Droupadi Murmu: నేటి నుంచి లోక్‌మంథన్
ABN, Publish Date - Nov 21 , 2024 | 04:14 AM
అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవానికి భాగ్యనగర్ వేదిక కానుంది. భారత సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పేందుకు సిద్ధమైంది.
హైదరాబాద్‌లో అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవం
అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్స వానికి వేదిక కానున్న భాగ్యనగరం
4 రోజులు జరగనున్న కార్యక్రమం
హాజరుకానున్న రాష్ట్రపతి, పలు రాష్ట్రాల గవర్నర్లు
హైదరాబాద్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవానికి భాగ్యనగర్ వేదిక కానుంది. భారత సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పేందుకు సిద్ధమైంది. సాంస్కృతిక ఏకత్వాన్ని చాటి చెప్పే అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవం (లోక్ మంథన్) గురువారం నుంచి అంగరంగ వైభవంగా సాగనుంది. శిల్పారామంలో గురువారం నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు వేడుక కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. లోక్ మంథన్ అంటే జానపద మేళా అని అర్థం. 2016లో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో లోకమంథన్‌ను వైభవంగా నిర్వహించారు. ప్రతి రెండేళ్లకోసారి ఒక్కో రాష్ట్రంలో నిర్వహిస్తూ వస్తోంది. ఆ రకంగా ఇది నాలుగో లోక్‌మంథన్. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారి హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆర్‌ఎ్‌సఎస్ చీఫ్ మోహన్ భాగవత్, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పలురాష్ట్రాల గవర్నర్లు, ఆచార్య మిథిలేశ్, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సహా వివిధ రంగాల ప్రముఖులు హాజరు కానున్నారు. కేంద్ర మంత్రి, లోక్‌మంథన్ ఆహ్వాన కమిటీ గౌరవ అధ్యక్షులుగా కిషన్‌రెడ్డి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు.
దేశంలోని జానపద కళాకారులు అందరినీ ఒకేచోటుకు చేర్చి, వారి ప్రతిభాపాటవాలు నైపుణ్యా న్ని ప్రదర్శించే వేదికను ప్రజ్ఞా ప్రవాహ్ అనే సంస్థ ఏర్పాటు చేసింది. దేశంలోని మారుమూల ప్రాంతం నుంచి మొదలుకొని విదేశాల నుంచి సైతం ప్రతినిధులు జానపద కళాకారులు హాజరుకానున్నారని నిర్వహకులు వెల్లడించారు. లోక్‌మంథన్ వేడుకలో గిరిజనుల చేతివృత్తుల కళారూపాలు, కళాప్రదర్శనలు ఉంటాయి. ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసే స్టాళ్లలో పలు ఉత్పత్తుల ప్రదర్శనతో పాటు, ప్రజలకు సైతం తమ నైపుణ్యాన్ని ప్రదర్శించే కార్యక్రమం ఉంటుంది. వందకు పైగా సాంస్కృతిక కార్యక్రమాలు, దాదాపు 1500 మందికి పైగా కళాకారులతో సంప్రదాయ సంగీత వాయిద్యాలు, పనిముట్ల ప్రదర్శనలు ఉంటాయని నిర్వహకులు తెలిపారు. కాగా గురు, శుక్రవారా ల్లో రాష్ట్రపతి ముర్ము హైదరాబాద్‌లో పర్యటిస్తారు. గురువారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హై దరాబాద్ చేరుకుంటారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవంలో పాల్గొంటారు. రాత్రి 7:10కి రాజ్‌భవన్‌కు చేరుకొని అక్కడే బస చేస్తారు. శుక్రవారం ఉదయం లోక్‌మంథన్‌లో పాల్గొని మధ్యా హ్నం 12:05 గంటలకు ఢిల్లీ బయలుదేరివెళతారు.
Updated Date - Nov 21 , 2024 | 04:14 AM