Hyderabad: బీఆర్ఎస్కు గడ్డుకాలం.. కాంగ్రెస్, బీజేపీ వైపు నేతల చూపు.. కవిత అరెస్ట్‌తో మరో షాక్
ABN, Publish Date - Mar 16 , 2024 | 11:59 AM
గ్రేటర్‌లో బీఆర్‌ఎస్ గడ్డుకాలం ఎదుర్కొంటోంది. పార్లమెంటు ఎన్నికల వేళ పార్టీకి చెందిన కీలక నేతలు అధికార కాంగ్రెస్, బీజేపీ(BJP)వైపు చూస్తున్నారు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్, పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్‌లోకి వెళ్లగా.. తాజాగా పలువురు ఎమ్మెల్యేలు అధికార పార్టీకి టచ్‌లోకి వెళ్లారు.
గ్రేటర్‌లో బీఆర్‌ఎస్ గడ్డుకాలం ఎదుర్కొంటోంది. పార్లమెంటు ఎన్నికల వేళ పార్టీకి చెందిన కీలక నేతలు అధికార కాంగ్రెస్, బీజేపీ(BJP)వైపు చూస్తున్నారు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్, పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్‌లోకి వెళ్లగా.. తాజాగా పలువురు ఎమ్మెల్యేలు అధికార పార్టీకి టచ్‌లోకి వెళ్లారు. వీరి బాటలో మరికొందరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బీఆర్‌ఎస్(BRS) అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేయడంతో మరోషాక్ తగిలింది. ఎన్నికల నోటిఫికేషన్‌కు ఒకరోజు ముందు జరిగిన అనూహ్యపరిణామంతో బీఆర్‌ఎస్ నేతలు కంగుతిన్నారు. ఈ పరిణామాలన్నీ పార్టీని తీవ్ర కలవర పెడుతున్నాయి.
హైదరాబాద్ సిటీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గ్రేటర్‌లోని పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో ఒక్క సీటు కూడా దక్కించుకోని కాంగ్రెస్ లోక్‌సభస్థానాలను దక్కించుకోవడానికి పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా పార్టీలో చేరేందుకు ఆసక్తి ఉన్న ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కీలక నేతలను చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.
అభివృద్ధి కోసమేనా..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నగరానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కానీ వారిని మర్యాదపూర్వకంగా కలిసే వరకే సీఎం పరిమితం చేశారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుంటే గతంలో బీఆర్‌ఎస్ అవలంభించిన విధానాన్ని అనుసరించినట్లవుతుందని చేరికలకు చెక్ పెట్టారు. గ్రేటర్ పరిధిలో బీఆర్‌ఎ్‌సలో కీలకంగా ఉండి నగర తొలి మేయర్‌గా వ్యవహరించిన బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలతరెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరారు. నియోజకవర్గం అభివృద్ధి జరగాలన్నా, తమ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగాలన్నా అధికార పార్టీలో ఉండడమే ఉత్తమని పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు భావిస్తున్నారు. అందుకోసం సీఎం రేవంత్‌రెడ్డి, లేదంటే ఢిల్లీలోని కాంగ్రెస్ అగ్ర నేతలను కలుస్తున్నారు.
సీఎంతో టచ్‌లోకి వెళ్లిన నేతలు..
సీఎం రేవంత్‌రెడ్డిని ఇప్పటికే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి(Patancheru MLA Goodem Mahipal Reddy), ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(MLA Dana Nagender) కలిశారు. ఇటీవల ఎల్‌బీనగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సీఎంను మరోసారి ప్రత్యేకంగా కలుస్తానంటూ సభా వేదిక ద్వారా ప్రకటించారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్‌ను మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కలిశారు. ఇలా పలువురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)తో టచ్‌లోకి వెళ్లారు. నగరానికి చెందిన కీలక ప్రజా ప్రతినిధి సైతం సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తన సన్నిహితులతో ఆయన తమది మొదటి నుంచి కాంగ్రెస్ కుటుంబమేనని అన్నట్లు తెలిసింది. కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్భంలో నగరానికి చెందిన అదే సామాజిక వర్గానికి చెందిన ఓ ఎమ్మెల్యే సీఎంను కలిసి తన మనసులోని మాటను చెప్పుకోవాలనుకున్నట్లు సమాచారం. సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మరో ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. గోషామహల్ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జిగా ఉన్న నందకిషోర్ వ్యాస్ కాంగ్రెస్ లో చేరేందుకు పార్టీ అగ్రనేతలతో చర్చలు జరిపినట్లు తెలిసింది. ముషీరాబాద్ బీఆర్‌ఎస్ సీనియర్ నేత ఎమ్మెన్ శ్రీనివా్‌సరావు, మాజీ కార్పొరేటర్ ఎడ్ల హరిబాబుయాదవ్ సైతం కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. డివిజన్లు, బస్తీల వారీగా బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలను చేర్చుకునే పనిలో ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి, సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ నిమగ్నమయ్యారు. కాంగ్రెస్ లో చేరేందుకు పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఆసక్తి కనబరుస్తున్నారని రోహిన్‌రెడ్డి తెలిపారు.
రాజకీయ కక్షతోనే అరెస్ట్
ఎమ్మెల్సీ కవితను రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేశారని జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. కోర్టులో కేసు ఉన్నప్పటికీ నిబంధనలు పాటించకుండా అరెస్ట్ చేయడం సరికాదని ఓ ప్రకటనలో తెలిపారు.
Updated Date - Mar 16 , 2024 | 12:50 PM