Hyderabad: నిజాం ప్రధాన సైనికాధికారి నివాసమే నేటి రాష్ట్రపతి నిలయం
ABN, Publish Date - Dec 11 , 2024 | 08:41 AM
బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంగా పిలుస్తున్న భవనాన్ని 1860లో నిజాం నవాబు నజీరుద్దౌలా నిర్మించారు. సాలర్‌జంగ్ ప్రధానిగా ఉన్న సమయంలో బొల్లారం(Bollaram) నిజాం ప్రభుత్వం అధీనంలోని ఒక కంటోన్మెంట్(Cantonment) ప్రాంతంగా ఉండి, ప్రధాన సైనికాధికారి నివాసంగా ఉండేది.
- 17న రాష్ట్రపతి రాక
హైదరాబాద్: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంగా పిలుస్తున్న భవనాన్ని 1860లో నిజాం నవాబు నజీరుద్దౌలా నిర్మించారు. సాలర్‌జంగ్ ప్రధానిగా ఉన్న సమయంలో బొల్లారం(Bollaram) నిజాం ప్రభుత్వం అధీనంలోని ఒక కంటోన్మెంట్(Cantonment) ప్రాంతంగా ఉండి, ప్రధాన సైనికాధికారి నివాసంగా ఉండేది. 1950లో హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకొని దక్షిణాదిలో రాష్ట్రపతి విడిది కోసం ఆహ్లాదకరమైన వాతావరణంలో అతిథి గృహంగా మార్చి ఈ భవనాన్ని రాష్ట్రపతి నిలయంగా నామకరణం చేశారు. 90 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో భవనాన్ని 2,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులో మూడు ప్రధాన విభాగాలు ఏర్పాటుచేశారు. రాష్ట్రపతి, కుటుంబ సభ్యులు, ఏడీసీ విభాగాలుగా విభజించారు. రాష్ట్రపతి నిలయం పరిసర ప్రాంతాల్లో మరో 20 గదులను నిర్మించారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ప్రభుత్వాలు మారితే తెలంగాణ తల్లి మారుతుందా..
రాజేంద్రప్రసాద్ నుంచి ద్రౌపది ముర్ము వరకు..
దేశ ప్రథమ రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ నుంచి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వరకు ప్రతి ఏడాది శీతాకాల విడిది కోసం వచ్చారు. ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా మిగతా రాష్ట్రపతుల మాదిరిగానే శీతాకాల విడిది కోసం నగరానికి మొదటిసారి రాష్ట్రపతి హోదాలో వస్తున్నారు.
రాష్ట్రపతి నిలయం చుట్టూ రక్షణ దళాలు
రాష్ట్రపతి నిలయం పరిసరాల చుట్టూ రక్షణ విభాగాల దళాలు ఉండటంతో భద్రతాపరంగా పటిష్ఠంగా ఉంది. రాష్ట్రంలోని మిలిటరీ వ్యవహారాలను పర్యవేక్షించే ఆంధ్రా, తెలంగాణ సబ్ ఏరియా కమాండెంట్ ప్రధాన కార్యాలయం కూడా రాష్ట్రపతి నిలయాన్ని ఆనుకొని ఉంది. సీడీఎం, ఈఏఈ, ఎంసీఈఎంఈ, ఏఓసీ తదితర రక్షణ విభాగాలు ఇక్కడ ఉన్నాయి.
పనుల్లో ప్రభుత్వ విభాగాలు..
ఈనెల 17న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం నగరానికి రాక సందర్భంగా రాష్ట్రపతి నిలయంలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు రోడ్ల ఆధునికీకరణ పనులు చేపట్టడంతో ప్రభుత్వం విభాగాల అధికారులు తలమునకలయ్యారు. రాష్ట్రపతి నిలయంలోని దట్టమైన పొదలను తొలగించడం, పచ్చదనం పెంచడం, తాగునీటి సదుపాయం కల్పించడం, పారిశుధ్య నిర్వహణ తదితర పనులను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సంయుక్తంగా చేపడుతున్నాయి.
ప్రత్యేక హెలిప్యాడ్..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోసం రాష్ట్రపతి నిలయాన్ని ఆనుకొని ఉన్న ఈఎంఈ పరేడ్ గ్రౌండ్‌లో ప్రత్యేక హెలిప్యాడ్‌ను సిద్ధం చేశారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రయాణించడానికి వీలుగా హెలిప్యాడ్‌ను అధికారులు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు హెలిక్యాప్టర్‌లో ప్రయాణించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: విగ్రహాల మీద ఉన్న ధ్యాస విద్యార్థుల మీద లేదా?
ఈవార్తను కూడా చదవండి: తినే మాంసంలో.. యాంటీబయాటిక్స్
ఈవార్తను కూడా చదవండి: సింగరేణి సీఎండీ రేసులో శైలజా రామయ్యర్!
ఈవార్తను కూడా చదవండి: ఆన్‌లైన్‌లో భద్రాద్రి ముక్కోటి దర్శన టికెట్లు
Read Latest Telangana News and National News
Updated Date - Dec 11 , 2024 | 08:42 AM