆయన ట్వీట్ చేశారు. మల్కాజిగిరి టికెట్ కోసం బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్‌చార్జి మురళీధర్‌రావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ ఎం.కొమురయ్య, సీనియర్ నాయకులు చాడ సురేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, తూళ్ల వీరేందర్‌గౌడ్, మల్లారెడ్డి, పన్నాల హరీష్ రెడ్డి, సామ రంగారెడ్డి ప్రయత్నాలు చేశారు. గత లోక్‌సభ ఎన్నికలో ఇక్కడి నుంచి మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు పోటీ చేశారు. ఈ సారి పోటీకి ఆయన ఆసక్తి చూపలేదు. మల్కాజిగిరి టికెట్ తనకే ఇస్తానని అధిష్టానం హామీ ఇవ్వడంతో మురళీధర్‌రావు నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేపడుతూ ప్రచారం చేసుకుంటున్నారు. ఓటర్ల ఎన్‌రోల్‌మెంట్ కోసం ప్రత్యేకంగా కార్యాలయం ఏర్పాటుచేశారు. చాయ్‌పే చర్చ కార్యక్రమాలతో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించారు. డిజిటల్ హిందూ కార్యక్రమాలను నిర్వహించారు. ఫిర్ ఏక్ బార్ మోదీ పేరుతో కార్నర్ మీటింగ్‌లు నిర్వహించారు. టికెట్ ఖరారు చేసే రోజు కూడా మూసాపేటలో అభిమానులు, అనుచరులతో సమావేశం నిర్వహించారు. పార్టీ సిద్దాంతాల కోసం పనిచేస్తున్న వారికి టికెట్ ఇవ్వడం లేదంటూ సోషల్ మీడియాలో కార్యకర్తలు, అనుచరులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ నాయకులు ఎన్నికల్లో అభ్యర్థికి సహకరించకూడదని నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు వారు ఇటీవల ఓ సమావేశం నిర్వహించినట్టు తెలిసింది.
హైదరాబాద్‌లో..
హైదరాబాద్ లోక్‌సభ స్థానాన్ని విరించి ఆస్పత్రి చైర్మన్, లతా మా ఫౌండేషన్ చైర్‌పర్సన్ మాధవీలతకు కేటాయించడంతో కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నాయకులను కాదని, ఇతరులకు టికెట్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థానం నుంచి గతంలో రెండుసార్లు పోటీ చేసిన భగవంత్‌రావు, మాజీ డిప్యూటీ మేయర్ సుభా్‌షచందర్‌జీ, పొన్న వెంకటరమణ, రూప్‌రాజ్ టికెట్ ఆశించారు. ఈసారి టికెట్ భగవంత్‌రావు, సుభాష్ చందర్‌జీలో ఎవరికో ఒకరికి ఇస్తారని ఊహించారు. చివరకు మాధవీలతకు కేటాయించారు. మాధవీలత ఎంపికపై ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. రాజాసింగ్ హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు.
Updated Date - Mar 05 , 2024 | 12:11 PM