Heroin Smuggling: రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు హెరాయిన్
ABN, Publish Date - Aug 17 , 2024 | 04:33 AM
రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు హెరాయిన్ సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు.
అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకున్న పోలీసులు
వారి వద్ద నుంచి రూ.4.50కోట్ల విలువైన
620 గ్రాముల హెరాయిన్ స్వాధీనం
రాయదుర్గం, అగస్టు 16 (ఆంధ్రజ్యోతి): రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు హెరాయిన్ సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు. నిందితులంతా వ్యాపారాల మాటున డ్రగ్స్ దందా చేస్తున్నారని, ముఠా సభ్యులందరూ రక్త సంబంధీకులేనని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. రాజస్థాన్‌లోని పాలి జిల్లా నీమ్‌లీమన్డా ప్రాంతానికి చెందిన మంగళ్‌రామ్ చౌదరి, గణేశ్ చౌదరి ఘటకేసర్‌లోను, దినేశ్ సైనిక్‌పురిలో ఉంటున్నారు. వీరు రాజస్థాన్ నుంచి హెరాయిన్‌ను నగరానికి తరలించి విక్రయిస్తున్నారు.
వీరికి రాజస్థాన్ నుంచి సావర్ జాట్ అనే వ్యక్తి డ్రగ్స్ తీసుకువచ్చి ఇస్తున్నాడు. అక్కడ జైతారాం అనే వ్యక్తి డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నాడు. సావర్ జాట్ ఈ నెల 7న జైతారాం నుంచి 620 గ్రాముల హెరాయిన్‌ను తీసుకువచ్చి మంగళ్‌రామ్, దినేశ్, గణేశ్‌కు ఇచ్చాడు. వారు డ్రగ్స్‌ను విక్రయించడం కోసం రాజస్థాన్‌కే చెందిన రమేశ్, సురేశ్‌ను పిలిపించి ఈసీఐఎల్ సమీపంలోని ఓ హోటల్‌లో ఉంచారు. అందరూ కలిసి డ్రగ్స్ ఎలా అమ్మాలన్నదానిపై ప్లాన్ వేశారు. హెరాయిన్‌ను దాచేందుకు మంగళ్‌రామ్, గణేశ్, దినేశ్ గచ్చిబౌలిలోని డ్రగ్స్ కొనుగోలుదారు ప్రకాశ్‌చౌదరి లైట్ స్టోర్‌కు వచ్చారు.
ఈ దందాపై సమాచారమందుకున్న మాదాపూర్ ఎస్‌ఓటీ, రాయదుర్గం పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఇది తెలిసి హోటల్‌లో ఉన్న రమేశ్, సురేశ్ పరారయ్యారు. నిందితులిచ్చిన సమాచారంతో దందాలో వీరికి సహకరిస్తున్న నితిన్ గుజ్జర్, ప్రకాశ్‌చౌదరి, జీవితారామ్, బనారామ్ చౌదరిలను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గర నుంచి 4.50కోట్ల విలువైన 620 గ్రాముల హెరాయిన్, హ్యుందాయ్ కార్, మహీంద్ర ఎస్‌యూవీ, 8 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెలవ్యవధిలో నగరంలో రెండు సార్లు హెరాయిన్ పట్టుబడటంతో కేసును లోతుగా విచారిస్తున్నామని డీసీపీ తెలిపారు
Updated Date - Aug 17 , 2024 | 04:33 AM