TG NEWS: పోలీసులకు భయపడి..ప్రాణాలు పోగొట్టుకున్నాడు..
ABN, Publish Date - Nov 16 , 2024 | 08:45 AM
మందుబాబులకు అర్ధరాత్రి ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండాపోయింది. మద్యం తాగి వాహనాలు నడపకుండా ఉండేందుకు నగర ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్‌ను ప్రవేశపెట్టారు. శుక్ర, శనివారాల్లో ఈ తనిఖీలను ముమ్మరంగా నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నా..యువతలో మార్పు రావడం లేదు. ఫలితంగా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది.
హైదరాబాద్: మద్యం మత్తులో యువతరం చిక్కుకుంది. కిక్కుకోసం పబ్‌లు, బార్‌లకు పరుగులు తీస్తోంది. పబ్‌కల్చర్ యూత్‌ను ఉర్రూతలూగిస్తోంది. మత్తులో మునిగిన కుర్రకారు మితిమీరిన వేగంతో వాహనాలను నడిపి అదుపు తప్పుతోంది. ఖరీదైన కార్లతో రయ్యిమంటూ దూసుకుపోయి ప్రమాదాలకు కారణమవుతోంది. అర్ధరాత్రి ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండాపోయింది. మద్యం తాగి వాహనాలు నడపకుండా ఉండేందుకు నగర ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్‌ను ప్రవేశపెట్టారు. శుక్ర, శనివారాల్లో ఈ తనిఖీలను ముమ్మరంగా నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నా..యువతలో మార్పు రావడం లేదు. తొలిరోజుల్లో డ్రంకెన్ డ్రైవ్ సత్ఫలితాలను ఇచ్చింది. మద్యం తాగిన వారు తూగుతూ...వాహనాలు నడపడం తగ్గించారు. తర్వాత కాలంలో తూలుతూ వాహనం నడపడం క్రేజ్‌గా మార్చుకున్నారు. ఈ ఏడాది డ్రంకెన్ డ్రైవ్ కేసులు రికార్డుస్థాయిలో నమోదయ్యాయి. గతేడాది నవంబర్ నాటికి సుమారు 19 వేల కేసులు నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే పది శాతం కేసులతోపాటు జైలు శిక్షలు కూడా పెరిగాయి. అయినప్పటికీ మందు బాబుల వీరంగం ఏమాత్రం తగ్గడం లేదు.
మద్యం మత్తులో ఫ్లైఓవర్‌ను ఢీకొట్టి..
హైదరాబాద్‌లో నిన్న(శుక్రవారం) పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఓ వ్యక్తి మద్యం తాగి అటువైపుగా వెళ్లాడు. ఈ తనిఖీల నుంచి తప్పించుకుందామని ఆయన ప్రయత్నించారు. అయితే పోలీసులకు భయపడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఈ సంఘటన హైదరాబాద్‌లోని శంషాబాద్ ఫ్లైఓవర్‌పై జరిగింది. ఈ సంఘటనకు అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. శంషాబాద్ ఫ్లైఓవర్‌పై పోలీసులు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల నుంచి తప్పించుకునేందుకు రాంగ్ రూట్లో ఓ వ్యక్తి మత్తులో డ్రైవింగ్ చేశాడు. దీంతో శంషాబాద్ ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ ఫ్లైఓవర్‌పై డ్రంకెన్ డ్రైవ్ ఉండటంతో వాహనదారుడు రాంగ్ రూట్లో వేగంగా వెళ్లి కారు ఫ్లైఓవర్‌ను ఢీకొట్టడంతో అక్కడికి అక్కడే మృతిచెందాడు. సదరు వ్యక్తి తాగిన మైకంలో పోలీసులను చూసి భయాందోళనలకు గురై రాంగ్ రోడ్డులో వెళ్లి ప్రమాదానికి గురైనట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు
మోతాదు మించితే జైలుకే..
డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారిపై కేసు నమోదవుతోంది. న్యాయస్థానంలో రూ.2100లు చలానా కడితే సరిపోయేది. ఇప్పుడు మోటారు వెహికల్ చట్టాన్ని మరింత పటిష్ఠం చేసినా యువతలో మార్పు రాలేదు. తనిఖీల్లో బ్లడ్ ఆల్కాహాల్ కంటెంట్(BAC) 100 శాతం నమోదైతే వాహన చోదకుడిని జైలుకే పంపిస్తారు. 100 MLగా బ్రీతింగ్ ఎనలైజర్ ద్వారా తేలితే రెండు రోజులు అంతకన్నా ఎక్కు్వస్తే నాలుగు, పది రోజుల వరకు జైలు శిక్ష పడుతుంది. ఒక్కసారి పట్టుబడి జైలుకు వెళ్తారు. తీరుమారకపోతే నెల రోజలపాటు జైలుశిక్షతో పాటు అవసరమైతే లైసెన్స్ రద్దు చేస్తారు. అయినప్పటికీ యువతరం వెనక్కి తగ్గడం లేదు. గతేడాది సుమారు ఏడు వేల మందికి జైలుకు వెళ్లగా, ఈ ఏడాది 8900 మంది జైలుకు వెళ్లారు.
ఇక్కడే ఎక్కువ..
కాగా హైదరాబాద్ నగరంలో ఈ ఏడాది సుమారు 19 వేల డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో బంజారాహిల్స్(Banjara Hills), జూబ్లీహిల్స్(Jublee Hills), మాదాపూర్(Madapur), గచ్చిబౌలి(Gachibowli) ప్రాంతాల్లోనే అత్యధికంగా నమోదైనట్లు పోలీసులు చెబుతున్నారు. వీకెండ్‌లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో సుమారు నాలుగు వందల కేసులు నమోదవుతున్నాయి. మాదాపూర్‌లో రెండు వందలు, గచ్చిబౌలిలో వందకు పైగా కేసులు నమోదవుతున్నాయి. వీకెండ్ వచ్చిందంటే నగర యువకుల అడుగులు పబ్‌లవైపు వెళ్తాయి. పబ్ సంస్కృతితోపాటు పేరొందిన బార్‌లన్నీ అక్కడే ఉండటంతో హిల్స్‌కు వచ్చేందుకు మెజారిటీ యువతరం అటువైపే మొగ్గు చూపుతోంది. దీనిని గుర్తించిన పోలీసులు పబ్‌లు, బార్‌లను కలిపే కూడళ్లలో డ్రంకెన్‌డ్రైవ్‌లను విస్తృతం చేశారు. మందుబాబులు కూడా పోలీసులను తప్పించుకునేందుకు తనిఖీలున్న ప్రాంతాలను ముందే పసిగట్టి ప్రత్యామ్నయ మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్నారు. యువతరం ఎత్తులను గుర్తించిన పోలీసులు ఆకస్మిక తనిఖీలను ముమ్మరం చేసి మందుబాబుల ఆటకట్టిస్తున్నారు.
పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు..
మత్తుతో యువత చేస్తున్న హంగామా ఇతరులకు ప్రాణసంకటంగా మారింది. ఇటీవల బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో జరిగిన 20 రోడ్డు ప్రమాదాల్లో 16 సంఘటనలు మద్యం మత్తులోనే జరిగాయని పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 2కు సమీపంలో కొన్ని రోజుల క్రితం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం అటువంటిదేనని స్థానికులు పేర్కొంటున్నారు. ఇద్దరు యువకులు మద్యం మత్తులో కారును నడిపి ఇద్దరిని గాయపర్చారు. వారి కారులో గంజాయి సిగరెట్టు ఉన్నట్టు తేలింది. ఇలాంటి వారిపై పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటేనే యువతలో మార్పు వస్తోందని పలువురు భావిస్తున్నారు.
Updated Date - Nov 16 , 2024 | 08:45 AM