TS NEWS: బండ్లగూడలో నిధుల పక్కదారి.. అధికారుల నిర్వాకం బట్టబయలు
ABN , Publish Date - Jan 26 , 2024 | 09:56 PM
నగరంలోని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 40 లక్షల రూపాయలు గోల్ మాల్ అయ్యాయి. బండ్లగూడ జాగీర్ ఆదర్శ్‌నగర్‌లో కమ్యూనిటీ హాల్ పేరుతో 40 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లుగా అధికారులు రికార్డు సృష్టించారు.

రంగారెడ్డి: కొంతమంది అక్రమార్కుల వల్ల తెలంగాణ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 40 లక్షలను అధికారులు పక్కదారి పట్టించారు. ప్రజావసరాలకు ఉపయోగపడే నిధులను అధికారులు పక్కదారి పట్టించడంతో కార్పొరేషన్‌లో ఎక్కడి పనులు అక్కడే అసంపూర్తిగా మిగిలి పోయాయి. అధికారులు తప్పును కప్పిపుచ్చుకునేందుకు తప్పు మీద తప్పు చేశారు. వీరి నిర్వాకం బయటపడే సరికి తప్పించుకునేందుకు ప్రజలకు మొహం చాటేస్తున్నారు. వీరి నిర్వాకం తెలిసిన అక్కడి ప్రజలు.. బాబోయ్ వీళ్లెం అధికారులు అని ముక్కున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే...
ఏం తెలియనట్లుగా శిలాఫలకం
నగరంలోని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 40 లక్షల రూపాయలు గోల్ మాల్ అయ్యాయి. బండ్లగూడ జాగీర్ ఆదర్శ్‌నగర్‌లో కమ్యూనిటీ హాల్ పేరుతో 40 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లుగా అధికారులు రికార్డు సృష్టించారు. అయితే సొంత ఖర్చులతో కమ్యూనిటీ హాల్‌ను కాలనీవాసులు నిర్మించుకున్నారు. అయితే కాలనీవాసులు నిర్మించుకున్న కమ్యూనిటీ హాల్‌కు బండ్లగూడ జాగిర్ మున్సిపల్ అధికారులు 40 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లుగా శిలాఫలకం పెట్టారు. కమ్యూనిటీ అసోసియేషన్ సభ్యులు అడ్డుపడగా 40 లక్షల రూపాయల.. శిలాఫలకాన్ని తొలగించి 20 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు శిలాఫలకాన్ని మళ్లీ మున్సిపల్ అధికారులు పెట్టారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నత స్థాయి అధికారులకు కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు.