Hyderabad: భలే చెప్పారు బ్రహ్మానందం!
ABN, Publish Date - Apr 11 , 2024 | 09:58 AM
వెండితెర మీద కనిపించి ముఖకవళికలతోనే నవ్వులు పూయించే బ్రహ్మానందం(Brahmanandam) ప్రాచీన సాహిత్యం మీద అరగంటకుపైగా ప్రసంగించి సభికులను ఆకట్టుకున్నారు. ఆలోచింపజేసేలా ఉండటంతో ఆ ప్రసంగాన్ని సభికులు ఎంతో ఆసక్తిగా విన్నారు. మహాకవి ధూర్జటి(Dhurjati) మీద బౌద్ధం(Boudham) ప్రభావం ఉందంటూ తనదైన శైలిలో విశ్లేషించారు.
ప్రాచీన సాహిత్యంపై ప్రసంగంతో
మంత్రముగ్ధులను చేసిన హాస్య బ్రహ్మ
అద్భుత ప్రసంగం విన్నానన్న వెంకయ్య
పోలవరపు కోటేశ్వరరావు సాహిత్య
సర్వస్వం రెండవ సంపుటి ఆవిష్కరణ
హైదరాబాద్, ఏప్రిల్11: వెండితెర మీద కనిపించి ముఖకవళికలతోనే నవ్వులు పూయించే బ్రహ్మానందం(Brahmanandam) ప్రాచీన సాహిత్యం మీద అరగంటకుపైగా ప్రసంగించి సభికులను ఆకట్టుకున్నారు. ఆలోచింపజేసేలా ఉండటంతో ఆ ప్రసంగాన్ని సభికులు ఎంతో ఆసక్తిగా విన్నారు. మహాకవి ధూర్జటి(Dhurjati) మీద బౌద్ధం(Boudham) ప్రభావం ఉందంటూ తనదైన శైలిలో విశ్లేషించారు. ధూర్జటి, బమ్మెర పోతనలను విప్లవ కవులుగా అభివర్ణిస్తూ సోదాహరణంగా మాట్లాడారు. కవిసామ్రాట్ విశ్వనాథ, మహాకవి శ్రీశ్రీల మధ్య సాగిన భావ యద్ధాన్ని సంఘటనతో సహా ప్రస్తావిస్తూ సభలో హాస్యజల్లు కురిపించారు. సాహిత్యమంటే మెటికలు విరిచేవారిలో సైతం ఆసక్తిని రేకెత్తించేలా బ్రహ్మానందం ఉపన్యసించారు. ‘‘భలే చెప్పారు బ్రహ్మానందం’’ అంటూ సభికులంతా హర్షధ్వానాలు ప్రకటించారు. ఈ అరుదైన సందర్భం... సోమవారం మాదాపూర్ దస్‌పల్లా హోటల్‌లోని దివంగత పోలవరపు కోటేశ్వరరావు సాహిత్య సర్వస్వం రెండో సంపుటి ఆవిష్కరణ సభలో చోటుచేసుకుంది.
ఈ పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య ఆవిష్కరించారు. తొలిప్రతిని కోటేశ్వరరావు భార్య సుజాతకు అందించారు. అనంతరం వెంకయ్య మాట్లాడారు. చాలారోజుల తర్వాత అద్భుతమైన ప్రసంగం విన్నానంటూ బ్రహ్మానందాన్ని కొనియాడారు. సాహిత్యమే తపస్సుగా ముందుకుసాగిన కోటేశ్వరరావు జీవితం ఈతరానికి ఆదర్శం అంటూ శ్లాఘించారు. ఆయన కథలు పల్లెపరిస్థితులను ప్రతిబింబిస్తాయన్నారు. కోటేశ్వరరావును సాహిత్య తపస్విగా అభివర్ణించారు. కోటేశ్వరరావు శైలి ప్రత్యేకమైనదన్నారు. ఆ రచనలన్నింటినీ రెండు సంపుటాలుగా తీసుకురావడంలో ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కృషి అభినందనీయమని ప్రశంసించారు. అక్షరం ఆయుధంకన్నా శక్తిమంతమైనదని, దాన్ని మంచికి వాడాలి అని రచయితలకు హితవుపలికారు.
కాగా ‘‘కోటేశ్వరరావు రచనల్లో దేశభక్తి, హేతుబద్ధమైన ఆలోచనలు కనిపిస్తాయి’’ అని బ్రహ్మానందం పేర్కొన్నారు. సమాజం సవ్యమైన మార్గం దిశగా ముందుకు సాగడానికి ఉత్తమ రచనలు దోహదపడతాయన్నారు. ఎమెస్కో విజయకుమార్ సభాధ్యక్షత వహించగా కార్యక్రమంలో ఆచార్య యార్లగడ్డ లక్షీప్రసాద్, పద్మశ్రీ అవార్డు గ్రహీత యడ్లపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Updated Date - Apr 11 , 2024 | 09:58 AM