Pushpa 2: అల్లు అర్జున్ బెయిల్ రద్దు కోసం పోలీసుల యాక్షన్ ప్లాన్ అదేనా..!
ABN, Publish Date - Dec 23 , 2024 | 02:10 PM
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ నిర్లక్ష్యం ఉందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై శాసనసభలో మాట్లాడారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ లేవనెత్తిన ప్రశ్నకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానమిస్తూ ఓ మహిళ చనిపోయిందని, థియేటర్ నుంచి నటుడు అల్లు అర్జున్ వెళ్లిపోవాలని..
అల్లు అర్జున్ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌ను నిందితుడిగా పేర్కొంటూ అరెస్ట్ చేశారు. తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ నిర్లక్ష్యం ఉందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై శాసనసభలో మాట్లాడారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ లేవనెత్తిన ప్రశ్నకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానమిస్తూ ఓ మహిళ చనిపోయిందని, థియేటర్ నుంచి నటుడు అల్లు అర్జున్ వెళ్లిపోవాలని పోలీసులు కోరినా వెళ్లేందుకు మొదట ఆయన నిరాకరించారని, సినిమా చూసి వెళ్తానని సమాధానమిచ్చారంటూ పేర్కొనడంతో ఈ ఘటన మరో మలుపు తిరిగింది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అర్జున్ తనకు ఎవరూ మహిళ చనిపోయిన విషయాన్ని తెలియజేయలేదని, తనకు తరువాత రోజు మాత్రమే విషయం తెలిసిందని, తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తన విషయంలో అసత్యాలు చెబుతోందన్నారు. మరోవైపు కోర్టు పరిధిలో ఉన్న అంశంపై సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రస్తావించడాన్ని కొందరు తప్పుపడుతుంటే.. మధ్యంతర బెయిల్‌పై ఉన్న వ్యక్తి ఈ కేసు విషయమై మీడియా సమావేశం నిర్వహించడాన్ని మరికొందరు తప్పుపడుతున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ రద్దు కోసం పోలీసులు హైకోర్టు డివిజన్ బెంచ్ లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రాజకీయ రంగు..
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్రమేపి రాజకీయరంగు పులుముకుంది. కాంగ్రెస్ వర్సెస్ ప్రతిపక్షాలుగా ఈ ఘటన మారిపోయింది. కాంగ్రెస్ నేతలు అల్లు అర్జున్ వ్యవహారాన్ని తప్పుపడుతుండగా.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు తొక్కిసలాటలో మహిళ చనిపోవడం దురదృష్టకరమంటూనే అల్లు అర్జున్‌ను ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని విమర్శిస్తోంది. మరోవైపు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ నడుస్తున్నారని, బీఆర్‌ఎస్ అల్లు అర్జున్‌కు ఎందుకు మద్దతు ప్రకటిస్తోందంటూ కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. తాజాగా పోలీసులు సైతం అల్లు అర్జున్ ఎపిసోడ్‌లో ఏమి జరిగిందనే విషయంపై ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో థియేటర్ వద్ద డిసెంబర్4వ తేదీన ఏమి జరిగిందనే విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు.
బెయిల్ రద్దవుతుందా..
అల్లు అర్జున్ కేసులో సాక్షులు, పిటిషనర్‌ను ప్రభావితం చేయగల వ్యక్తి అని, సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తి కావడంతో కేసు విచారణ పూర్తయ్యేవరకు బెయిల్ ఇవ్వొద్దని, మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. మధ్యంతర బెయిల్‌పై ఉన్నప్పుడు కేసు గురించి మీడియా ముందు మాట్లాడకూడదనే షరతులు ఉన్నప్పటికీ.. కోర్టు షరతులను అల్లు అర్జున్ ఉల్లంఘించారనే వాదనను ప్రభుత్వం తరపున న్యాయవాదులు వినిపించే అవకాశం లేకపోలేదు. దీంతో అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ రద్దవుతుందా.. లేదంటే కోర్టు బెయిల్‌ను పడిగిస్తుందా అనేది వేచి చూడాలి.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here
Updated Date - Dec 23 , 2024 | 03:23 PM