Meteorological Center: 5 రోజులు భారీ వర్షాలు..
ABN, Publish Date - May 19 , 2024 | 03:35 AM
రాష్ట్రంలో వచ్చే ఐదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈనెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని.. ఇది బలపడి 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం దక్షిణ ఛత్తీ్‌సగఢ్ నుంచి కొమరిన్ ప్రాంతం వరకు కొనసాగిన ఉపరితల ఆవర్తనం.. శనివారం దక్షిణ ఛత్తీ్‌సగఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని తెలిపింది.
22న అల్పపీడనం
హైదరాబాద్, పలు జిల్లాల్లో భారీ వర్షం
పిడుగుపాటుకు ఇద్దరి మృతి
22న అల్పపీడనం.. నేడు ఎల్లో అలెర్ట్
వారం పాటు వాతావరణం చల్లగానే..
పలు జిల్లాల్లో వర్షం.. తడిసిన ధాన్యం
హైదరాబాద్ లింగంపల్లిలో 6.8 సెం.మీ
పిడుగుపాటుకు ఇద్దరి మృతి..
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
రాష్ట్రంలో వచ్చే ఐదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈనెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని.. ఇది బలపడి 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం దక్షిణ ఛత్తీ్‌సగఢ్ నుంచి కొమరిన్ ప్రాంతం వరకు కొనసాగిన ఉపరితల ఆవర్తనం.. శనివారం దక్షిణ ఛత్తీ్‌సగఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని తెలిపింది. ఈ ద్రోణి కారణంగా రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశముందని వివరించింది. శుక్రవారం రాయలసీమ, పరిసర ఉత్తర తమిళనాడు ప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమైన ఆవర్తనం శనివారం బలహీనపడినట్లు వెల్లడించింది. ఆది, సోమ వారాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఆదివారం దాదాపు అన్ని జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ యెల్లో అలెర్ట్ జారీ చేసింది. అల్పపీడన ప్రభావంతో 25 వరకూ వాతావరణం చల్లగానే ఉంటుందని వివరించింది.
పలు జిల్లాల్లో భారీ వర్షం..
రాష్ట్రంలో శనివారం పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల్లోపే నమోదవగా.. మధ్యాహ్నం నుంచి పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో పలు చోట్ల కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. హైదరాబాద్ పరిధిలోని లింగంపల్లిలో అత్యధికంగా 6.8 సెం.మీ, రామచంద్రాపురంలో 5.8 సెం.మీ, సూర్యాపేట జిల్లా నడిగూడెంలో 6 సెం.మీ, రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో 5.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. భారీ వానలతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపించాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లాలో జడ్చర్లలో భారీ వర్షం కురిసింది. బాలానగర్, రాజాపూర్ మండలాల్లో భారీ వర్షం కురవగా.. నవాబ్‌పేట, భూత్పూర్ మండలాల్లో మోస్తరు వాన పడింది. రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ, యాచారం మండల్లాలోని పలు గ్రామాల్లో కురిసిన భారీ వర్షానికి కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. ఈదురుగాలులతో పలుచోట్ల చెట్లు నేలకూలాయి. భారీ వర్షాలు కురుస్తుండటంతో అన్నదాతలు దుక్కి దున్ని విత్తనాలు వేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. 25 నుంచి రోహిణి కార్తె ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
పిడుగులు పడి ఇద్దరి మృతి..
సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం అనాజీపురం గ్రామానికి చెందిన గొర్రెలకాపరి మట్టపల్లి వెంకన్న(55) దోసపాడు శివారులో గొర్రెలు మేపుతుండగా పిడుగుపాటుతో మృతి చెందాడు. ఖమ్మం జిల్లా మధిర మండలం రామచంద్రాపురంలో పిడుగుపాటుకు రైతు సంపసాల కృష్ణ మృతి చెందాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం జేత్యాతండాలో పిడుగుపడటంతో.. 15 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా కాపరి తావురియాకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే వేములపల్లి మండలం ఆమనగల్లులో పిడుగుపడి మరో గొర్రెల కాపరి బయ్య వెంకన్న కూడా తీవ్రంగా గాయపడ్డాడు.
Updated Date - May 19 , 2024 | 03:35 AM