Hyderabad: టెన్షన్.. టెన్షన్..! ఆపరేషన్ మూసీతో గ్రేటర్ వ్యాప్తంగా ఆందోళన
ABN, Publish Date - Sep 27 , 2024 | 12:08 PM
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా కూల్చివేతలతో స్థానికుల్లో టెన్షన్ మొదలవుతోంది. ఇప్పటికే వరుసగా కూల్చివేతలు జనుగుతుండడంతో బుల్ డోజర్లు తమ ఇళ్లమీదకి ఎప్పుడొస్తాయోనని తీవస్థాయిలో ఆందోళన చెందుతున్నారు.
- మొదటి విడతలో రివర్‌బెడ్‌లో.. రెండో దఫాలో బఫర్‌జోన్ నిర్మాణాల తొలగింపు
- నదీ సరిహద్దు నుంచి రెండు వైపులా 50 మీటర్ల వరకు బఫర్‌జోన్ గుర్తింపు
- అపార్ట్‌మెంట్‌వాసులు, నిర్వాసితుల్లో గుబులు
- ఉన్న ఫళంగా ఇళ్లను తొలగిస్తే తమ పరిస్థితి ఏమిటని ఆవేదన
- పట్టాభూముల ఇళ్లకు నష్ట పరిహారం, నిర్మాణాల ఖర్చు చెల్లించే అవకాశం
హైదరాబాద్ సిటీ: గ్రేటర్ హైదరాబాద్(Greater Hyderabad)లో ఆపరేషన్ మూసీ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. మూసీ సుందరీకరణలో భాగంగా నదీ గర్భంతోపాటు పరివాహక ప్రాంతంలో కట్టుకున్న ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, ఇతర నిర్మాణాలను తొలగించి వారికి ప్రత్యామ్నాయం చూపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీంతో మహానగరంలో ఎక్కడ చూసినా మూసీ ప్రక్షాళన అంశం హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఏళ్ల తరబడి నివాసముంటున్న తమను నివాసాల నుంచి వెళ్లగొడుతుండడంతో నిర్వాసితులు ఆందోళనకు గురవుతున్నారు.
ఇదికూడా చదవండి: ED Raids: పొంగులేటి నివాసాల్లో ఈడీ అధికారుల సోదాలు
మూసీనది లోపల, బఫర్‌జోన్, ఎఫ్‌టీఎల్ పరిధిలోని నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు మొదటి విడతలో నదీ గర్భం (రివర్‌బెడ్)లోపల కట్టుకున్న ఇళ్లు, నిర్మాణాలను తొలగించేందుకు రెవెన్యూ, మూసీ అధికారులు ముందుకుసాగుతున్నారు. గురువారం లంగర్‌హౌజ్‌లోని ఆశ్రంనగర్, గోల్కొండ, ఇబ్రహీంబాగ్, కిషన్‌బాగ్, శంకర్‌నగర్, మూసారాంబాగ్, చాదర్‌ఘాట్, చైతన్యపురి, తదితర ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు ఇంటింటి సర్వే చేపట్టారు. ఈ మేరకు నిర్వాసితుల నుంచి ఆధార్‌కార్డు, కరెంట్ బిల్లు, నల్లా బిల్లులను సేకరించారు. ఇదే సమయంలో ప్రతి ఇంటిగోడకు ఆర్‌బీ-ఎక్స్ (రివర్‌బెడ్‌లో ఇల్లు ఉందని సూచిస్తూ) ముద్రవేశారు.
12,184 అక్రమ కట్టడాల గుర్తింపు..
కాంగ్రెస్ ప్రభుత్వం మూసీనది అభివృద్ధి ప్రాజెక్టును త్వరగా పట్టాలెక్కించేందుకు ముందుకుసాగుతోంది. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో గుర్తించిన నిర్మాణాలను తొలగించాలని, నిర్వాసితులకు డబుల్ బెడ్‌రూమ్(Double bedroom) ఇళ్లను కేటాయిస్తామని భరోసా కల్పించాలని సూచించింది. కాగా, గతంలో చేపట్టిన సర్వే ప్రకారం.. మూసీ పరివాహకం 55 కిలోమీటర్ల పరిధిలో దాదాపు 12,184పైగా అక్రమ కట్టడాలున్నట్లు రెవెన్యూ, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, పోలీసు, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగ అధికారులు తేల్చారు. అయితే మొత్తం నిర్మాణాలను నదీగర్భం(రివర్‌బెడ్), బఫర్‌జోన్లుగా విభజించారు. నదీగర్భంలో 1,595 నిర్మాణాలను గుర్తించారు. ఇందులో 288 భారీ నిర్మాణాలున్నట్లు తేల్చారు. అలాగే నది సరిహద్దు నుంచి రెండు వైపులా 50 మీటర్ల వరకు ఉన్న నిర్మాణాలను బఫర్‌జోన్ కింద గుర్తించారు. ఇందులో మొత్తం 7,851 అక్రమ నిర్మాణాలు, 1,032 భారీ నిర్మాణాలున్నట్లు గుర్తించారు. ఇదిలా ఉండగా, ఎఫ్‌టీఎల్ పరిధిలో 3,004 అక్రమ కట్టడాలున్నట్లు తేల్చారు.
నష్ట పరిహారం, నిర్మాణ వ్యయం చెల్లింపు..?
నదీగర్భంలో ఇళ్లు కట్టుకున్న వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయిస్తున్న మాదిరిగానే.. బఫర్‌జోన్‌లోని ప్రభుత్వ స్థలంలో ఉన్న నిర్వాసితులకు కూడా రెండు పడకల ఇంటిని ఇవ్వనున్నారు. బఫర్‌జోన్‌లోని ప్రైవేట్ స్థలాల్లో చేపట్టిన భారీ నిర్మాణాలు, అపార్ట్‌మెంట్లు, ఇళ్లకు మాత్రం 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారంతోపాటు ఇంటి వ్యయాన్ని చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. కాగా, ప్రైవేట్ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి నివేదించిన తర్వాతే దీనిపై స్పష్టత రానుంది.
రూపాయి ఖర్చు లేకుండా డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి నదీగర్భంలోని ఇళ్లను గుర్తించిన రెవెన్యూ అధికారులు స్థానికులను శుక్ర, శనివారాల్లో ఖాళీ చేయించాలని భావిస్తున్నారు. ఈ మేరకు నిర్వాసితులను పంపిస్తున్న సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వారికి నచ్చజెప్పిన అధికారులు రూపాయి ఖర్చు లేకుండా ఇంటిలోని సామగ్రిని అంతా.. డీసీఎంలలో డబుల్ బెడ్‌రూమ్‌లకు తరలించనున్నారు. ప్రతి ఇంటికి ఒక డీసీఎం పెట్టి ఎవరికీ ఇబ్బంది లేకుండా ప్రక్రియను ప్రశాంతంగా చేపట్టనున్నారు. ఇదే క్రమంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో కూడా కావాల్సిన మరమ్మ తులు, నిర్వహణ పనులను చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
అపార్ట్‌మెంట్లలో సమావేశాలు..
గతంలో అపార్ట్‌మెంట్ మెయింటెనెన్స్ కోసం నెలరోజులకోసారి సమావేశం ఏర్పాటు చేసుకునే ఇంటి యజమానులు హైడ్రా నేపథ్యంలో ఇటీవల ప్రతిరోజూ సమావేశమవుతున్నారు. ప్రధానంగా చెరువుల బఫర్‌జోన్, ఎఫ్‌టీఎల్ పరిధిలో కొనుగోలు చేసిన వారు హైరానా పడుతున్నారు. హైడ్రా బుల్డోజర్ ఎప్పుడు తమపైకి వస్తుందోనని ఆందోళనకు గురవుతున్నారు. అయితే తమ ఇళ్లు బఫర్‌జోన్‌లో, ఎఫ్‌టీఎల్‌లో ఉన్నాయా.. తమ పరిస్థితి ఏమిటనీ గుబులు చెందుతున్న యజమానులకు అధికారుల నుంచి స్పష్టత కరువైందని వాదనలు వినిపిస్తున్నాయి.
బఫర్‌జోన్ నిర్వాసితుల్లో గుబులు..
ఆపరేషన్ మూసీలో భాగంగా గురువారం నదీగర్భంలోని ఇంటి యజమానులను రెవెన్యూ అధికారులు కలిసి పరిస్థితిని వివరించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇంటిని కేటాయించిన తర్వాతే ఇక్కడి నుంచి పంపిస్తామని, ఇందులో ఏమాత్రం అనుమానం లేదని చెప్పారు. అయితే పలుచోట్ల స్థానికులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమను ఇక్కడి నుంచి పంపిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇదిలా ఉండగా, నదీ సరిహద్దు నుంచి రెండు వైపులా 50 మీటర్ల బఫర్‌జోన్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాల్లో ఇళ్లు, భారీ నిర్మాణాలు చేపట్టిన వారు ఆందోళనకు గురవుతున్నారు. ప్రధానంగా రూ. లక్షలు, కోట్లు వెచ్చించి అపార్ట్‌మెంట్లు కొనుగోలు చేసిన ఉద్యోగులు, ఇతరులు ఆందోళన చెందుతున్నారు. ఏ సమయంలో తమను ఇక్కడి నుంచి పంపిస్తారోనని టెన్షన్‌కు లోనవుతున్నారు.
గండిపేట మండలంలో సర్వే
నార్సింగ్: మూసీ ప్రక్షాళనలో భాగంగా గండిపేట మండలంలో అధికారుల బృందం సర్వే చేపట్టింది. తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో బృందం సభ్యులు బైరాగీగూడ, హైదర్షాకోట్ ప్రాంతంలో ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లలో ఉన్న ఇళ్లను గుర్తించి వాటికి మార్కింగ్ చేశారు. అధికారులు నిర్వహిస్తున్న ఈ సర్వేకు పోలీస్ బందోబస్తును కూడా కల్పించారు.
ఇదికూడా చదవండి: Harish Rao: పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులివ్వండి
ఇదికూడా చదవండి: కాళేశ్వరం కట్టిన ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకోకండి
ఇదికూడా చదవండి: KCR: కొండా లక్ష్మణ్ బాపూజీ కృషి అజరామరం
ఇదికూడా చదవండి: అబ్బో.. వీళ్ల పైత్యం మామూలుగా లేదుగా.. మెట్రోరైల్వేస్టేషన్‌లో అశ్లీల రీల్స్..
Read Latest Telangana News and National News
Updated Date - Sep 27 , 2024 | 12:08 PM